ఆయాషేర్…!

తమిళ చిత్ర పరిశ్రమలో 'దళపతి'గా అశేష ప్రేక్షకాదరణ పొందిన విజయ్, ఇప్పుడు రాజకీయ క్షేత్రంలో తనదైన ముద్ర వేసేందుకు సిద్ధమయ్యారు. ఆయన స్థాపించిన 'తమిళగ వెట్రి కళగం' పార్టీ తమిళనాడు రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది.

Post Published By: dialnews
Updated : 5 May 2026, 10:15 PM IST

తమిళ చిత్ర పరిశ్రమలో 'దళపతి'గా అశేష ప్రేక్షకాదరణ పొందిన విజయ్, ఇప్పుడు రాజకీయ క్షేత్రంలో తనదైన ముద్ర వేసేందుకు సిద్ధమయ్యారు. ఆయన స్థాపించిన 'తమిళగ వెట్రి కళగం' పార్టీ తమిళనాడు రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది. కేవలం గ్లామర్‌తోనే కాకుండా, బలమైన ఆశయాలతో విజయ్ ప్రజల్లోకి వెళ్తున్నారు.విజయ్ రాజకీయాల్లోకి రావడం ఒక్కరోజులో జరిగిన మార్పు కాదు. 2009లోనే దాదాపు 85 వేల ఫ్యాన్స్ క్లబ్‌లను ఏకం చేసి ‘విజయ్ మక్కల్ ఇయక్కమ్’ అనే సామాజిక సేవా సంస్థను స్థాపించారు. 2011 ఎన్నికల్లో ఈ సంస్థ అన్నాడీఎంకే కూటమికి మద్దతు ఇవ్వడం ద్వారా విజయ్ తొలిసారిగా తన రాజకీయ ఆకాంక్షను బయటపెట్టారు. 2020లో ఈ సంస్థను రాజకీయ పార్టీగా మార్చే ప్రయత్నాలు తండ్రి ఎస్.ఏ. చంద్రశేఖర్ ద్వారా జరిగినా, విజయ్ అప్పట్లో వాటిని తోసిపుచ్చారు. చివరకు ఫిబ్రవరి 2024లో 'తమిళగ వెట్రి కళగం'ను అధికారికంగా ప్రకటించి, రాజకీయాలే తన పూర్తి జీవితమని స్పష్టం చేశారు.

విజయ్ విడుదల చేసిన పార్టీ మేనిఫెస్టో మహిళలు మరియు యువతను ప్రధానంగా లక్ష్యం చేసుకుంది.యువతకు ఉన్నత విద్య కోసం 25 లక్షల వరకు విద్యా రుణాలు. మహిళా సంక్షేమం కోసం మహిళలకు నెలకు 2,500 రూపాయల ఆర్థిక సాయం మరియు ఏడాదికి ఆరు ఉచిత గ్యాస్ సిలిండర్లు.సామాజిక భద్రత కోసం పేదింటి ఆడపిల్లల పెళ్లి కానుకగా 8 గ్రాముల బంగారం. రైతు మరియు మత్స్యకారుల కోసం డీజిల్‌పై సబ్సిడీ, బీమా సౌకర్యం మరియు ప్రత్యేక రిలీఫ్ ఫండ్స్. కులగణనపై స్పష్టమైన హామీ ఇవ్వడంతో పాటు, డీఎంకే అవినీతి పాలనను ఎండగట్టడమే విజయ్ విజయంలో కీలకపాత్ర పోషించింది. విజయ్ ప్రయాణం అపూరూపంగా సాగినా, వివాదాలు కూడా ఆయనను చుట్టుముట్టాయి. గతేడాది సెప్టెంబర్‌లో కరూర్ ర్యాలీలో జరిగిన తొక్కిసలాటలో 41 మంది మృతి చెందడం ఆయనకు ఒక చేదు జ్ఞాపకంగా మిగిలింది.

వ్యక్తిగత జీవితంలో భార్య సంగీత నుంచి విడాకుల వ్యవహారం కూడా రాజకీయ ప్రత్యర్థులకు ఆయుధంగా మారింది. అయినప్పటికీ, వీటిని అధిగమిస్తూ ఆయన తన చివరి చిత్రం ‘జననాయగన్’ తర్వాత పూర్తిస్థాయిలో ప్రజాక్షేత్రంలోనే ఉంటానని ప్రకటించడం ఆయన పట్టుదలకు నిదర్శనం. తమిళనాడు రాజకీయ చరిత్రలో ఎంజీఆర్, జయలలిత వంటి వారు సినీ గ్లామర్‌తో వచ్చి ప్రజల మనసులు గెలిచి ముఖ్యమంత్రులయ్యారు. ఇప్పుడు విజయ్ గెలుపును కూడా రాజకీయ విశ్లేషకులు అదే కోణంలో చూస్తున్నారు. జెన్-జీ యువతలో విజయ్‌కి ఉన్న తిరుగులేని ఫాలోయింగ్ ఆయనకు పెద్ద అసెట్. ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోకుండా ఒంటరిగా పోరాడుతున్న విజయ్, ప్రజలకు 'గోట్' లీడర్‌గా కనిపిస్తారా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. సినిమాల్లో విలన్లను ఓడించినట్లుగా, రాజకీయ క్షేత్రంలో వ్యవస్థీకృత అవినీతిని, వారసత్వ రాజకీయాలను విజయ్ ఢీకొట్టగలరా? కాలమే సమాధానం చెప్పాలి. కానీ, ఆయన తెగువ మరియు ప్రజాకర్షణ చూస్తుంటే తమిళనాడు రాజకీయాల్లో ఒక సరికొత్త అధ్యాయం మొదలైందని మాత్రం స్పష్టమవుతోంది.

Published : 
  • 5 May 2026, 10:15 PM IST