ప్రజా యుద్ధనౌక గద్దర్ పేరుతో ఏర్పాటు చేసిన తొలి 'గద్దర్ అవార్డుల' వేదికపై ఇద్దరు దిగ్గజాలు కలిశారు. ఒకరు భారతీయ సినిమా గర్వించదగ్గ నటుడు కమల్ హాసన్, మరొకరు తెలుగు సినీ సామ్రాజ్యాన్ని శాసించిన మెగాస్టార్ చిరంజీవి. చిరంజీవికి 'గద్దర్ పురస్కారం' ప్రదానం చేస్తున్న సమయంలో కమల్ హాసన్ చేసిన ప్రసంగం ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.
అందరికీ నమస్కారం.
ఈ రోజు గద్దర్ గారి పేరు మీద ఇస్తున్న ఈ అవార్డును నా మిత్రుడు చిరంజీవికి అందించడం నా అదృష్టంగా భావిస్తున్నాను. మా మధ్య ఉన్నది కేవలం వృత్తిపరమైన పోటీ కాదు, దశాబ్దాల నాటి అనుబంధం. చిరంజీవి కేవలం ఒక స్టార్ మాత్రమే కాదు, అతను ఒక పోరాట యోధుడు. గద్దర్ గారు తన పాటలతో సమాజాన్ని ఎలా మేల్కొల్పారో, చిరంజీవి తన కష్టంతో కోట్లాది మందికి స్ఫూర్తినిచ్చారు అని లోకనాయకుడు ప్రశంసించాడు. చిరంజీవి ఎదుగుదల గురించి కమల్ మాట్లాడుతూ.. "మద్రాసులో మేమంతా కెరీర్ మొదలుపెట్టినప్పుడు, ఎవరికీ గాడ్ ఫాదర్స్ లేరు. కానీ చిరంజీవిలో ఉన్న కసి నేను గమనించాను. డాన్స్ అయినా, ఫైట్స్ అయినా, ఎమోషన్ అయినా.. తను చేసే ప్రతి పనిలో ఒక పర్ఫెక్షన్ ఉంటుంది. అందుకే అతను మెగాస్టార్ అయ్యాడు.
గద్దర్ గారి లాగే చిరంజీవి కూడా సామాన్యుల గుండెల్లో చోటు సంపాదించుకున్నారు అని గర్వంగా చెప్పుకొచ్చారు. ఈ అవార్డును స్వీకరించిన అనంతరం చిరంజీవి ఉద్వేగానికి లోనయ్యారు. తన తోటి నటుడు, గురువుగా భావించే కమల్ హాసన్ చేతుల మీదుగా ఈ పురస్కారం అందుకోవడం తన జీవితకాల గౌరవమని పేర్కొన్నారు. "గద్దర్ అన్న పాటలో ఒక నిప్పు ఉంటుంది, ఆ నిప్పు మనలో ఎప్పుడూ ఆరిపోకూడదు" అని చిరు వ్యాఖ్యానించారు. సినిమా రంగంలో పోటీ ఉన్నా, వ్యక్తిగతంగా ఒకరినొకరు గౌరవించుకోవడంలో కమల్-చిరు ఎప్పుడూ ముందుంటారు. గద్దర్ అవార్డుల సాక్షిగా వీరిద్దరి మధ్య ఉన్న ఆత్మీయత ప్రేక్షకులను మైమరిపించింది. ఈ కార్యక్రమం కేవలం అవార్డుల ప్రధానోత్సవంలా కాకుండా, భారతీయ సినిమా ఉన్నత విలువలను చాటిచెప్పే వేదికగా నిలిచిపోయింది.