దళపతి విజయ్‌తో లింక్.. రాజకీయ వివాదాలపై త్రిష సీరియస్.. లీగల్ నోటీసుతో ఘాటు సమాధానం..!

తమిళ రాజకీయాల్లో విజయ్‌తో పాటు త్రిష పేరు కూడా బలంగా వినిపిస్తుందిప్పుడు. దానికి కారణం ఇద్దరి మధ్య ఉన్న స్నేహమే.

Post Published By: dialnews
Updated : 16 February 2026, 7:20 PM IST

తమిళ రాజకీయాల్లో విజయ్‌తో పాటు త్రిష పేరు కూడా బలంగా వినిపిస్తుందిప్పుడు. దానికి కారణం ఇద్దరి మధ్య ఉన్న స్నేహమే. దాన్ని రాజకీయంగా కొందరు టార్గెట్ చేస్తున్నారు. ఇన్నాళ్లూ విజయ్, త్రిష బంధంపై మాట్లాడే ధైర్యం ఎవరూ చేయలేదు.. కానీ విజయ్ ఇప్పుడు రాజకీయాల్లో ఉన్నాడు కాబట్టి అతన్ని టార్గెట్ చేయడానికి త్రిష పేరు అడ్డు పెట్టుకుంటున్నారు. దీనిపై రియాక్ట్ అయింది త్రిష కృష్ణన్.. తనపై సోషల్ మీడియా, మీడియాలో జరుగుతున్న అసత్య ప్రచారాలు, రాజకీయపరమైన వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించింది. ఈ మేరకు ఆమె తరఫు న్యాయవాది నిత్యేష్ నటరాజ్ ఫిబ్రవరి 15, 2026న ఒక అధికారిక పత్రికా ప్రకటనను విడుదల చేశారు. రాష్ట్ర రాజకీయాల్లో అత్యున్నత పదవిలో ఉన్న ఒక వ్యక్తి, ఒక మహిళ పట్ల, అందులోనూ ఒక ప్రముఖ నటి పట్ల ఇంతటి జుగుప్సాకరమైన వ్యాఖ్యలు చేయడంపై త్రిష తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. బాధ్యతాయుతమైన స్థానంలో ఉన్న వారి నుండి ఇలాంటి మాటలు రావడం తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని ఆమె పేర్కొంది.

తనకు రాజకీయాలతో ఎటువంటి సంబంధం లేదని త్రిష ఈ ప్రకటన ద్వారా మరోసారి స్పష్టం చేసింది. గతంలోనూ ఆమె ఇదే విషయాన్ని అనేక సందర్భాల్లో వెల్లడించినా కూడా తన పేరును కావాలనే కొందరు దిగజారుడు కామెంట్స్ కోసం వాడుకుంటున్నారని తెలిపింది త్రిష. తాను ఏ రాజకీయ పార్టీకి మద్దతు తెలపడం లేదని, భవిష్యత్తులో కూడా రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం తనకు లేదని కుండబద్దలు కొట్టింది. కేవలం తన పేరును వాడుకుని రాజకీయ లబ్ధి పొందాలనే ప్రయత్నాలను ఆమె తీవ్రంగా ఖండించింది. తాను ఎప్పుడూ తటస్థ వైఖరినే అవలంబిస్తానని, తనను అనవసరంగా రాజకీయ వివాదాల్లోకి లాగవద్దని ఆమె కోరింది. ఒక నటిగా తన నటన, వృత్తిపరమైన నిబద్ధత ద్వారా మాత్రమే తనను గుర్తించాలని త్రిష ఆకాంక్షించింది. వ్యక్తిగత జీవితం అనేది పూర్తిగా ప్రైవేట్ వ్యవహారమని, దాన్ని బహిరంగ చర్చలకు వస్తువుగా మార్చడం సరికాదని ఆమె హితవు పలికింది. సమాజంలో ఉన్నత హోదాలో ఉన్న వ్యక్తులు మాట్లాడేటప్పుడు మరింత బాధ్యతగా, హుందాగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని ఆమె గుర్తుచేశారు.

మహిళల పట్ల గౌరవం లేకుండా మాట్లాడటం, వాళ్ళ వ్యక్తిత్వాన్ని కించపరచడం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. ఈ ప్రకటనలో ప్రధానంగా, తన పేరును రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవడం తగదని వార్నింగ్ ఇచ్చింది త్రిష. తనకు సంబంధం లేని విషయాల్లో, రాజకీయ ఆరోపణల్లో తన ప్రస్తావన తీసుకురావద్దని గట్టిగా కోరింది. ఇది కేవలం ఒక విజ్ఞప్తి మాత్రమే కాదని, తన ఆత్మగౌరవాన్ని కాపాడుకునేందుకు చేస్తున్న న్యాయపరమైన హెచ్చరిక అని కూడా అర్ధం చేసుకోవచ్చు. అనవసరమైన వ్యాఖ్యలతో తన ప్రతిష్టకు భంగం కలిగించే వాళ్ళపై న్యాయపరమైన చర్యలకు కూడా వెనుకాడబోనని పరోక్షంగా సంకేతాలిచ్చింది త్రిష. చివరగా మీడియా అండ్ సోషల్ మీడియా వేదికల్లో బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, నిరాధారమైన ఆరోపణలను ప్రచారం చేయవద్దని త్రిష తరఫు న్యాయవాది కోరాడు. ఈ అధికారిక ప్రకటన ద్వారా త్రిష, తనపై జరిగిన దాడిని తిప్పికొట్టడమే కాకుండా, మహిళల పట్ల సమాజంలో, ముఖ్యంగా రాజకీయాల్లో ఉండాల్సిన కనీస మర్యాదను గుర్తుచేసే ప్రయత్నం చేసింది. రాజకీయాలకు అతీతంగా, ఒక మహిళగా తన గౌరవాన్ని కాపాడుకునేందుకు ఆమె తీసుకున్న ఈ నిర్ణయం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

Published : 
  • 16 February 2026, 7:20 PM IST