యూట్యూబ్ ఛానల్‌పై పోలీస్ కేస్!

సోషల్ మీడియా పెరిగిన తర్వాత సమాచారం ఎంత వేగంగా అందుతుందో.. అంతే వేగంగా ఫేక్ న్యూస్, అబద్ధపు ప్రచారాలు కూడా వైరల్ అవుతున్నాయి. వ్యూస్ కోసం, లైకుల కోసం కొందరు కేటుగాళ్లు హద్దులు మీరుతున్నారు.

Post Published By: dialnews
Updated : 28 May 2026, 10:50 AM IST

సోషల్ మీడియా పెరిగిన తర్వాత సమాచారం ఎంత వేగంగా అందుతుందో.. అంతే వేగంగా ఫేక్ న్యూస్, అబద్ధపు ప్రచారాలు కూడా వైరల్ అవుతున్నాయి. వ్యూస్ కోసం, లైకుల కోసం కొందరు కేటుగాళ్లు హద్దులు మీరుతున్నారు. సామాన్యులనే కాకుండా సెలబ్రిటీలను, వారి వ్యక్తిగత జీవితాలను టార్గెట్ చేస్తూ వికృతానందం పొందుతున్నారు. తాజాగా టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ఆరోగ్యంపై ఇలాంటి ఒక నీచమైన తప్పుడు ప్రచారం కలకలం రేపింది. చిరంజీవి హెల్త్ కండిషన్ గురించి మార్ఫింగ్ వీడియోలతో అసత్య ప్రచారాలు చేసిన ఒక యూట్యూబ్ ఛానల్‌పై హైదరాబాద్ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. సినీ ఇండస్ట్రీలో ఎంతో ప్రతిష్టాత్మకమైన స్థానంలో ఉన్న మెగాస్టార్ చిరంజీవి ఆరోగ్యంపై గత కొన్ని రోజులుగా ఒక యూట్యూబ్ ఛానల్ వరుసగా అవాస్తవాలను ప్రచారం చేస్తోంది.

చిరంజీవి ప్రతిష్టకు భంగం కలిగించేలా, ఆయన అభిమానులను ఆందోళనకు గురిచేసేలా మార్ఫింగ్ చేసిన ఫోటోలు, ఎడిట్ చేసిన వీడియోలను సదరు ఛానల్ విస్తృతంగా సోషల్ మీడియాలో వైరల్ చేసింది. సెలబ్రిటీల వ్యక్తిగత విషయాలపై, ముఖ్యంగా వారి ఆరోగ్యంపై ఇలాంటి తప్పుడు వార్తలు ప్రసారం చేయడం చట్టవిరుద్ధమని భావించిన హైదరాబాద్ కమలాపురి కాలనీకి చెందిన ప్రముఖ న్యాయవాది రామకృష్ణ మిర్యాల దీనిపై స్పందించారు. ఈ అక్రమ ప్రచారాలను అడ్డుకోవాలని నిర్ణయించుకున్న ఆయన.. సోమవారం రోజున జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో అధికారికంగా ఫిర్యాదు చేశారు. న్యాయవాది రామకృష్ణ ఇచ్చిన ఫిర్యాదును జూబ్లీహిల్స్ పోలీసులు అత్యంత తీవ్రంగా పరిగణించారు.

సదరు యూట్యూబ్ ఛానల్ అప్‌లోడ్ చేసిన వివాదాస్పద కంటెంట్‌కు సంబంధించిన వీడియో లింకులను, స్క్రీన్ షాట్లను న్యాయవాది పోలీసులకు సాక్ష్యాలుగా అందజేశారు. ఈ ఆధారాలను పరిశీలించిన పోలీసులు, ప్రాథమిక విచారణ అనంతరం కోర్టు అనుమతి తీసుకున్నారు. మెగాస్టార్ చిరంజీవిపై అసత్య ప్రచారాలు చేస్తూ సమాజంలో గందరగోళం సృష్టిస్తున్న సదరు యూట్యూబ్ ఛానల్ నిర్వాహకులపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ అసత్య ప్రచారాల వెనుక ఉన్న అసలు సూత్రధారులు ఎవరు? ఈ వీడియోలను ఎక్కడి నుండి అప్‌లోడ్ చేశారు? దీని వెనుక ఉన్న బాధ్యులను గుర్తించేందుకు పోలీసులు ప్రస్తుతం తమ దర్యాప్తును ముమ్మరం చేశారు.

సైబర్ క్రైమ్ విభాగం సహాయంతో ఛానల్ ఐపీ అడ్రస్‌లను ట్రాక్ చేసే పనిలో పడ్డారు. యూట్యూబ్ ఛానల్స్ నడిపేవారు కేవలం వ్యూస్ కోసం సెలబ్రిటీల ప్రాణాలతో, వారి కుటుంబ సభ్యుల భావోద్వేగాలతో ఆడుకోవడం తీవ్రంగా ఖండించదగ్గ విషయం. గతంలో కూడా పలువురు సీనియర్ నటీనటుల ఆరోగ్యంపై, వ్యక్తిగత జీవితాలపై ఇలాంటి ఫేక్ న్యూస్ రావడం మనం చూశాం. చట్టప్రకారం ఇలాంటి తప్పుడు వార్తలు వ్యాప్తి చేయడం నేరం. ఈ కేసు ద్వారా అయినా ఇలాంటి ఫేక్ యూట్యూబ్ ఛానల్స్ నిర్వాహకులకు గట్టి బుద్ధి వస్తుందని టాలీవుడ్ వర్గాలు మరియు మెగా అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Published : 
  • 28 May 2026, 10:50 AM IST