కన్నడ రాకింగ్ స్టార్ యష్ హీరోగా, గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘టాక్సిక్’. అనౌన్స్‌మెంట్ నుంచే భారీ అంచనాలు నెలకొన్న ఈ సినిమా చుట్టూ ఇప్పుడు ఫిలిం నగర్‌లో ఒక ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. తాజాగా ఈ చిత్ర హీరోయిన్ కియారా అద్వానీ మేకర్స్‌కు పెట్టిన ఒక కండిషన్ ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. మొదట ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. కానీ, యష్ ఈ చిత్రాన్ని కేవలం భారతీయ సినిమాగా కాకుండా, ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్ మూవీగా తీర్చిదిద్దాలని పట్టుదలతో ఉన్నారు. గ్లోబల్ మార్కెట్‌ను దృష్టిలో ఉంచుకుని, గ్రాఫిక్స్ మరియు పోస్ట్ ప్రొడక్షన్ పనుల కోసం మరికొంత సమయం కేటాయించారు.
దీనివల్ల సినిమా విడుదలను జూన్ 4వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు స్వయంగా యష్ ప్రకటించారు. ఈ వాయిదా వెనుక ఉన్న అసలు కారణం.. ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో రిలీజ్ చేయాలనే పక్కా ప్లాన్. అయితే, సినిమా వాయిదా పడటం ఒక ఎత్తయితే, హీరోయిన్ కియారా అద్వానీ నుంచి వచ్చిన రిక్వెస్ట్ ఇప్పుడు చిత్ర యూనిట్‌ను కలవరపెడుతోంది. అందుతున్న సమాచారం ప్రకారం.. ‘టాక్సిక్’లో కొన్ని ఇంటిమేట్ సీన్లు ఉన్నాయట. షూటింగ్ సమయంలో వీటికి అంగీకరించినప్పటికీ, ఇప్పుడు ఫైనల్ ఎడిటింగ్ చూసిన తర్వాత కియారా తన నిర్ణయాన్ని మార్చుకున్నట్లు తెలుస్తోంది.
షూటింగ్ సమయంలో కథా పరంగా ఆ సీన్లకు కియారా ఓకే చెప్పారు. కానీ, ఫైనల్ అవుట్‌పుట్ చూశాక, ఆ సీన్లు తన ప్రస్తుత ‘ఇమేజ్’కు ఇబ్బంది కలిగిస్తాయని ఆమె భావిస్తున్నారు. ఆ బోల్డ్ సన్నివేశాలను వెంటనే ట్రిమ్ చేయాలని లేదా పూర్తిగా తొలగించాలని ఆమె మేకర్స్‌ను కోరినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. టాక్సిక్’ వంటి భారీ చిత్రంలో అతిగా గ్లామర్ ప్రదర్శిస్తే అది తన కెరీర్‌కు మైనస్ అవుతుందేమో అన్నది ఆమె ఆందోళనగా కనిపిస్తోంది. సినిమా కంటెంట్ బాగుండాలి, కానీ అది నా వ్యక్తిగత ఇమేజ్‌ను ప్రభావితం చేయకూడదు అనేది కియారా వాదనగా సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. దర్శకురాలు గీతూ మోహన్ దాస్ సినిమాలంటేనే రియలిస్టిక్‌గా, రా అండ్ రస్టిక్‌గా ఉంటాయి. కథలో భాగంగా ఆ సీన్లు చాలా కీలకమని టీమ్ భావిస్తోంది. అయితే, స్టార్ హీరోయిన్ రిక్వెస్ట్ చేయడంతో ఇప్పుడు మేకర్స్ డైలమాలో పడ్డారు. సీన్లు తొలగిస్తే కథా బలం తగ్గుతుందా? లేక కియారా మాట విని ఎడిటింగ్‌లో మార్పులు చేస్తారా? అన్నది వేచి చూడాలి.