ఇరాన్‌పై ట్రంప్ ఇజ్రాయెల్‌తో కలిసి దాడి చేయించడానికి ప్రధాన కారణం అక్కడున్న యురేనియం నిల్వలే. ఖమేనీ పాలన, ఇరాన్ న్యూక్లియర్ ప్రొగ్రామ్ పేరుతో పశ్చిమాసియాలో ట్రంప్ యుద్ధం స్టార్ట్ చేశాడు. ప్రస్తుతం జరుగుతున్న దాడుల్లో ఆ లక్ష్యం నెరవేరిందా? అంటే లేదనే చెప్పాల్సివస్తుంది. ఎందుకంటే, యురేనియం నిల్వలను ఇరాన్ చాలా సీక్రెట్‌గా దాచిపెట్టింది. అవి వైమానిక దాడులతో నాశనం కావు. మరి వాటిని ఇరాన్‌కు కాకుండా చేయాలంటే ఏం చేయాలి? సింపుల్.. గ్రౌండ్ ఆపరేషన్ నిర్వహించి వాటిని స్వాధీనం చేసుకోవాలి. రీసెంట్‌గా ట్రంప్ చెప్పింది ఇదే. ఇరాన్ దగ్గరున్న సుమారు 450 కిలోల అత్యంత శుద్ధి చేసిన యురేనియం నిల్వలను స్వాధీనం చేసుకునేందుకు స్పెషల్ ఆపరేషన్ నిర్వహించనున్నట్టు ట్రంప్ ప్రకటించాడు. ఇక్కడే ఇజ్రాయెల్ పవర్‌ఫుల్ టీమ్ పేరు తెరపైకి వచ్చింది.
ఇస్ఫహాన్, ఫోర్డో వంటి భూగర్భ కేంద్రాల్లో యురేనియం నిల్వలు ఉన్నట్లు రక్షణ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఆ అణు కేంద్రాలదగ్గరే ఇరాన్ ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్టు ఇటీవల శాటిలైట్ ఫొటోలు స్ఫష్టం చేశాయి. ఇరాన్ వీటిని ఎప్పుడైనా బయటకుతీసి బాంబు తయారీకి వాడే ప్రమాదం ఉందని అమెరికా ఆందోళన చెందుతోంది. అలా జరగొద్దంటే వాటిని స్వాధీనం చేసుకుని తీరాల్సిందే. ఈ ఆపరేషన్ రెండువిధాలుగా చేయాలని అమెరికా భావిస్తున్నట్టు నివేదికలు చెబుతున్నాయి. మొదటది యురేనియం నిల్వలను ఇరాన్ నుండి పూర్తిగా బయటకు తరలించడం. రెండోది అణు నిపుణులు అక్కడికక్కడే యురేనియంను డైల్యూట్ చేసి, దానిని ఆయుధాల తయారీకి పనికిరాకుండా చేయడం. కానీ, ఇవి చెప్పినంత ఈజీ కాదు.. ఇరాన్ తన అణు నిల్వలను పర్వతాల లోపల, వందల అడుగుల లోతులో భద్రపరిచింది. అక్కడికి చేరుకోవడం అంటే సూసైడ్ చేసుకోవడంతో సమానం. ఇక్కడే సయెరెట్ మత్కల్ యూనిట్ పేరు తెరపైకి వచ్చింది. ఎందుకంటే, ఇలాంటి ఆపరేషన్లు నిర్వహించగల సత్తా ఆ యూనిట్‌కే ఉంది. ఈ యూనిట్ సత్తా ఏంటో తెలియాలంటే ఒక ఆపరేషన్ గురించి తెలుసుకోవాలి. అదే ఆపరేషన్ థండర్ బోల్ట్.
అది 1967 జూన్ 27.. ఇజ్రాయెల్ విమానాన్ని హైజాక్ చేసిన పాలస్తీనా ఉగ్రవాదులు మొదట్లో లిబియా విమానాశ్రయంలో దాచిపెట్టారు. చుట్టూ అన్నిదేశాల సహకారంతోనే చేసినప్పటికీ వీళ్ళకు ధైర్యం చాల్లేదు.. ఇజ్రాయెల్ ఎలా అయినా వచ్చి బందీలను విడిపించుకు పోతుందనే భయంతో మళ్ళీ 4వేల కిలోమీటర్ల దూరంలోని రిమోట్ ఆఫ్రికన్ ఇస్లామిక్ దేశమైన ఉగాండాకు షిఫ్ట్ చేశారు. ఉగాండా సైన్యాధ్యక్షుడు ఈతీ అమీన్ రాక్షసుడు. ఇజ్రాయెల్ అంటేనే అతడికి ఎంతో మంట. దీంతో తీవ్రవాదులకు పూర్తి మద్దతు ప్రకటించి తన సైన్యాన్ని కూడా హైజాకర్స్‌కు సపోర్ట్‌గా నిలిపి, మారిషస్‌లో ప్రపంచదేశాల సమావేశాలకు వెళ్ళాడు. విమానంలోని కేవలం 54మంది ఇజ్రాయెల్ ప్రయాణికులను మాత్రమే బంధించి మిగతా దేశాల ప్రయాణికుల్ని విడుదల చేసి, రెండు కిలోమీటర్ల దూరంలోని హోటల్‌కి తరలించారు తీవ్రవాదులు. విమాన ప్రయాణికులను విడుదల చేయాలంటే, జైళ్లలో ఉన్న పాలస్తీనా తీవ్రవాదులందరినీ విడుదల చేయడమే కాక, 5 మిలియన్ డాలర్ల డబ్బు ఇవ్వాలని డిమాండ్ చేశారు. జులై 3 వరకే గడువిచ్చిన ఉగ్రవాదులు.. ఒక్క రోజు ఆలస్యమైనా ప్రయాణికులందరినీ ఊచకోత కోస్తామని హెచ్చరించారు.
ఉగ్రవాదుల డెడ్‌లైన్‌తో ఇజ్రాయెల్ కేబినెట్ అత్యవసరంగా సమావేశమైంది. ఇంటెలిజెన్స్ వింగ్ మొసాద్‌తో చర్చించింది. తర్వాత సీక్రెట్ ప్లాన్‌ను ఏమాత్రం బయటపెట్టకుండా ఉగ్రవాదుల డిమాండ్లకు సానుకూలంగా ఉన్నట్టు ప్రకటించి, కొంత గడువు కోరింది. ఎట్టి పరిస్థితుల్లో తలొగ్గదని భావించిన ఇజ్రాయెల్ ఇంత తొందరగా దిగివచ్చినందుకు ఉగ్రవాదులు ఎగిరి గంతేశారు. కానీ, వాళ్లకు అసలు విషయం తెలియదు. ఆ తర్వాత ఉగ్రవాదులు విధించిన డెడ్‌లైన్ జులై 3 అర్ధరాత్రే అసలు సినిమా మొదలైంది. చుట్టూ శత్రు దేశాలు.. ఎవరూ కనీసం విమానాల్లో ఇంధనం నింపుకోడానికి కూడా అనుమతివ్వరు. 4 వేల కిలోమీటర్ల దూరం ప్రయాణించాలి. వెళ్లడానికి తప్ప తిరిగి వచ్చేందుకు ఇంధనం సరిపోదు. పైగా ఎవరికి సమాచారం తెలిసినా ప్రాణాలు పోతాయి. అన్నీ ఆలోచించి మొత్తం 5 యుద్ధ విమానాల్లో మూడింట్లో బ్లాక్ కమాండోలు, ఒక దాంట్లో కమ్యూనికేషన్ సిస్టమ్, మెడికల్ ఎక్విప్‌మెంట్, ఒకటి ఖాళీగా ప్రయాణికులను తీసుకువచ్చేందుకు ఎర్రసముద్రం మీదుగా శత్రు రాడార్లకు అందకుండా 100మీటర్ల ఎత్తులో ఎగురుతూ ఉగాండా ఎయిర్‌పోర్టుకు వెళ్లాయి. అప్పుడు మారిషస్‌లో ఉన్న తమ అధ్యక్షుడే తిరిగి వచ్చినట్టు ఉగాండా అధికారులు భావించారు. ఎందుకంటే, ఇజ్రాయెల్ స్పెషల్ యూనిట్.. ఉగాండా అధ్యక్షుడు వాడుతున్న కలర్, డిజైన్ ప్లేన్‌లోనే వెళ్లింది. సో.. ఆ విమానం తమ అధ్యక్షుడిదే అని భ్రమపడ్డారు.
అచ్చంగా హాలీవుడ్ సినిమాలో చూపించి నట్టుగా. ఆ తర్వాత 15 నిమిషాల్లోనే మొత్తం సైనికులందరినీ మట్టుబెట్టి 2 కిలోమీటర్ల దూరంలోని ప్రయాణికులను బంధించిన హోటల్‌కు వెళ్లి అందరినీ తమ వెంట తీసుకెళ్లారు. ఈ 15 నిమిషాల గ్యాప్‌లోనే ఉగాండా ఎయిర్‌పోర్ట్ చుట్టుపక్కల ఉన్న డిఫెన్స్ వ్యవస్థ మొత్తాన్నీ ధ్వంసం చేసేశారు. అందరూ సేఫ్‌గా విమానంలోకి చేరుకున్న తర్వాతే తాను ఫ్లైట్ ఎక్కుతానని ఈ ఆపరేషన్ టీమ్ లీడర్.. యనాతన్ నేతన్యాహు మాత్రం బుల్లెట్ గాయాలతో మరణించారు. అతని ప్రేరణతో దేశసేవకై ముందుకొచ్చిన లీడరే ప్రస్తుత ఇజ్రాయెల్ ప్రధానిగా ఉన్న బెంజిమిన్ నేతన్యాహు.! సిల్వర్ స్క్రీన్లపై మాత్రమే కనిపించే ఇలాంటి రిస్కీ ఆపరేషన్లను విజయవంతంగా నిర్వహించిన హిస్టరీ సయెరెట్ మత్కల్‌కు ఉంది. ఆల్రెడీ ఇరాన్‌లో రహస్య ఆపరేషన్లు నిర్వహిస్తున్నట్టు నివేదికలు చెబుతున్నాయి. వీరితో పాటు అమెరికా స్పెషల్ యూనిట్లు కూడా సీన్‌లోకి దిగుతాయని ట్రంప్ మాటలను బట్టి అర్ధమవుతోంది. నేవీ సీల్స్ లేదా డెల్టా ఫోర్స్ వంటి అత్యున్నత స్థాయి కమాండోలను ఇరాన్‌కు పంపించే అవకాశం కనిపిస్తోంది. కానీ, ఈ ఆపరేషన్ ట్రంప్ చెప్పినంత ఈజీ అయితే కాదు.. ఎందుకంటే, ఇరాన్ కూడా అమెరికా, ఇజ్రాయెల్ సైనికుల కోసం ఎదురుచూస్తూ ఉంటుంది.