తెలుగు చిత్ర పరిశ్రమలో సంచలనాలకు కేరాఫ్ అడ్రస్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా. తన సినిమాలతో ఎంతటి ప్రకంపనలు సృష్టిస్తారో, తన మాటలతో కూడా అంతే సూటిగా, ఘాటుగా స్పందిస్తుంటారు. తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా కొందరు నటులు, రచయితలు కేవలం ప్రచారంతోనే తమ కెరీర్లను నిర్మించుకున్నారని, అలాంటి వారే ఇప్పుడు నాణ్యమైన సినిమాలను వెక్కిరిస్తున్నారని ఆయన మండిపడ్డారు.సందీప్ రెడ్డి వంగా స్పందిస్తూ.. గతంలో కొందరు రచయితలు, నటులు కేవలం పబ్లిసిటీ స్టంట్స్‌తోనే తమ కెరీర్లను సెట్ చేసుకున్నారని ఆరోపించారు. "ఆ టైంలో ఇండస్ట్రీ పిల్లిలా ఉండిపోయింది. ఏదీ ప్రశ్నించలేని స్థితిలో ఉండేది. కానీ ఇప్పుడు అదే ముఠా 'ధురంధర్' వంటి సినిమాలను ఎగతాళి చేస్తోంది" అని ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. నిజం ఎప్పటి నుంచి ప్రచారంగా ముద్ర వేయబడిందో తెలియదు కానీ, ప్రతి దాన్ని వెక్కిరించడం ఇప్పుడు కొందరికి అలవాటుగా మారిందని ఆయన పేర్కొన్నారు.
సినిమాలోని కంటెంట్‌ను విమర్శించే క్రమంలో తమ్మను తాము 'లిబరల్స్'గా చెప్పుకునే వారిపై సందీప్ విరుచుకుపడ్డారు. "ఏం చూసినా ఎగతాళి చేయడమే మీకు అలవాటైతే, మిమ్మల్ని మీరు లిబరల్ అనుకునే హక్కు మీకు లేదు" అని తేల్చి చెప్పారు. భావప్రకటన స్వేచ్ఛ పేరుతో ఇతరుల కష్టాన్ని తక్కువ చేసి చూడటం సరైన పద్ధతి కాదని ఆయన హితవు పలికారు. ప్రస్తుతం ఇండస్ట్రీలో జరుగుతున్న ఈ విచిత్రమైన పోకడలపై ఆయన తనదైన శైలిలో విశ్లేషించారు. ఆదిత్య ధర్ దర్శకత్వంలో రణ్వీర్ సింగ్ ప్రధాన పాత్రలో విడుదలైన 'ధురంధర్' సినిమా గురించి సందీప్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను నిన్న రాత్రి 'ధురంధర్-2' చూశానని, అది ఒక అద్భుతమైన సినిమా అని కొనియాడారు. సినిమా మేకింగ్, నటీనటుల పనితీరు అమోఘమని ఆయన కితాబిచ్చారు.
ఇలాంటి గొప్ప సినిమాలను కూడా విమర్శించే వారికి సందీప్ ఈ విధంగా గట్టి కౌంటర్ ఇచ్చారు. ఈ సందర్భంగా సందీప్ రెడ్డి వంగా ఒక ఆసక్తికరమైన సామెతను వాడారు. "నేను ఆదిత్య ధర్, రణ్వీర్ సింగ్‌కి ఒకటి చెప్పాలనుకుంటున్నా. ఈ దిష్టి పిడికెడు ఎండు మిరపకాయలతో పోదు.. మొత్తం తోటను తగలబెట్టాల్సిందే" అంటూ తనదైన శైలిలో పంచ్ ఇచ్చారు. అంటే, చిన్న చిన్న మార్పులు సరిపోవని, విమర్శకుల నోళ్లు మూయించాలంటే భారీ విజయాలతోనే సమాధానం చెప్పాలని ఆయన ఉద్దేశం. సందీప్ రెడ్డి వంగా ఎప్పుడూ ముక్కుసూటిగా మాట్లాడతారనే పేరుంది. 'అర్జున్ రెడ్డి', 'యానిమల్' సినిమాల సమయంలో కూడా ఆయనపై ఎన్నో విమర్శలు వచ్చాయి. వాటన్నింటినీ ఆయన తన సినిమాల విజయంతోనే తిప్పికొట్టారు. ఇప్పుడు 'ధురంధర్' చిత్రానికి మద్దతుగా నిలుస్తూ, అనవసర విమర్శలు చేసే వారిపై ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు మరోసారి చర్చకు దారితీశాయి.