గతేడాది చివర్లో భారత్‌కు రష్యా ఒక బంపరాఫర్ ఇచ్చింది. ఎలాంటి పరిమితులు లేకుండా su-57 యుద్ధ విమానాల తయారీ టెక్నాలజీని ఇండియాకు బదిలీ చేయడానికి సిద్ధమని చెప్పింది. su-57 ఫైటర్ల టెక్నాలజీ బదిలీలో భాగంగా కీలక విభాగాల సాంకేతిక పరిజ్ఞానాన్నీ అందిస్తామంది. ఇంజిన్లు, ఆప్టిక్స్, ఏఈఎస్‌ఏ రాడార్లు, AI ఎలిమెంట్స్, లో సిగ్నేచర్ టెక్నాలజీ, మోడర్న్ ఎయిర్ వెపన్స్ తయారీ ప్రక్రియతో ముడిపడిన సాంకేతికతని భారత్‌కు బదిలీ చేస్తామంది. సప్లై చైన్‌కు ఆంక్షలు ఆటంకంగా మారుతాయనే ఆందోళన కూడా లేకుండా, ఫైటర్ జెట్ల విడిభాగాలను భారత్ స్వదేశంలోనే తయారు చేసుకోవచ్చని ప్రకటించింది. యుద్ధ విమానాల్లోని సాఫ్ట్‌వేర్, ఇతర వ్యవస్థల్లో చేసే కొత్తకొత్త ఇంప్రూవ్‌మెంట్లపైనా ఎప్పటికప్పుడు భారత్‌కు అప్‌డేట్స్‌ను అందిస్తామని రష్యా హామీ ఇచ్చింది.
భారత్ అడక్కుండానే సోర్స్ కోడ్ ఇస్తామని తెలిపింది. ఇన్నిఆఫర్లు ఇచ్చినా భారత్ ఓకే చెప్పలేదు. ఎందుకంటే రష్యా యుద్ధ విమానాల ఇంజిన్ల పనితీరు, ఉక్రెయిన్ యుద్ధం వల్ల వాటి విడిభాగాల సరఫరాలో ఆలస్యం వంటి అంశాలు భారత్‌ను ఆలోచనలో పడేశాయి. కట్‌చేస్తే.. ఇప్పుడు ఫ్రాన్స్‌తో రాఫెల్ ఫైటర్ జెట్ల డీల్‌కే భారత్ సిద్ధపడుతోందని నేషనల్ మీడియా కథనాలు తేల్చేశాయి.భారత్ ఫ్రాన్స్ నుండి 114 రాఫెల్ యుద్ధ విమానాలను కొనుగోలు చేసే దిశగా వేగంగా అడుగులు వేస్తోంది. ఇందుకు సంబంధించిన 'లెటర్ ఆఫ్ రిక్వెస్ట్' సిద్ధమైందని, దీనిని రాబోయే కొన్ని వారాల్లో ఫ్రాన్స్‌కు పంపనున్నట్లు ఇండియన్ ఎక్స్‌ప్రెస్ కథనం పేర్కొంది. లెటర్ ఆఫ్ రిక్వెస్ట్ అనేది రక్షణ ఉత్పత్తుల కొనుగోళ్లను ప్రారంభించడానికి ఉపయోగించే ఒక అధికారిక ప్రభుత్వ పత్రం. దీనికి ఫ్రాన్స్ స్పందించిన తర్వాత, భారత్ 'రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్'ను ఖరారు చేస్తుంది. జూన్ మొదట్లో భారత వైమానిక దళ చీఫ్ ఎయిర్ చీఫ్ మార్షల్ ఎ.పి. సింగ్ ఫ్రాన్స్‌లో పర్యటించనున్నారు. ఆ తర్వాత అదే నెలలో ప్రధాని మోదీ కూడా ఫ్రాన్స్ వెళ్లనున్నారు. ఈ ఏడాది చివరి నాటికి రాఫెల్ ఒప్పందంపై సంతకాలు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందనేది ఇండియన్ ఎక్స్‌ప్రెస్ కథనం సారాంశం.
ఇక భారత్-ఫ్రాన్స్ మధ్య చర్చల్లో ఉన్న ఒప్పందం ప్రకారం 114 యుద్ధ విమానాల్లో 96 విమానాలను భారత్‌లోనే స్థానిక భాగస్వామ్యంతో తయారు చేస్తారు. మిగిలిన 18 విమానాలు నేరుగా ఫ్రాన్స్ నుండి వస్తాయి. ఇండియా అత్యంత శక్తివంతమైన రాఫెల్ F4 లేదా భవిష్యత్తులో F5 వెర్షన్‌ను కొనుగోలు చేయనుంది. ప్రస్తుతం ఎఫ్3ఆర్ వెర్షన్‌ను వాడుతున్నారు. తాజాగా ఎఫ్4 వెర్షన్‌ను డసాల్ట్ ఏవియేషన్ సంస్థ రిలీజ్ చేసింది. అయితే ఎప్-4, ఎఫ్-5 వెర్షన్‌ను మిక్స్ చేసి కొత్త రాఫెల్‌ను తయారు చేయాలని భారత్ కోరుతోంది. ఆ యుద్ధ విమానాలకు భారత క్షిపణులు, ఆయుధాలను అమర్చేలా సాఫ్ట్‌వేర్ మార్పులు చేసేలా నిబంధన పెట్టింది. అంతేకాదు, ఈ ఒప్పందంలో భాగంగా ఇంజిన్ తయారీ, ఇతర కీలక విడిభాగాల సాంకేతికతను భారత్‌కు బదిలీ చేస్తారు. కానీ, సోర్స్ కోడ్ విషయంలోనే ఫ్రాన్స్ కాస్త మొండిగా వ్యవహరిస్తోంది. మరి సోర్స్ కోడ్ ఇవ్వకపోయినా రాఫెల్ ఫైటర్ జెట్లనే భారత్ ఎందుకు కొనుగోలు చేస్తున్నట్లు?
గతేడాది భారత్ నిర్వహించిన ఆపరేషన్ సిందూర్‌లో రాఫెల్ ఫైటర్ జెట్లు గేమ్ ఛేంజర్లుగా నిలిచాయి. పాకిస్తాన్, పీవోకేలోని 9 ఉగ్ర శిబిరాలను లక్ష్యంగా చేసుకుని రాఫెల్ జెట్లు ఖచ్చితమైన క్షిపణి దాడులు చేశాయి. స్కాల్ప్ లాంగ్ రేంజ్ మిస్సైళ్లు, హామర్ ప్రిసిషన్-గైడెడ్ బాంబులను ఉపయోగించి శత్రు భూభాగంలోకి వెళ్లకుండానే సుదూర లక్ష్యాలను ఛేదించాయి. రాఫెల్ జెట్లలోని స్పెక్ట్రా ఎలక్ట్రానిక్ వార్‌ఫేర్ సూట్ పాకిస్తాన్ రాడార్ల నుంచి విమానాలను కాపాడటమే కాకుండా శత్రు రక్షణ వ్యవస్థలను నిర్వీర్యం చేయడంలో తోడ్పడింది. ఈ ఆపరేషన్‌లో పాకిస్తాన్ F-16, చైనా JF-17 యుద్ధ విమానాలపై స్పష్టమైన ఆధిపత్యం చెలాయించాయి. టెర్రైన్ ఫాలోయింగ్ సాంకేతికతను ఉపయోగిస్తూ తక్కువ ఎత్తులో ప్రయాణించి శత్రువుల కంటికి కనిపించకుండా చావు దెబ్బకొట్టాయి. భారత్ ఇప్పటికే రాఫెల్ యుద్ధ విమానాలు వాడుతున్నందున, ఈ విమానాలను విస్తరించడం వల్ల పైలట్ల శిక్షణ సమయం, మౌలిక సదుపాయాల ఖర్చులు, లాజిస్టికల్ సవాళ్లు తగ్గుతాయి. అదే వేరే ఫైటర్ జెట్లు కొనుగోలు చేస్తే వాటికి అలవాటు పడటానికి సమయం, శిక్షణ, ఖర్చు అదనమవుతాయి. రాఫెల్ ఫైటర్ల గురించి మనకు ముందే తెలుసు కాబట్టి.. ఆ ఇబ్బందులు ఉండవు. అయితే, ఇదొక్కటే కారణం కాదు.
ఫ్రాన్స్ మనకు పూర్తి సోర్స్ కోడ్ ఇచ్చే అవకాశం లేదు.. కానీ, భారత్ ప్రస్తుతం 'ఇంటర్‌ఫేస్ కంట్రోల్ డాక్యుమెంట్స్' కోసం చర్చలు జరుపుతోంది. ఇవి ఒక రకమైన సాంకేతిక బ్లూప్రింట్లు. ఈ బ్లూప్రింట్లు భారత్ చేతికి వస్తే, ఫ్రాన్స్ సాయం లేకుండానే భారత్ స్వయంగా తయారు చేసిన 'అస్త్ర', 'బ్రహ్మోస్-NG' వంటి అధునాతన ఆయుధాలను రాఫెల్ విమానాలకు అమర్చి, వాటిని ఉపయోగించుకునే వీలు కలుగుతుంది. క్లుప్తంగా చెప్పాలంటే.. సాఫ్ట్‌వేర్ మూల రహస్యమైన 'సోర్స్ కోడ్' మొత్తం ఇవ్వకపోయినా, స్వదేశీ ఆయుధాలను ఆ విమానాల్లో వాడుకోవడానికి అవసరమైన సాంకేతిక అనుమతులు, బ్లూప్రింట్లను సాధించడంపైనే భారత్ ప్రస్తుతం దృష్టిపెట్టింది. ఫ్రాన్స్ కూడా అందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కాబట్టే.. 'లెటర్ ఆఫ్ రిక్వెస్ట్' సిద్ధంచేయడం, ఎయిర్ చీఫ్ మార్షల్, ప్రధాని మోదీలు ఫ్రాన్స్ పర్యటనకు సిద్ధమవ్వడం చూస్తుంటే రాఫెల్ డీల్ ఫైనల్ కావడానికి ఎంతో దూరం లేనట్టే కనిపిస్తోంది.