మెగాస్టార్ చిరంజీవి అంటే కేవలం వెండితెరపై మాయాజాలం చేసే నటుడు మాత్రమే కాదు.. కష్టాల్లో ఉన్నవారిని ఆదుకునే ఆపద్బాంధవుడు కూడా అని ఆయన మరోసారి నిరూపించుకున్నారు. గతంలో 'చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్' ద్వారా రక్తం మరియు కంటి దానాలతో లక్షలాది మందికి అండగా నిలిచిన ఆయన, ఇప్పుడు ‘విద్యా దానం’ వైపు అడుగులు వేస్తున్నారు. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని ఆయన తీసుకున్న ఒక గొప్ప నిర్ణయం ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది. సమాజంలో పేదరికం కారణంగా ఏ ఒక్క బిడ్డ చదువుకు దూరం కాకూడదనే సత్సంకల్పంతో, పేద పిల్లలకు ఉచిత విద్యను అందించాలని చిరంజీవి నిర్ణయించుకున్నారు.
అక్షరం అనేది జీవితాలను మారుస్తుందని బలంగా నమ్మే చిరంజీవి, ఈ దిశగా ఒక బృహత్తర ప్రణాళికను సిద్ధం చేశారు. తన అన్నయ్య తీసుకున్న ఈ గొప్ప నిర్ణయంపై ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి, జనసేనాని పవన్ కళ్యాణ్ X వేదికగా స్పందించారు. తన అన్నయ్యలోని మానవత్వాన్ని కొనియాడుతూ ఆయన చేసిన ట్వీట్ అభిమానుల మనసు గెలుచుకుంటోంది. అన్నయ్య చిరంజీవి గారు ఉగాది శుభ సందర్భంగా పేద పిల్లలకు ఉచిత విద్య అందించాలనే సత్సంకల్పంతో కూడిన లక్ష్యాన్ని నిర్దేశించుకోవడం - ఆయన విశాల హృదయాన్ని చాటింది అని పవన్ ప్రశంసించాడు.
గతంలో కరోనా సమయంలో ఆక్సిజన్ బ్యాంకుల ద్వారా వేలాది మంది ప్రాణాలను కాపాడిన చిరంజీవి, ఇప్పుడు విద్యా రంగాన్ని ఎంచుకోవడం విశేషం. ఒక వ్యక్తికి ఆహారం పెడితే ఒక పూట ఆకలి తీరుతుంది, కానీ చదువు చెప్పిస్తే ఆ వ్యక్తి జీవితమే మారుతుంది. చిరంజీవి తీసుకున్న ఈ నిర్ణయం వల్ల ఎంతోమంది మేధావులు సమాజానికి అందుతారని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ చేసిన ఈ ట్వీట్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. "అన్నదమ్ములు అంటే ఇలా ఉండాలి.. ఒకరు ప్రజా సేవలో ఉంటే, మరొకరు సమాజ హితం కోసం పాటుపడుతున్నారు" అంటూ నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.