ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ కేవలం వెండితెరపైనే కాదు, తన మాటలతోనూ ప్రేక్షకులను ఆలోచింపజేయడంలో సిద్ధహస్తుడు. లాక్డౌన్ సమయంలో ఆయన ప్రారంభించిన ‘పూరి మ్యూజింగ్స్’ పాడ్‌కాస్ట్ సిరీస్ ఎంతటి సంచలనం సృష్టించిందో మనందరికీ తెలిసిందే. తాజాగా, కొంత విరామం తర్వాత పూరి మళ్ళీ తన గళాన్ని విప్పారు. ఈసారి ఆయన ఎంచుకున్న అంశం ‘సైన్స్ అండ్ బిలీఫ్’.
పరిశోధనలు, ఆధారాలు లేనిదే దేన్నీ నమ్మకూడదనే పూరి జగన్నాథ్ సిద్ధాంతం ఈ తాజా ఎపిసోడ్లో మరోసారి స్పష్టమైంది. అసలు సైన్స్‌కు, నమ్మకానికి మధ్య ఉన్న తేడా ఏంటి? మనం దేని ఆధారంగా బతకాలి? అనే విషయాలపై ఆయన తనదైన శైలిలో విశ్లేషించారు. పూరి జగన్నాథ్ తన ప్రసంగంలో ప్రధానంగా ఒక విషయాన్ని నొక్కి చెప్పారు. "మనం ఈ ప్రపంచాన్ని శాస్త్రబద్ధంగా అర్థం చేసుకోవాలి తప్ప, మనకున్న గుడ్డి నమ్మకాలు లేదా తరతరాలుగా వస్తున్న సంప్రదాయాల ఆధారంగా కాదు." అని ఆయన పేర్కొన్నారు.
నమ్మకం కేవలం కథల నుంచి పుడుతుంది. ఎవరో చెప్పిన విషయాన్ని లేదా పూర్వీకులు రాసిన కథలను ఆధారంగా చేసుకుని ఒక నమ్మకం ఏర్పడుతుంది. కానీ, ప్రయోగాలు చేసి, ఫలితాలు వచ్చిన తర్వాతే సైన్స్ ఒక విషయాన్ని అంగీకరిస్తుంది."సైన్స్‌తో మీరు చంద్రమండలానికి వెళ్లవచ్చు, కానీ నమ్మకంతో కేవలం స్వర్గానికి మాత్రమే వెళ్లగలరు" అంటూ పూరి చేసిన వ్యాఖ్య ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. చాలామంది తమ అభిప్రాయాలనే నిజాలుగా భ్రమిస్తుంటారని పూరి అభిప్రాయపడ్డారు. ఈ విశ్వం మన అభిప్రాయాల మీదనో, కోరికల మీదనో నడవదు. దీనికి కొన్ని స్థిరమైన నియమాలు ఉంటాయి. సైన్స్ ఎప్పుడూ ఆ నియమాలనే వెదుకుతుంది.
ఉదాహరణకు, గ్రావిటీ గురించి చెబుతూ— "మీ చేతిలో నుంచి ఒక వస్తువు జారితే అది కింద పడాల్సిందే. అక్కడ మీరు ఎవరు, మీ నమ్మకం ఏంటి అన్నది ప్రకృతికి అనవసరం. గ్రావిటీ అనేది ఒక సైన్స్, అది అందరికీ సమానంగా వర్తిస్తుంది." అని ఆయన వివరించారు. పూరి జగన్నాథ్ ప్రకారం, జ్ఞానానికి మొదటి మెట్టు ప్రశ్నించడం. దేనినీ గుడ్డిగా నమ్మకూడదు. సైన్స్ ప్రతి విషయాన్నీ పరీక్షిస్తుంది, విశ్లేషిస్తుంది, ఆపైనే అంగీకరిస్తుంది. మనం కూడా మన జీవితాల్లో ఎదురయ్యే విషయాలను తర్కంతో ఆలోచించాలని ఆయన సూచించారు.నమ్మకం అనేది మనిషిని ఒక చట్రంలో బంధిస్తే, సైన్స్ సరిహద్దులను చెరిపేసి కొత్త లోకాలను పరిచయం చేస్తుంది. మనిషి ఎదుగుదల అనేది కేవలం వాస్తవాలను గ్రహించినప్పుడే సాధ్యమవుతుందని ఈ ‘మ్యూజింగ్స్’ సారాంశం.