మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం ఫుల్ స్వింగ్‌లో ఉన్నాడు. ఒకవైపు గ్లోబల్ స్థాయిలో తన క్రేజ్‌ను పెంచుకుంటూనే, మరోవైపు వరుస ప్రాజెక్టులతో బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేయడానికి సిద్ధమవుతున్నాడు. తాజాగా చరణ్ ఫ్యాన్స్‌ను ఖుషీ చేసే ఒక అదిరిపోయే వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రస్తుతం రామ్ చరణ్ తన 16వ చిత్రమైన పెద్దిని 'ఉప్పెన' ఫేమ్ బుచ్చిబాబు సానా దర్శకత్వంలో చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. అయితే, ఈ సినిమా షూటింగ్ జరుగుతుండగానే, తన తర్వాతి ప్రాజెక్ట్ విషయంలో చరణ్ ఏమాత్రం గ్యాప్ తీసుకోకూడదని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.
బుచ్చిబాబు గురువు గారైన లెక్కల మాస్టర్ సుకుమార్ దర్శకత్వంలో చరణ్ తన 17వ సినిమాను పట్టాలెక్కించబోతున్నాడు.తాజా సమాచారం ప్రకారం, బుచ్చిబాబు దర్శకత్వంలో రూపొందుతున్న 'పెద్ది' చిత్రం వచ్చే జూన్ నాటికి విడుదలకు సిద్ధం కానుంది. ఈ నేపథ్యంలో, సినిమా విడుదలైన వెంటనే ఏమాత్రం ఆలస్యం చేయకుండా అదే నెలలో సుకుమార్ ప్రాజెక్ట్‌ను కూడా ప్రారంభించాలని చరణ్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. 'రంగస్థలం' వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత వీరిద్దరి కాంబినేషన్లో వస్తున్న సినిమా కావడంతో మెగా అభిమానుల్లో అప్పుడే అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి.
ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ను ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ హోమ్ బ్యానర్ అయిన సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇది ఒక భారీ బడ్జెట్ చిత్రమని, దీనిని పాన్ ఇండియా స్థాయిలో అత్యున్నత సాంకేతిక విలువలతో తెరకెక్కించనున్నారని తెలుస్తోంది.రామ్ చరణ్ - సుకుమార్ కాంబినేషన్ అంటేనే ఒక వైబ్. 'రంగస్థలం'లో చిట్టిబాబుగా చరణ్ నటనను ఎవరూ మర్చిపోలేరు. ఇప్పుడు మళ్ళీ వీరిద్దరూ జతకడుతుండటంతో, ఈసారి సుకుమార్ చరణ్‌ను ఎలాంటి కొత్త అవతారంలో చూపిస్తారో అన్న ఆసక్తి అందరిలోనూ నెలకొంది. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని అధికారిక వివరాలు త్వరలోనే వెల్లడి కానున్నాయి.