ధనుష్ హీరోగా యెంకన్న విలన్…!

తెలుగు చిత్ర పరిశ్రమలో తనదైన నటనతో గుర్తింపు తెచ్చుకున్న నటుడు చైతన్య జొన్నలగడ్డ ఇప్పుడు కోలీవుడ్‌లో అడుగుపెట్టబోతున్నారు.

Post Published By: dialnews
Updated : 10 March 2026, 7:15 PM IST

తెలుగు చిత్ర పరిశ్రమలో తనదైన నటనతో గుర్తింపు తెచ్చుకున్న నటుడు చైతన్య జొన్నలగడ్డ ఇప్పుడు కోలీవుడ్‌లో అడుగుపెట్టబోతున్నారు. అదీ ఏకంగా కోలీవుడ్ స్టార్ హీరో, నేషనల్ అవార్డ్ విన్నర్ ధనుష్ నటిస్తున్న 55వ చిత్రంలో ఆయన ఒక పవర్‌ఫుల్ పాత్రను దక్కించుకున్నట్లు సమాచారం. ఇటీవల విడుదలైన 'రాజు వెడ్స్ రాంబాయి' చిత్రంతో చైతన్య జొన్నలగడ్డ టాలీవుడ్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నారు.

ఈ సినిమాలో ఆయన ప్రదర్శించిన సహజ సిద్ధమైన నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. అంతేకాకుండా, ఈ చిత్రానికి గాను ఆయన 2025 తెలంగాణ గద్దర్ ఫిలిం అవార్డ్స్‌లో 'స్పెషల్ జ్యూరీ అవార్డు'ను కూడా గెలుచుకున్నారు. ఈ విజయమే ఆయనకు ఇప్పుడు కోలీవుడ్ నుంచి భారీ ఆఫర్ వచ్చేలా చేసిందని సినీ వర్గాల టాక్. డైరెక్టర్ రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ భారీ ప్రాజెక్టులో మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి కూడా ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం, చైతన్య జొన్నలగడ్డ ఇప్పటికే చెన్నైలో జరిగిన షూటింగ్‌లో పాల్గొని, ధనుష్ మరియు సాయి పల్లవిలతో కలిసి కొన్ని కీలక సన్నివేశాల్లో నటించారు.

ఇది కేవలం అతిథి పాత్ర కాదని, సినిమా ఆద్యంతం కథలో ప్రాధాన్యత కలిగిన పాత్ర అని కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. సిద్ధు జొన్నలగడ్డ సోదరుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినప్పటికీ, తనదైన టాలెంట్‌తో 'హిట్ 3', 'భామా కలాపం 2' వంటి సినిమాలతో చైతన్య తన ముద్ర వేశారు. ఇప్పుడు ధనుష్ వంటి స్టార్ హీరో సినిమాలో ఛాన్స్ రావడం అంటే అది ఆయన కెరీర్‌లో అతిపెద్ద మలుపుగా భావించవచ్చు. సాయి అభ్యంకర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం భారీ బడ్జెట్‌తో రూపుదిద్దుకుంటోంది.తెలుగు నటులకు ఇతర భాషల్లో ఆదరణ పెరుగుతున్న తరుణంలో, చైతన్య జొన్నలగడ్డ ఈ సినిమాతో కోలీవుడ్‌లో కూడా పాగా వేయడం ఖాయంగా కనిపిస్తోంది. త్వరలోనే ఈ విషయంపై చిత్ర బృందం నుంచి అధికారిక ప్రకటన వెలువడనుంది.

Published : 
  • 10 March 2026, 7:15 PM IST