భారతీయ చలనచిత్ర పరిశ్రమలో ప్రస్తుతం ఒకే ఒక పేరు మార్మోగిపోతోంది. అదే 'ధురంధర్-2'. రణవీర్ సింగ్ హీరోగా, దర్శకుడు ఆదిత్య ధర్ కాంబినేషన్‌లో వచ్చిన ఈ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ బాక్సాఫీస్ వద్ద సరికొత్త చరిత్రను లిఖిస్తోంది. విడుదలైన కేవలం నాలుగు రోజుల్లోనే ఈ చిత్రం సాధించిన వసూళ్లు చూసి ట్రేడ్ వర్గాలు సైతం నోరెళ్లబెడుతున్నాయి. అసాధారణమైన కలెక్షన్లతో ఈ సినిమా ఇండియన్ సినిమా రికార్డులను తిరగరాస్తోంది. ధురంధర్-2' బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టిస్తోంది. ఈ చిత్రం మొదటి నాలుగు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా 800 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించి సరికొత్త మైలురాయిని అందుకుంది.
గతంలో బాహుబలి-2, RRR, మరియు ఇటీవల వచ్చిన కల్కి 2898 AD చిత్రాలు సృష్టించిన ప్రారంభ వసూళ్ల రికార్డులను ఇది సవాల్ చేస్తోంది. కేవలం నాలుగు రోజుల్లోనే ఈ స్థాయి వసూళ్లు రావడం భారతీయ సినిమా చరిత్రలో ఒక అరుదైన ఘట్టం. దీనిని బట్టి చూస్తే, ఈ సినిమా కేవలం ఉత్తరాదిలోనే కాకుండా, విదేశాల్లోనూ, దక్షిణాదిలోనూ భారీ స్థాయిలో ఆదరణ పొందుతోందని స్పష్టమవుతోంది.ఈ చిత్రం మరొక అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకుంది. హిందీ సినీ చరిత్రలోనే వరుసగా రెండు రోజుల పాటు 100 కోట్లకు పైగా నెట్ వసూళ్లు సాధించిన తొలి చిత్రంగా 'ధురంధర్-2' నిలిచింది. ఆదివారం నాటికి కేవలం ఇండియాలోనే 470 కోట్ల నెట్ కలెక్షన్లను రాబట్టడం విశేషం.
రణవీర్ సింగ్ కెరీర్‌లోనే ఇది బిగ్గెస్ట్ హిట్‌గా నిలవడమే కాకుండా, ఆయన్ని గ్లోబల్ స్టార్‌గా నిలబెట్టింది. ప్రస్తుతం ఉన్న ట్రెండ్ చూస్తుంటే, ఈ సినిమా లాంగ్ రన్‌లో మరిన్ని రికార్డులను తుడిచిపెట్టేలా కనిపిస్తోంది. ముఖ్యంగా రాజమౌళి చిత్రాలైన బాహుబలి-2 మరియు RRR సాధించిన లైఫ్ టైమ్ కలెక్షన్లను 'ధురంధర్-2' అధిగమిస్తుందా? అన్న చర్చ ఇప్పుడు ఫిల్మ్ నగర్లో జోరుగా సాగుతోంది. యాక్షన్ సీక్వెన్సులు, ఆదిత్య ధర్ మేకింగ్ స్టైల్ మరియు రణవీర్ సింగ్ పవర్ ప్యాక్డ్ పర్ఫార్మెన్స్ ప్రేక్షకులను థియేటర్లకు పరుగులు పెట్టిస్తున్నాయి.మొత్తానికి 'ధురంధర్-2' బాక్సాఫీస్ వద్ద ఒక రికార్డుల సునామీని తీసుకువచ్చింది. వీక్ డేస్‌లో కూడా ఇదే జోరు కొనసాగితే, ఈ చిత్రం అతి త్వరలోనే 1500 కోట్ల క్లబ్‌లో చేరడం ఖాయంగా కనిపిస్తోంది. భారతీయ సినిమా సత్తాను ప్రపంచవ్యాప్తంగా చాటిచెబుతున్న ఈ చిత్రం ఇంకా ఎన్ని వండర్స్ క్రియేట్ చేస్తుందో వేచి చూడాలి.