మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అభిమానులు అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాల్లో 'పెద్ది' ఒకటి. ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. జూన్ 4న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో, చిత్ర బృందం ప్రచార కార్యక్రమాల్లో వేగం పెంచింది. ఈ క్రమంలో తాజాగా ఈ చిత్ర ఆర్ట్ డైరెక్టర్ అవినాష్ కొల్లా ఒక ఇంటర్వ్యూలో సినిమా మేకింగ్ గురించి ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు.
పెద్ది' సినిమా కుస్తీ నేపథ్యంలో సాగుతుంది. అయితే, ఇదే నేపథ్యంతో వచ్చిన బాలీవుడ్ బ్లాక్ బస్టర్ ‘దంగల్’ను ఈ సినిమా ఎక్కడా గుర్తు చేయకూడదన్నదే తమ ముందున్న ప్రధాన లక్ష్యమని అవినాష్ కొల్లా స్పష్టం చేశారు.అందుకే సెట్ వర్క్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నాం. ఎక్కడా ‘దంగల్’ను పోలిన సెట్లు వేయలేదు. అలా ఉండకూడదనే ప్రధాన ఉద్దేశంతో పని చేశాం" అని తెలిపారు. ప్రేక్షకులు ఇదివరకే ఇలాంటి సెట్స్ చూశామనే భావన కలగకుండా ఉండటానికి టీం ఎన్నో ప్రయోగాలు చేసినట్లు ఆయన వివరించారు.
‘పెద్ది’లో కొన్ని కొత్త ఆలోచనలను కూడా అమలు చేశామని, ఇవి ప్రేక్షకులకు ఖచ్చితంగా ఒక కొత్త అనుభూతిని ఇస్తాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు. తన కెరీర్లోనే 'పెద్ది' అత్యుత్తమ స్క్రిప్ట్ అని అవినాష్ కొల్లా ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఇంతటి గొప్ప చిత్రానికి పనిచేసే అవకాశం రావడం తన అదృష్టమని ఆయన ఆనందం వ్యక్తం చేశారు. కథలోని ఎమోషన్స్‌ను ప్రేక్షకులకు నేరుగా కనెక్ట్ అయ్యేలా చేయడంలో తన వంతు కృషి చేస్తున్నట్లు ఆయన తెలిపారు.