ఒకప్పుడు టాలీవుడ్లో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ అంటే మినిమమ్ గ్యారెంటీకి కేరాఫ్ అడ్రస్. స్టార్ హీరోలందరూ దిల్ రాజుతో సినిమా చేయడానికి క్యూ కట్టేవారు. ఆయన జడ్జిమెంట్ మీద నమ్మకంతో కథ కూడా వినకుండా డేట్స్ ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. కానీ, ప్రస్తుతం ఆ జోరు పూర్తిగా తగ్గిపోయింది. రామ్ చరణ్ గేమ్ చేంజర్ తర్వాత దిల్ రాజు చేతిలో చెప్పుకోదగ్గ బడా ప్రాజెక్టులు ఏమీ లేకపోవడం ఇండస్ట్రీ వర్గాల్లో ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఒకప్పుడు వరుస పెట్టి సినిమాలు తీసిన రాజు గారు.. ఇప్పుడు ఇంత సైలెంట్ అయిపోవడానికి అసలు కారణం అగ్ర హీరోలు ఆయనకు డేట్స్ ఇవ్వకపోవడమేనా అనే అనుమానాలు బలపడుతున్నాయి. మూడేళ్ల కిందట సంక్రాంతికి జరిగిన థియేటర్ల వివాదం దిల్ రాజుపై ఇంకా ప్రభావం చూపిస్తున్నట్లు కనిపిస్తోంది. చిరంజీవి వాల్తేరు వీరయ్య, బాలకృష్ణ వీరసింహారెడ్డి సినిమాలకు సరైన థియేటర్లు ఇవ్వకుండా, తన డబ్బింగ్ సినిమా వారసుడుకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారని అప్పట్లో తీవ్ర విమర్శలు వచ్చాయి.
ఆ సమయంలో మెగా, నందమూరి అభిమానులతో పాటు ఇండస్ట్రీ పెద్దలు కూడా దిల్ రాజు తీరును తప్పుబట్టారు. ఆనాడు జరిగిన రచ్చ స్టార్ హీరోల మనసులో బలంగా ముద్రపడిపోయిందని.. అందుకే చిరంజీవి, ఎన్టీఆర్, బన్నీ వంటి వాళ్ళు ఆయనకు దూరంగా ఉంటున్నారని టాక్ వినిపిస్తుంది. ఆ వివాదం తాలూకు డ్యామేజ్ కంట్రోల్ ఇంకా పూర్తి కాలేదనేది వాస్తవం. అయితే అందులో ఎలాంటి నిజం లేదని.. త్వరలోనే అందరితోనూ సినిమాలు చేస్తానని చెప్తున్నాడు దిల్ రాజు. కేవలం స్టార్ హీరోలే కాదు, ఒకప్పుడు దిల్ రాజు కాంపౌండ్ హీరోలుగా ముద్రపడిన వాళ్ళు కూడా ఇప్పుడు ఆయన బ్యానర్ వైపు చూడటం లేదు. ప్రస్తుతం విజయ్ దేవరకొండ, నితిన్ తప్ప మిగిలిన వారెవరూ రాజుతో సినిమాలు చేయడానికి ఆసక్తి చూపించడం లేదు. ముఖ్యంగా నేచురల్ స్టార్ నాని, దిల్ రాజు బ్యానర్లో వరస హిట్లు కొట్టినప్పటికీ.. ప్రస్తుతం ఆయనతో సినిమా చేయడానికి వెనకడుగు వేస్తున్నట్లు సమాచారం.
ఫ్యామిలీ స్టార్ ఫలితం తర్వాత విజయ్ దేవరకొండ కూడా కాస్త ఆలోచనలో పడ్డాడు. దీన్నిబట్టి చూస్తుంటే.. కథల ఎంపికలో దిల్ రాజు మునుపటి మ్యాజిక్ కోల్పోయారా? లేక హీరోలే ఆయన డామినేషన్ భరించలేక పక్కన పెడుతున్నారా అనే చర్చ జరుగుతోంది. నందమూరి బాలకృష్ణతో సినిమా చేయాలని దిల్ రాజు ఎప్పటి నుంచో ప్రయత్నిస్తున్నాడు. అనిల్ రావిపూడి వంటి దర్శకులతో కాంబినేషన్ సెట్ చేయడానికి చాలాసార్లు ట్రై చేసినా.. అవి కార్యరూపం దాల్చలేదు. బాలయ్య వరసగా సినిమాలు చేస్తున్నా.. మైత్రీ మూవీ మేకర్స్, షైన్ స్క్రీన్స్ వంటి బ్యానర్లకు ఇస్తున్న ప్రాధాన్యత దిల్ రాజుకు ఇవ్వడం లేదనే టాక్ నడుస్తుంది. అనిల్ రావిపూడితో బాలయ్య చేసిన భగవంత్ కేసరి వేరే బ్యానర్లో రావడం దీనికి నిదర్శనం. అగ్ర హీరోలందరినీ కవర్ చేసిన దిల్ రాజుకు.. బాలయ్య డేట్స్ దొరక్కపోవడం వెనుక పాత వివాదాల కారణాలే ఉన్నాయని ఇండస్ట్రీ భోగట్టా.
చివరగా ఇదంతా చూస్తుంటే దిల్ రాజు కావాలనే పెద్ద సినిమాలకు దూరంగా ఉంటూ డిస్ట్రిబ్యూషన్ మీద, చిన్న సినిమాల మీద ఫోకస్ పెట్టారా? లేక అగ్ర హీరోలే ఆయన్ను దూరం పెట్టారా అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. పాన్ ఇండియా మార్కెట్ పెరిగాక హీరోలు రెమ్యునరేషన్లు భారీగా పెంచేయడం, నిర్మాణ వ్యయం తడిసి మోపెడవ్వడం కూడా దిల్ రాజు వెనక్కి తగ్గడానికి ఒక కారణం కావచ్చు. అయితే ఇండస్ట్రీలో ఏదీ శాశ్వతం కాదు. విజయ్ దేవరకొండతో చేస్తున్న రౌడీ జనార్ధన గనక బ్లాక్ బస్టర్ అయితే.. మళ్ళీ దిల్ రాజు కాంపౌండ్లో స్టార్ హీరోల సందడి మొదలైనా ఆశ్చర్యపోనక్కర్లేదు. కానీ ప్రస్తుతానికైతే ఆ సైలెన్స్ చాలా ప్రశ్నలను లేవనెత్తుతోంది.