కాల్పుల విరమణ పొడిగించే ఛాన్సే లేదు.. ఒప్పందం ఒక్కటే ఆప్షన్.. ఒప్పందం కుదరక పోతే ఇరాన్‌పై బాంబులు పడతాయ్'. రెండు వారాల సీజ్ఫైర్ ముగియడానికి కొద్ది గంటల ముందు ట్రంప్ ఇచ్చిన మాస్ వార్నింగే ఇది. ఆ మాటకొస్తే రెండు వారాల క్రితం కూడా ఇటువంటి హెచ్చరికలే చేశాడు. ఇరాన్‌లోని విద్యుత్, ఇంధన, మౌలిక వసతులపై విరుచుకుపడతామనీ, ఇరాన్‌ను రాతియుగం నాటికి తిరిగి పంపిస్తామని తీవ్ర స్థాయిలో బెదిరించాడు. కానీ చివరి నిమిషంలో పాక్ ప్రధాని షరీఫ్, ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ రిక్వెస్ట్ చేశారని చెబుతూ రెండు వారాల కాల్పుల విరమణ ప్రకటించాడు. రెండు వారాల్లో చర్చలకు వచ్చి ఒప్పందం చేసుకోకపోతే ఇరాన్‌ను తుడిచిపెట్టేస్తామని పదే పదే చెబుతూ వచ్చాడు. కట్‌చేస్తే.. మరోసారి షరీఫ్, మునీర్ విజ్ఞప్తి చేశారంటూ పాత ప్రకటనే రిపీట్ చేశాడు. ఇరాన్‌తో కాల్పుల విరమణను పొడిగిస్తున్నట్టు ప్రకటించాడు.
ఇరాన్‌పై దాడి విషయంలో ట్రంప్ పదే పదే ఎందుకు వెనుకడుగు వేస్తున్నాడు? ఇరాన్‌తో తలపడలేమని నమ్ముతున్నాడా? టాప్ స్టోరీలో ఇరాన్‌ను ధ్వంసం చేస్తాం అని బీరాలు పలికిన ట్రంప్ నుంచి వచ్చిన ప్రకటనే ఇది. కాల్పుల విరమణ ఒప్పందం మరికొన్ని గంటల్లో ముగుస్తుందనగా గడువు మరికొన్ని రోజులు పొడిగించాడు. ఇరాన్ తమ ప్రతిపాదనను సమర్పించే వరకు కాల్పుల విరమణను పొడిగిస్తున్నట్లు ప్రకటించాడు. పాకిస్తాన్ ప్రధాని హెహబాజ్ షరీఫ్, ఆర్మీ చీఫ్, ఫీల్డ్ మార్షల్ ఆసిమ్ మునీర్ విజ్ఞప్తి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపాడు. కాల్పుల విరమణను పొడిగించడానికి ఆయనను ప్రేరేపించిన విషయాలను ట్రంప్ వెల్లడించలేదు. కానీ తన ట్రూత్ సోషల్ పోస్ట్‌లో రెండు కారణాలను పేర్కొన్నాడు. మొదటిది ఇరాన్ విభజన. రెండోది ఇరాన్ ప్రతిపాదనను సమర్పించడానికి అనుమతించాలని, అప్పటివరకు దాడులను నిలిపివేయాలని పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, ఆసిమ్ మునీర్ విజ్ఞప్తి చేశారని ట్రంప్ పేర్కొన్నాడు. ఇక ట్రంప్ సీజ్ ఫైర్ కొంతకాలం పొడిగిస్తున్నట్లు ప్రకటించడంపై పాక్ స్పందించింది. తమ అభ్యర్థనను అంగీకరించినందుకు ట్రంప్‌నకు షరీఫ్ ధన్యవాదాలు తెలిపాడు.
మరోవైపు.. ట్రంప్ కాల్పుల విరమణను పొడిగించినట్లు చేసిన ప్రకటనను ఇరాన్ ప్రభుత్వం తిరస్కరించింది.
ఇరాన్ పార్లమెంట్ స్పీకర్, చర్చల ప్రతినిధి మొహమ్మద్ బాకర్ గాలిబఫ్ సలహాదారు ఒకరు, ఇది అమెరికా ఆకస్మిక దాడికి ఎత్తుగడగా పేర్కొన్నారు. ఇరాన్ పోర్టులను అమెరికా నిరంతరం దిగ్బంధించడంపై సైనికచర్య తీసుకోవాలని టెహ్రాన్ భావిస్తోంది. అందుకే సీజ్ఫైర్ పొడిగింపును ఇరాన్ వ్యతిరేకించింది. సింపుల్‌గా చెప్పాలంటే, అమెరికాతో యుద్ధానికే ఇరాన్ మొగ్గుచూపుతోంది. అమెరికాతో ఢీ అంటే ఢీ అనడానికే సిద్ధంగా ఉంది. కానీ, ఇరాన్‌తో యుద్ధానికి అమెరికానే సిద్ధం లేనట్టు కనిపిస్తోంది. ఉండి ఉంటే ఈపాటికే భీకర దాడులకు దిగి ఉండేదనేది విశ్లేషకుల మాట. అయితే, ఇక్కడ అసలైన ఫెయిల్యూర్ పాకిస్తాన్‌ది. ఎందుకంటే, తనను తాను పీస్ మేకర్‌గా సెల్ఫ్ డబ్బా కొట్టుకున్న ఉగ్రదేశం.. రెండో విడత శాంతి చర్చలకు ఇరు పక్షాలనూ ఒప్పించలేకపోయింది. కనీసం చర్చల టేబుల్ దగ్గరకు కూడా ఇరు పక్షాలను చేర్చలేకపోయింది. ఈ యుద్ధ సంక్షోభం ముగియకపోవడం పాకిస్తాన్‌కే అతిపెద్ద దెబ్బగా మారబోతోంది.
అమెరికా, ఇరాన్ మధ్య విభేదాలను తగ్గించడానికి పాకిస్తాన్ పడుతున్న ఆరాటం వెనుక, తన దౌత్యపరమైన స్థాయిని మార్చుకుని పెట్టుబడులను ఆకర్షించాలనే ప్రయత్నం ఉంది. అస్థిరమైన మధ్యప్రాచ్యం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఇస్లామాబాద్‌కు ఏమాత్రం శ్రేయస్కరం కాదు. ఈ సంక్షోభం కేవలం ప్రాంతీయ శాంతికే ముప్పు కాదు, సౌదీ అరేబియాతో ఉన్న భద్రతా ఒప్పందం, గల్ఫ్ నుండి వచ్చే ఇంధన సరఫరాలపై ఆధారపడటం వల్ల పాకిస్తాన్ కూడా ఈ యుద్ధంలోకి లాగబడే ప్రమాదం ఉంది. పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే, డబ్బు ఆదా చేయడానికి రోజువారీ విద్యుత్ కోతలు విధిస్తోంది, సౌదీ నుండి 3 బిలియన్ల అత్యవసర రుణం తీసుకుంది. అంతర్జాతీయంగా పరపతి పెరిగితే పెట్టుబడులు వస్తాయని ఆ దేశం ఆశిస్తోంది. కానీ, రెండో విడత చర్చలు నిర్వహించడంలో దారుణంగా ఫెయిలైంది.
నిజానికి.. పాకిస్తాన్‌కు మధ్యవర్తిత్వ బాధ్యత వహించేంత సీన్ లేదు. ఇరాన్ ముందు నుంచీ పాకిస్తాన్ మధ్యవర్తిత్వాన్ని నమ్మలేదు. పాక్‌ను నమ్మింది కేవలం ట్రంప్ ఒక్కడే. ఎందుకంటే, అతడేం చెప్పినా తలాడించే లీడర్లు కావాలి. గతేడాది పాక్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ వైట్ హౌస్‌ను సందర్శించినప్పుడు ఈ బాధ్యతను స్వీకరించినట్లు నివేదికలు చెబుతున్నాయి. ఆ బాధ్యతలను నిర్వర్తించే క్రమంలోనే ట్రంప్ చెప్పిందల్లా చేస్తున్నట్టు కనిపిస్తోంది. ఇరాన్‌పై ఆఖరి నిమిషంవరకూ అన్నిరకాల ఒత్తిళ్లనూ ప్రయోగించడం, చివరికి టెహ్రాన్ దారికి రాకపోయేసరికి పాకిస్తాన్ పాలకులు రిక్వెస్ట్ చేశారంటూ కాల్పుల విరమణ పొడిగించడం.. పక్కాప్లాన్ ప్రకారమే జరుగుతున్నట్టు కనిపిస్తోంది. వాస్తవానికి.. ఇరాన్‌తో యుద్ధం విషయంలో ట్రంప్ లెక్కలన్నీ తప్పాయి. రెండు మూడు వారాల్లో ఇరాన్ కథ ముగించొచ్చు అని నమ్మిన ట్రంప్.. తర్వాత ఇరాన్‌తో అంత ఈజీ కాదు అని రియలైజ్ అయ్యాడు. అందుకే, పాక్‌ను అడ్డుపెట్టుకుని కాల్పుల విరమణ పేరుతో సాగదీత వ్యవహారాలు చేస్తున్నాడు. అల్టిమేట్‌గా ఇందులో బలవుతోంది మాత్రం పాకిస్తానే.