ఉమ్మడి వరంగల్ జిల్లా కాంగ్రెస్ రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. రాష్ట్ర అటవీ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి మధ్య ఉన్న పాత విభేదాలు మళ్లీ రచ్చకెక్కాయి. ఇప్పటిదాకా అంతర్గతంగా ఉన్న ఆధిపత్య పోరు.. ఎండోమెంట్ శాఖ సమీక్ష వివాదంతో బహిర్గతమైంది.దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్న కొండా సురేఖకు కనీస సమాచారం ఇవ్వకుండా.. ఆ శాఖ అధికారులతో ఎమ్మెల్యే కడియం శ్రీహరి అధికారిక సమీక్ష నిర్వహించడం ఈ తాజా వివాదానికి ప్రధాన కారణం. హైదరాబాద్‌లోని బొగ్గులకుంటలో ఉన్న దేవాదాయ శాఖ కమిషనర్ కార్యాలయంలో కడియం శ్రీహరి ఈ మీటింగ్ పెట్టారు. తన నియోజకవర్గమైన స్టేషన్ ఘన్పూర్ పరిధిలోని దేవాలయాల అభివృద్ధి, మాస్టర్ ప్లాన్స్ రూపకల్పన, దేవాదాయ భూముల పరిరక్షణ, గడువులు నిర్దేశించడం తదితర కీలక అంశాలపై ఆయన ఏకంగా అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ వ్యవహారంపై మంత్రి కొండా సురేఖ తీవ్రంగా స్పందించారు.
తన శాఖలో, తనకే తెలియకుండా వేరొకరు.. అదీ ఒక ఎమ్మెల్యే నేరుగా అధికారులతో సమీక్ష చేయడంపై మంత్రి కొండా సురేఖ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రిగా తన అధికార పరిధిని బలహీనపరిచే కుట్ర జరుగుతోందని, తన ప్రాధాన్యతను తగ్గించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ఈ సమీక్షపై తనకు రాతపూర్వకంగా పూర్తి వివరణ ఇవ్వాలని దేవాదాయ శాఖ అధికారులను మంత్రి ఆదేశించారు. ఈ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణించిన మంత్రి కొండా సురేఖ.. నేరుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. ప్రభుత్వ పరిపాలనా విధానాలను, రూల్స్ ఆఫ్ బిజినెస్‌ను బేఖాతరు చేస్తూ ఒక ఎమ్మెల్యే తన శాఖలో ఎలా జోక్యం చేసుకుంటారని ఆ లేఖలో ప్రశ్నించారు. ఈ ఉల్లంఘనపై చర్యలు తీసుకోవాలని కోరారు. కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ దృష్టికి కూడా ఈ వివాదాన్ని తీసుకెళ్లారు మంత్రి.
మరోపక్క ఇదే విషయంపై ఎమ్మెల్యే కడియం శ్రీహరి స్పందించారు. నేరుగా కొండా పేరు ప్రస్తావించకుండానే.. తాను చేసిన పనిని సమర్థించుకున్నారు. కొందరు కేవలం పబ్లిసిటీ కోసం పని చేస్తూ వరంగల్ అభివృద్ధిని పక్కన పెట్టేశారంటూ ఆరోపించారు. జిల్లాలో ఎన్నో సమస్యలు పేరుకుపోయి ఉంటే.. అవేమీ పట్టించుకోకుండా ఇలాంటి పంచాయితీలు పెడుతున్నారంటూ చెప్పారు. తాను ఎలాంటి తప్పు చేయలేదని, ఎవరికీ వివరణ ఇవ్వాల్సిన అవసరం తనకు లేదంటూ ఘాటు రిప్లై ఇచ్చారు కడియం.
నిజానికి కొండా, కడియం వర్గాల మధ్య ఈ ఆధిపత్య పోరు ఈనాటిది కాదు. వరంగల్ జిల్లాపై పట్టు కోసం ఈ ఇద్దరు సీనియర్ల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం ఎప్పటి నుంచో నడుస్తూనే ఉంది. గతంలో కొండా సురేఖకు వ్యతిరేకంగా కొందరు ఎమ్మెల్యేలు క్యాంపు కార్యాలయంలో రహస్యంగా భేటీ అవ్వడం వెనుక కూడా కడియం శ్రీహరి వ్యూహం ఉందనే ఆరోపణలు వచ్చాయి. అధిష్టానం చొరవతో ఈ వివాదాలు సద్దుమణిగాయి అనుకుంటున్న తరుణంలోనే, ఇప్పుడు ఈ ఎండోమెంట్ మీటింగ్ రూపంలో మళ్లీ వివాదం రాజుకుంది. ప్రభుత్వంలో ఉన్నత స్థానాల్లో ఉన్న నాయకులు ఒకరి శాఖలో మరొకరు ఇలా జోక్యం చేసుకోవడం పార్టీ ప్రతిష్టను దెబ్బతీస్తుందని, కార్యకర్తల్లో తప్పుడు సంకేతాలు వెళ్తాయని పార్టీ శ్రేణులు ఆందోళన చెందుతున్నాయి. రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారిన ఈ "వరంగల్ పంచాయితీ"ని సీఎం రేవంత్ రెడ్డి, అధిష్టానం ఎలా పరిష్కరిస్తారో వేచి చూడాలి.