తెలుగు సినిమా చరిత్రను 'పోకిరి'కి ముందు.. 'పోకిరి'కి తర్వాత అని విభజించవచ్చు అంటే అది అతిశయోక్తి కాదు. నేటితో ఈ సంచలన చిత్రం విజయవంతంగా 20 ఏళ్లను పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులు సోషల్ మీడియాను హోరెత్తిస్తున్నారు. దర్శకుడు పూరి జగన్నాథ్ మ్యాజిక్, మహేష్ బాబు అల్ట్రా మోడ్రన్ మేనరిజమ్స్ తోడైతే ఎలా ఉంటుందో 'పోకిరి' నిరూపించింది. అప్పటివరకు సాఫ్ట్ రోల్స్ చేస్తున్న మహేష్ బాబును 'పండుగాడు'గా ఒక మాస్ అవతారంలో చూసి ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. "ఎప్పుడు వచ్చామన్నది కాదన్నయ్యా.. బుల్లెట్ దిగిందా లేదా!" అనే ఒక్క డైలాగ్ తెలుగు రాష్ట్రాల్లో ఒక ప్రభంజనం సృష్టించింది. ఈ సినిమా సృష్టించిన వసూళ్ల ప్రవాహం అప్పట్లో ఒక సంచలనం. కేవలం 12 కోట్ల స్వల్ప బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం, ఏకంగా 66 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను సాధించి ట్రేడ్ వర్గాలను విస్మయానికి గురిచేసింది.
ఎవడు కొడితే దిమ్మతిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో వాడే పండుగాడు' అంటూ మహేష్ చెప్పిన డైలాగులు, బాడీ లాంగ్వేజ్ యువతను విపరీతంగా ఆకట్టుకున్నాయి. గ్యాంగ్‌స్టర్ డ్రామాను డీల్ చేయడంలో పూరి స్టైల్ సినిమాను నెక్స్ట్ లెవల్‌కు తీసుకెళ్లింది. ఆయన రాసిన పదునైన డైలాగులు నేటికీ మీమ్స్‌లో వైరల్ అవుతూనే ఉంటాయి. తెలుగు సినీ ఇండస్ట్రీలో 30 కోట్ల షేర్ మార్కును దాటిన తొలి తెలుగు చిత్రంగా పోకిరి నిలిచింది.200కు పైగా థియేటర్లలో 100 రోజులు, 60కి పైగా థియేటర్లలో 175 రోజుల సెలబ్రేషన్స్ తో ఒక ట్రెండ్ సెట్ చేసింది మహేష్ మ్యానియా. ఈ సినిమా విజయంలో మణిశర్మ సంగీతం వెన్నెముకగా నిలిచింది.
పోకిరి' విజయం కేవలం టాలీవుడ్‌కే పరిమితం కాలేదు. ఈ సినిమా హిందీలో సల్మాన్ ఖాన్ హీరోగా 'వాంటెడ్' పేరుతో రీమేక్ అయ్యి అక్కడ కూడా బ్లాక్ బస్టర్ హిట్ సాధించింది. తమిళం, కన్నడ భాషల్లో కూడా రీమేక్ అయ్యి సూపర్ హిట్ అనిపించుకుంది. ఒక రకంగా చెప్పాలంటే, సౌత్ సినిమాల సత్తాను యావత్ భారత్ గమనించేలా చేసింది మన పండుగాడే. రెండు దశాబ్దాలు గడిచినా, ఇప్పటికీ టీవీలో 'పోకిరి' వస్తుందంటే రిమోట్ పక్కన పెట్టేసి కూర్చునే ప్రేక్షకులు కోట్లలో ఉన్నారు. మహేష్ బాబు కెరీర్‌ను మలుపు తిప్పడమే కాకుండా, తెలుగు సినిమా కమర్షియల్ ఫార్మాట్‌ను ఈ సినిమా మార్చేసింది. ఇండస్ట్రీలో సూపర్ స్టార్ ఒక్కరే ఉంటారు, అది మహేష్ బాబేనని తెగేసి చెప్పిన సినిమా పూరీ జగన్నాథ్ పోకిరి.