బాక్సాఫీస్ రారాజు ఈజ్ బ్యాక్.. మన శంకర వరప్రసాద్ గారు ఇచ్చింది కేవలం హిట్ కాదు.. ఒక స్టేట్‌మెంట్..!
కొంతకాలంగా మెగాస్టార్ కెరీర్ గురించి.. ఆయన కథల ఎంపికల గురించి రకరకాల మాటలు వినిపించాయి. మెగాస్టార్ పని అయిపోయింది..
కొంతకాలంగా మెగాస్టార్ కెరీర్ గురించి.. ఆయన కథల ఎంపికల గురించి రకరకాల మాటలు వినిపించాయి. మెగాస్టార్ పని అయిపోయింది.. ఆయనలో మునుపటి జోష్ తగ్గింది.. ఇక వింటేజ్ చిరంజీవిని చూడలేం అంటూ కొందరు పెదవి విరిచారు. మరికొందరైతే మిగతా సీనియర్ హీరోల జోరు ముందు మెగాస్టార్ వెనుకబడిపోతున్నారంటూ తొందరపడి విశ్లేషణలు కూడా ఇచ్చేశారు. కానీ వాటన్నింటికీ ఒకే ఒక్క సినిమాతో గట్టి సమాధానం దొరికింది. అదే మన శంకరవరప్రసాద్ గారు. విమర్శకుల అంచనాలను తలకిందులు చేస్తూ.. బాక్సాఫీస్ దగ్గర అసలు సిసలైన బాస్ ఎవరో ఈ సినిమా నిరూపించింది. అభిమానులు ఎప్పటినుంచో ఆకలిగా ఎదురుచూస్తున్న విషయం ఏదైనా ఉందంటే.. అది చిరంజీవి మార్క్ కామెడీ మరియు ఆ అలవోకగా సాగిపోయే నటన. ఈ సినిమాతో ఆ లోటు పూర్తిగా తీరిపోయింది. ఆయన కామెడీ టైమింగ్ ముగిసింది అన్నవాళ్లకి ఈ సినిమా ఒక సర్ప్రైజ్ ప్యాకేజీలా మారింది.
దశాబ్దాల క్రితం మనం చూసి ప్రేమించిన ఆ చిలిపిదనం.. ఆ హుషారు, ఆ గ్రేస్ ఈ సినిమాలో రెట్టింపు స్థాయిలో కనిపించాయి. స్క్రీన్ మీద ఆయన నవ్వుతుంటే థియేటర్ మొత్తం నవ్వుతో నిండిపోయింది. ఇది కేవలం నటన కాదు, ఇన్నాళ్లుగా దాచుకున్న వింటేజ్ మ్యాజిక్ ఒక్కసారిగా బయటపడినట్లుంది. ప్రస్తుతం ఇండస్ట్రీలో సీనియర్ హీరోలందరూ బాగానే రాణిస్తున్నప్పటికీ.. కమర్షియల్ స్టామినా విషయంలో మెగాస్టార్ ఎప్పుడూ ఒక అడుగు ముందే ఉంటారని ఈ సినిమా కలెక్షన్స్ రుజువు చేస్తున్నాయి. పోటీ అనే మాటకు తావు లేకుండా.. తన సమకాలీన హీరోల కంటే బాక్సాఫీస్ పరంగా ఆయన ఆమడ దూరంలో ఉన్నారు. ఓపెనింగ్స్ నుంచి లాంగ్ రన్ వరకూ ఆయనకు వచ్చే ఆదరణ వేరు. మిగతా హీరోలు హిట్ కొట్టినప్పుడు వచ్చే రెవెన్యూకి, మెగాస్టార్ సినిమాకి వచ్చే రెవెన్యూకి ఉన్న వ్యత్యాసాన్ని ఈ సినిమా స్పష్టంగా చూపించింది. సీనియర్ రేస్ లో ఆయనకు ఆయనే సాటి అని మరోసారి తేలిపోయింది.
సాధారణంగా ఒక హీరో ప్రభావం ఒకటి లేదా రెండు తరాలకే పరిమితం అవుతుంది. కానీ మెగాస్టార్ ఒక ఎవర్ గ్రీన్ పెర్ఫార్మర్. ఇన్నేళ్లయినా నేటి జనరేషన్ కూడా ఆయన సినిమాకి టికెట్లు తెంచుకుని థియేటర్లకు క్యూ కడుతున్నారంటే.. ఆయనలో ఉన్న ఆకర్షణ ఏమాత్రం తగ్గలేదని అర్థమవుతోంది. తాతలు, తండ్రులు, ఇప్పుడు మనవళ్లు.. ఇలా మూడు తరాలను ఏకధాటిగా అలరించడం ఒక్క చిరంజీవికే సాధ్యం. ట్రెండ్ ఏదైనా దాన్ని తనవైపు తిప్పుకోవడం, లేటెస్ట్ ఆడియన్స్ నాడి పట్టుకోవడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య అని ఈ సినిమా సక్సెస్ చాటిచెప్పింది. చివరగా ఒక్క మాటలో చెప్పాలంటే.. మన శంకరవరప్రసాద్‌గారు సినిమా కేవలం రికార్డులు తిరగరాయడమే కాదు.. ఇండస్ట్రీలో నెంబర్ 1 అనే స్థానానికి అసలైన నిర్వచనం ఇచ్చింది. ఎవరెన్ని అనుకున్నా, బాక్సాఫీస్ బరిలో దిగితే మెగాస్టార్ రేంజ్ వేరు. ఆయన దరిదాపుల్లోకి రావడం ప్రస్తుతానికి అసాధ్యం. ఈ విజయం ఆయన స్థాయిని, స్థానాన్ని మరింత పదిలం చేసింది. దశాబ్దాలు గడుస్తున్నా.. పోటీ పెరుగుతున్నా.. తెలుగు సినిమా చరిత్రలో ఆయన ది అన్ డిస్ప్యూటెడ్ అండ్ ఓన్లీ వన్ అని గర్వంగా చెప్పుకోవచ్చు.











