Top story:వెల్కమ్ వర్మ గారు… పిఠాపురం వర్మకి వైసిపి వల…అందుకే రెచ్చి పోతున్నారా…?

పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ కి వైసీపీ వలవేస్తోందా? చంద్రబాబు నీకు అన్యాయం చేస్తే.... మేం నీకు న్యాయం చేస్తామని చెప్తోందా? 2029లో పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పై నేరుగా వర్మ నే తమ అభ్యర్థిగా వైసిపి దింపబోతోందా?

Post Published By: dialnews
Updated : 25 April 2026, 1:23 PM IST

పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ కి వైసీపీ వలవేస్తోందా? చంద్రబాబు నీకు అన్యాయం చేస్తే.... మేం నీకు న్యాయం చేస్తామని చెప్తోందా? 2029లో పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పై నేరుగా వర్మ నే తమ అభ్యర్థిగా వైసిపి దింపబోతోందా?అందుకే శ్రీ వత్సవాయి సత్యనారాయణ వర్మ అయినదానికి కానిదానికి, అలా రెచ్చిపోతున్నా రా? ఏదో విధంగా తెలుగుదేశం నుంచి బయట పడాలని చూస్తున్నారా? తన సీటుని పవన్ కళ్యాణ్ కి కట్టబెట్టి, తనకు ఎమ్మెల్సీ ఇవ్వకుండా ఏడిపిస్తున్న చంద్రబాబుకి గట్టిగా బుద్ధి చెప్పాలనుకుంటున్నా రా?

పిఠాపురం జనసేన నాయకులతో టిడిపి నేత, మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ గొడవ పడడం ఈ రెండేళ్లలో ఇది నాలుగో సారి. కారణం ఏదైనాప్పటికీ వర్మ తన నిరసనను, ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూనే ఉన్నారు. పిఠాపురంలో తాను చాలా అసహనంతో ఉన్నానని, అసంతృప్తితో ఉన్నానని విషయాన్ని తెలుగుదేశం హై కమాండ్ కి స్పష్టంగా చెబుతున్నారు. ఒకపక్క లోకేష్ భజన చేస్తూనే, ఆయనంతటి మొనగాడు పార్టీలో లేడని చెప్తూనే మరోపక్క నియోజకవర్గంలో జనసేన నాయకులతో గొడవ పడుతున్నారు, పార్టీ అధినేత చంద్రబాబును తరచూ ఇరుకున పెడుతున్నారు. ఇదంతా వర్మ ఎందుకు చేస్తున్నారు... అన్నదే ఇప్పుడు అందరి ముందు ఉన్న ప్రశ్న. ఎమ్మెల్సీ, మంత్రి పదవి ఇవ్వలేదని అక్కసుతో ఇలా అసంతృప్తిని వెళ్ళగకుతున్నారా? లేక తెలుగుదేశాన్ని వదిలి వెళ్ళిపోవాలన్న నిర్ణయంతో వాళ్లు పొమ్మనకుండానే తానే పొగ పెట్టేసుకుంటున్నారా? రాష్ట్ర రాజకీయాల్లో ఇప్పుడు జరుగుతున్న చర్చ ఇదే.

పిఠాపురం అంటే ఎస్ వి ఎస్ ఎన్ వర్మ. వర్మ అంటే పిఠాపురం. తెలుగుదేశం పార్టీ అధికారంలో లేనప్పుడు, పార్టీ తనకు టికెట్ ఇవ్వనప్పుడు కూడా వర్మ తన సొంత బలంతో, సొంత ఇమేజ్ తో పిఠాపురంలో గెలుపొందారు. అందుకే వర్మ స్పెషల్ అంటారు. ఇప్పటివరకు పెద్దగా అవినీతి ఆరోపణలు కూడా లేని టిడిపి నేత ఆయన. అలాంటి వర్మకు మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ రూపంలో పెద్ద దెబ్బ పడింది. మరోసారి పిఠాపురంలో ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి కావాలన్నా వర్మ ఆలోచనకు గండి కొడుతూ పవన్ కళ్యాణ్ పిఠాపురం టిక్కెట్ ని ఎంచుకున్నారు. దీనికి కారణం అక్కడ 70 వేలకు పైగా ఉన్న కాపు ఓట్లు. పిఠాపురం తనకు సేఫ్ జోన్ అని... కాపుల ఓట్లు వేస్తే చాలు గెలుస్తానని నమ్మకంతో పిఠాపురం టికెట్టు కావాల్సిందేనని పవన్ పట్టుబడ్డారు. అప్పటికే రెండు అసెంబ్లీ స్థానాల్లో ఓడిపోయి ఉన్నారు పవన్. మళ్లీ ఈసారి ఓడిపోతే పరువు పోతుందనే భయంతో ఆయన పిఠాపురం ఎంచుకున్నారు.

కూటమి ధర్మాన్ని అనుసరించి, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మాట ఇవ్వడంతో వర్మ పిఠాపురం టికెట్ ని త్యాగం చేసి, అన్ని తానై.... వెనక ఉండి పవన్ కళ్యాణ్ ని జనసేన ఎమ్మెల్యేగా గెలిపించారు. వర్మ కు ఎమ్మెల్సీ టికెట్ తో పాటు మంత్రి పదవి ఇస్తామని చంద్రబాబు ఎన్నికల ముందు హామీ ఇచ్చారు. కానీ దురదృష్టవశాత్తు కూటమి సర్కారు వచ్చి రెండు ఏళ్లు అయినా ఇప్పటివరకు వర్మకు ఎమ్మెల్సీ ఇవ్వలేదు. ఈ విషయంలో ఆయన విపరీతంగా రగిలిపోతున్నారు. దీనికి తోడు తూర్పుగోదావరి జిల్లాలో వర్మ హవాను తగ్గించాలని, పిఠాపురంలో వర్మ అనే వాడిని లేకుండా చేయాలని పెండెం దొరబాబు లాంటి జనసేన నేతలు రోజుకో ఫిట్టింగ్ పెడుతూనే ఉన్నారు. తన నియోజకవర్గంలో వచ్చి తన సీటు కొట్టేయడమే కాకుండా తనకు రాజకీయ ఉనికి లేకుండా చేస్తున్నారని బాధతో తరచూ వర్మ ,జనసేన నాయకులతో గొడవ పడుతూనే ఉన్నారు. అది ఈ మధ్యకాలంలో పీక్స్ కి చేరిపోయింది. ఇంత గొడవ జరుగుతున్న..... చంద్రబాబు లోకేష్ లు పట్టించుకోకపోవడం, పవన్ కళ్యాణ్ రియాక్ట్ అవ్వకపోవడంతో వర్మలో అసహనం నానాటికి పెరిగిపోతుంది.

ఇదే అదునుగా గోదావరి జిల్లాలకు చెందిన ఇద్దరు వైసిపి నేతలు వర్మ ని కాంటాక్ట్ చేశారు. నిజానికి వర్మ కు పార్టీ మారాలని ఆలోచన ఇప్పటివరకు లేకపోయినప్పటికీ, మీరు వైసీపీకి ఎందుకు రాకూడదు? అని ఆయన ముందు వాళ్ళు ప్రతిపాదన పెట్టినట్లు సమాచారం. అయితే ఇప్పటివరకు వర్మ తాను వైసిపి కి వస్తానని మాట ఇవ్వలేదు. ఎమ్మెల్సీ ఇవ్వకపోతే టిడిపిని వదిలిపెడతానని ఎవరిని హెచ్చరించనూ లేదు. అయితే వర్మ కు మాత్రం వైసీపీలోకి ఓపెన్ ఆఫర్ ఉంది.2029 లో కూడా తనకు పిఠాపురం టిడిపి టికెట్టు రాదు. ఎమ్మెల్సీ పదవి ఇచ్చి మంత్రిని చేస్తారో లేదో తెలియదు. అసలు 29లో కూటమి సర్కారు వస్తుందో లేదో గ్యారంటీ లేదు. అన్నిటికీ మించి చంద్రబాబుకు కుప్పం, జగన్మోహన్ రెడ్డికి పులివెందుల లాగే తనకి కూడా ఒక స్థిరమైన నియోజకవర్గ ఉండాలని, పవన్ కళ్యాణ్ డిసైడ్ అయిపోయారు.

తన కన్నతల్లి లాంటి పిఠాపురం ఎవరికో సొంత నియోజకవర్గం అయిపోవడం వర్మ జీర్ణించుకోలేకపోతున్నారు. ఇవాళ ఎమ్మెల్సీ తో పాటు తనకు మంత్రి పదవి ఇచ్చిన.... పిఠాపురం తో తన అనుబంధాన్ని ఎలా తెచ్చుకోగలనని మదన పడిపోతున్నారు వర్మ. అందుకే తరచూ జనసేన నేతలతో గొడవ పడుతున్నారు. తన రాజకీయ ఉనికి కోసం ఆరాటపడుతున్నారు. మరో ఏడాదిన్నర వరకు ఇలాగే పరిస్థితి కొనసాగితే, తనకు ఇచ్చిన హామీని చంద్రబాబు పవన్ కళ్యాణ్ నిలబెట్టుకోలేక పోతే ఎస్ వి ఎస్ ఎన్ వర్మ వైసీపీకి వెళ్లిపోవడం ఖాయం. తాను ఏ నిర్ణయం తీసుకున్న తన సొంత కార్యకర్తలు, నాయకులు తనతోనే ఉంటారని, తన నిర్ణయానికి కారణం ఏమిటో వాళ్లకి తెలుసని అభిప్రాయంతో ఉన్నారు వర్మ. ఏది ఏం జరిగినా మరికొన్ని రోజుల్లో పిఠాపురం వర్మ మరోసారి వార్తలకి ఎక్కబోతున్నారు.

 

Published : 
  • 25 April 2026, 1:23 PM IST