తెలుగు చలనచిత్ర పరిశ్రమలో 'పీపుల్స్ స్టార్'గా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు, దర్శకుడు ఆర్. నారాయణమూర్తి. సామాజిక అంశాలపై పోరాడే ఆయన, తాజాగా జరిగిన 'గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్' వేడుకలో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రెండు రాష్ట్రాల్లో సంచలనంగా మారాయి. గత కొన్నేళ్లుగా నిలిచిపోయిన 'నంది అవార్డుల' గురించి ఆయన ఎంతో ఆవేదనతో మాట్లాడారు. హైదరాబాద్లో వైభవంగా జరిగిన గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ కార్యక్రమంలో ఆర్. నారాయణమూర్తి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సినిమా రంగానికి అవార్డులు అనేవి కేవలం గౌరవం మాత్రమే కాదని, అవి కళాకారులకు ఇచ్చే ఒక గొప్ప ప్రోత్సాహమని పేర్కొన్నారు.
తెలంగాణ ప్రభుత్వం ప్రజా యుద్ధనౌక గద్దర్ పేరుతో అవార్డులను పునరుద్ధరించడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణలో సినిమా రంగాన్ని ప్రోత్సహిస్తూ, సాహసోపేతమైన నిర్ణయంతో గద్దర్ అవార్డులను మళ్ళీ మొదలుపెట్టిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి నారాయణమూర్తి వేదికపైనే సెల్యూట్ చేశారు. ఇదే స్ఫూర్తితో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఆలోచించాలని ఆయన కోరారు. చంద్రబాబు గారూ.. మీకు దండం పెడతాం.. దయచేసి నంది అవార్డులను పునరుద్ధరించండి. పరిశ్రమను ప్రోత్సహించండి. ఎంతోమంది కళాకారులు ఈ గుర్తింపు కోసం ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్నారు. అని నారాయణ మూర్తి ఆవేదన వ్యక్తంచేశాడు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాలం నుండి 'నంది అవార్డులు' అత్యంత ప్రతిష్టాత్మకమైనవిగా భావించేవారు. అయితే, రాష్ట్ర విభజన తర్వాత మారుతున్న రాజకీయ సమీకరణల వల్ల గత కొన్నేళ్లుగా ఈ అవార్డుల ప్రదానం నిలిచిపోయింది. దీనివల్ల ప్రతిభావంతులైన నటీనటులు, సాంకేతిక నిపుణులు నిరాశకు లోనవుతున్నారని నారాయణమూర్తి ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్. నారాయణమూర్తి చేసిన ఈ భావోద్వేగ విన్నపం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సినిమా పరిశ్రమలోని మిగిలిన పెద్దలు కూడా ఇదే కోరికను వినిపిస్తున్నారు. మరి ఏపీ ప్రభుత్వం దీనిపై ఎలా స్పందిస్తుందో, మళ్ళీ 'నంది' తన గంభీర స్వరంతో టాలీవుడ్లో ఎప్పుడు ప్రతిధ్వనిస్తుందో వేచి చూడాలి.