Top Story: మళ్ళీ మోదీయే ప్రధాని.. సీ వోటర్ సర్వే ఆయన మాత్రమే దేశాన్ని కాపాడగలడు అంటున్న జనం.. నమో కి 48.7 % రాహుల్ కి 27.1%

దేశంలో ఇప్పుడు ఎన్నికలు జరిగితే మళ్లీ అధికారం ఎవరికి దక్కుతుంది? ప్రజలు ఎవరి వైపు మొగ్గు చూపుతున్నారు? దేశాన్ని కాపాడగల సమర్థుడైన నాయకుడు ఎవరు? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం ఇస్తూ.. తాజాగా ‘ఇండియా టుడే - సీ వోటర్’ దేశవ్యాప్తంగా నిర్వహించిన ‘మూడ్ ఆఫ్ ది నేషన్’

Post Published By: dialnews
Updated : 29 August 2026, 10:46 AM IST

దేశంలో ఇప్పుడు ఎన్నికలు జరిగితే మళ్లీ అధికారం ఎవరికి దక్కుతుంది? ప్రజలు ఎవరి వైపు మొగ్గు చూపుతున్నారు? దేశాన్ని కాపాడగల సమర్థుడైన నాయకుడు ఎవరు? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం ఇస్తూ.. తాజాగా ‘ఇండియా టుడే - సీ వోటర్’ దేశవ్యాప్తంగా నిర్వహించిన ‘మూడ్ ఆఫ్ ది నేషన్’ సర్వే ఫలితాలు విడుదలయ్యాయి. 'మళ్లీ మోదీయే ప్రధాని' అంటూ దేశ ప్రజలు అత్యంత స్పష్టమైన తీర్పును ఇచ్చారు. ఆయన మాత్రమే ఈ దేశాన్ని సరైన మార్గంలో నడిపించగలరని జనం నమ్ముతున్నారు. ఈ సర్వేలో ప్రధాని రేసులో నరేంద్ర మోదీ 48.7 శాతం మంది మద్దతుతో అగ్రస్థానంలో నిలవగా.. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కేవలం 27.1 శాతం మద్దతుకే పరిమితమయ్యారు.

ఈ సర్వే ప్రకారం.. ఒకవేళ ఇప్పుడిప్పుడే సార్వత్రిక ఎన్నికలు జరిగితే కేంద్రంలో మళ్లీ ఎన్డీయే కూటమే సునాయాసంగా అధికారంలోకి వస్తుందని తేలింది. మొత్తం 543 లోక్‌సభ స్థానాలకు గానూ ఎన్డీయే కూటమి ఏకంగా 326 సీట్లను గెలుచుకుని క్లీన్ స్వీప్ చేయబోతోంది. అందులో కేవలం భారతీయ జనతా పార్టీ సొంతంగానే 261 స్థానాలను కైవసం చేసుకుంటుందని సర్వే అంచనా వేసింది. మరోవైపు, ప్రతిపక్షాల ‘ఇండీ కూటమి’ కేవలం 185 సీట్లకే పరిమితం కానుంది. ఈ 185 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ వాటా 106 సీట్లుగా ఉండబోతోంది.

ఓట్ల శాతం పరంగా చూస్తే ఎన్డీయే కూటమికి 45.1 శాతం ఓట్లు రాబోతుండగా, ఇండీ కూటమికి 39 శాతం ఓట్లు వస్తాయని వెల్లడైంది. గత ఎన్నికల కంటే సీట్ల సంఖ్యలో స్వల్ప మార్పులు ఉన్నప్పటికీ, మోదీ ప్రభుత్వానికి వచ్చిన ఢోకా ఏమీ లేదని ఈ ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి. దేశ రాజకీయాల్లో అత్యంత కీలకమైన ఉత్తరప్రదేశ్‌లో మొత్తం 80 లోక్‌సభ స్థానాలు ఉండగా.. ఇప్పుడిప్పుడు ఎన్నికలు జరిగితే అక్కడ ఎన్డీయే కూటమికి 38 సీట్లు (42% ఓట్లు) దక్కుతాయని, ప్రతిపక్ష ఇండీ కూటమికి 41 స్థానాలు (40% ఓట్లు) వస్తాయని సర్వే పేర్కొంది.

పంజాబ్ విషయానికి వస్తే, మొత్తం 13 సీట్లలో కాంగ్రెస్ పార్టీకి 11 స్థానాలు వచ్చే అవకాశం ఉండగా, అధికార ఆమ్ ఆద్మీ పార్టీ కి కేవలం ఒకే ఒక్క సీటు వస్తుందని, ఎన్డీయే కూటమి కూడా ఇక్కడ ఒక స్థానంతో ఖాతా తెరుస్తుందని వెల్లడైంది. ఇక దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేపే మహారాష్ట్రలో ఎన్డీయే కూటమికి 31 సీట్లు, ఇండీ కూటమికి 17 సీట్లు వస్తాయని తేలింది. పశ్చిమ బెంగాల్‌లో సైతం అధికార తృణమూల్ కాంగ్రెస్‌ను దాటుకుని ఎన్డీయే కూటమి 35 స్థానాలను క్లీన్ స్వీప్ చేయనుండగా, ఇండీ కూటమి కేవలం 7 సీట్లకే పరిమితం కానుంది. ఈ లెక్కలు చూస్తే హిందీ బెల్ట్ తో పాటు కీలక రాష్ట్రాల్లో మోదీ హవా ఏమాత్రం తగ్గలేదని అర్ధమవుతోంది.

ఈ సర్వేలో అత్యంత ఆశ్చర్యకరమైన మరియు ఊహించని పరిణామం ఏమిటంటే.. దేశ ప్రధాని రేసులో తమిళనాడు ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ ఏకంగా మూడో స్థానంలో నిలిచి అందరినీ షాక్‌కు గురిచేశారు. మమతా బెనర్జీ, అరవింద్ కేజ్రీవాల్, నితీష్ కుమార్ లాంటి ఎంతో మంది సీనియర్ రాజకీయ నాయకులను వెనక్కి నెట్టి, 9.2 శాతం మంది ప్రజల మద్దతుతో ఆయన టాప్-3 లో నిలిచారు. దక్షిణాది రాజకీయాల నుంచి జాతీయ స్థాయిలో ఇంత వేగంగా ప్రజాదరణ సంపాదించడం ఒక అరుదైన రికార్డుగా చెప్పవచ్చు.

దేశాన్ని రక్షించడంలో మరియు సమర్థవంతమైన పాలన అందించడంలో కొత్త తరం నాయకుడిగా విజయ్ వైపు కూడా ప్రజలు చూస్తున్నారనడానికి ఈ సర్వే ఫలితాలే నిదర్శనం. ప్రస్తుతానికి ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యం ఏ రంగానికి ఉండాలి అనే ప్రశ్నపై ప్రజలు ఆసక్తికర సమాధానాలు ఇచ్చారు. 23 శాతం మంది ప్రజలు వైద్యం, ఆరోగ్య రంగానికి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని కోరగా, 21 శాతం మంది మౌలిక వసతులు, రోడ్ల అభివృద్ధికి, 18 శాతం మంది విద్యారంగానికి, 16 శాతం మంది సంక్షేమ పథకాలకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు.

ఇక దేశంలో ఎప్పటి నుంచో నడుస్తున్న 'జమిలి ఎన్నికల' ఆలోచనకు దేశ ప్రజలు బ్రహ్మరథం పట్టారు. సర్వేలో పాల్గొన్న వారిలో ఏకంగా 70.4 శాతం మంది జమిలి ఎన్నికల విధానం దేశానికి ఎంతో మేలు చేస్తుందని మద్దతుగా నిలిచారు. కేవలం 24.1 శాతం మంది మాత్రమే ఈ విధానాన్ని వ్యతిరేకించడం గమనార్హం. అలాగే, దేశంలో ఎన్నికల నిర్వహణ అత్యంత పారదర్శకంగా సాగుతోందని 67 శాతం మంది అభిప్రాయపడ్డారు. అయితే, ఈ సర్వే దేశ యువత ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలను కూడా ఎత్తిచూపింది.

ప్రస్తుతం దేశంలో ఉన్న అతిపెద్ద సమస్య 'ఉద్యోగాల కొరత' అని సర్వేలో పాల్గొన్న 32 శాతం మంది యువత ఆవేదన వ్యక్తం చేశారు. జీతాలు చాలా తక్కువగా ఉండటం వల్ల ఇబ్బందులు పడుతున్నామని 18 శాతం మంది, తమ చదువుకు తగ్గ సరైన ఉద్యోగాలు లభించడం లేదని 17 శాతం మంది తెలిపారు. వీటన్నింటికీ తోడు దేశంలో ఇటీవల జరిగిన పేపర్ లీకేజీలు, పరీక్షల అక్రమాలపై యువతలో తీవ్ర అసంతృప్తి, ఆగ్రహం వ్యక్తమైంది. యువతకు సరైన ఉపాధి అవకాశాలు కల్పించి, పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాల్సిన బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఎంతైనా ఉందని ఈ సర్వే ఫలితాలు హెచ్చరిస్తున్నాయి.

మొత్తం మీద చూసుకుంటే.. కొన్ని రకాల అసంతృప్తులు, నిరుద్యోగ సమస్యలు ఉన్నప్పటికీ.. దేశాన్ని రక్షించడంలో, అంతర్జాతీయంగా భారతదేశ కీర్తిని పెంచడంలో నరేంద్ర మోదీ మాత్రమే సమర్థుడని దేశ జనావళి నమ్ముతోంది. అందుకే 'మళ్లీ మోదీయే ప్రధాని' అంటూ 48.7 శాతం మందితో జనం జై కొట్టారు.

 

Published : 
  • 29 August 2026, 10:46 AM IST