Top story:అమెరికాతో డబుల్ గేమ్…మునీర్‌పై నిఘా తన గొయ్యి తానే తవ్వుకున్న పాకిస్తాన్…!

ఒకప్పుడు పొరుగు దేశాల్లో యుద్ధాలు జరిగితే పాకిస్తాన్‌ ఖజానా కాసులతో గలగలలాడేది. అగ్రరాజ్యం అగ్రరాజ్యానికి అద్దె సైనికుడిలా మారి బిలియన్ల కొద్దీ డాలర్లను ఒడిసిపట్టిన హిస్టరీ ఇస్లామాబాద్‌ది. కానీ, కాలం మారింది. ప్రస్తుతం మారుతున్న అంతర్జాతీయ సమీకరణాలు పాకిస్తాన్‌

Post Published By: dialnews
Updated : 21 April 2026, 11:13 AM IST

ఒకప్పుడు పొరుగు దేశాల్లో యుద్ధాలు జరిగితే పాకిస్తాన్‌ ఖజానా కాసులతో గలగలలాడేది. అగ్రరాజ్యం అగ్రరాజ్యానికి అద్దె సైనికుడిలా మారి బిలియన్ల కొద్దీ డాలర్లను ఒడిసిపట్టిన హిస్టరీ ఇస్లామాబాద్‌ది. కానీ, కాలం మారింది. ప్రస్తుతం మారుతున్న అంతర్జాతీయ సమీకరణాలు పాకిస్తాన్‌ను కోలుకోలేని దెబ్బ తీస్తున్నాయి. అమెరికా-ఇరాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు పాకిస్తాన్‌కు కాసులు కురిపించడం పక్కన పెడితే, ఉన్న నిల్వలను కూడా ఊడ్చేస్తున్నాయి. అటు ఏప్రిల్ 22తో కాల్పుల విరమణ గడువు ముగుస్తుండటం, ఇటు హార్ముజ్‌లో యుద్ధ మేఘాలు కమ్ముకోవడంతో పాకిస్తాన్ దౌత్య ప్రయత్నాలు తుస్సుమన్నాయి. ఈ పరిణామాలపై స్థానిక మీడియా కూడా ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తోంది. "ప్రపంచ దేశాల మధ్య తిరుగుతున్నా దేశానికి ఒరిగిందేంటి?" అంటూ నిలదీస్తోంది.

పాకిస్తాన్‌ చరిత్రను చూస్తే, ఆ దేశ భౌగోళిక స్థానం ఎప్పుడూ ఆ దేశానికి లాభదాయకంగానే ఉంటూ వచ్చింది. 1979లో నాటి సోవియెట్ రష్యా ఆఫ్ఘనిస్తాన్‌పై దాడి చేసినప్పుడు అమెరికా ఆశ్రయం కోసం పాక్‌వైపు చూసింది. అప్పట్లో జనరల్ జియా-ఉల్-హక్ అమెరికా ఆఫర్ చేసిన 400 మిలియన్ డాలర్లను వేరుశనగ గింజలు అని తిరస్కరించినంత ధీమాగా ఉండేవాడు. ఆ తర్వాత 1980ల్లో దాదాపు 20 నుంచి 27 బిలియన్ డాలర్ల సహాయాన్ని పాకిస్తాన్ వివిధ మార్గాల్లో పొందింది. 9/11 ఉగ్రదాడుల తర్వాత ముషారఫ్ హయాంలో పాకిస్తాన్‌కు డాలర్ల వరద పారింది. అమెరికా నుంచి సైనిక సహాయం కింద దాదాపు 13 బిలియన్ డాలర్లు అందాయి. నేటి లెక్క ప్రకారం దీని విలువ సుమారు 45 బిలియన్ డాలర్లు. ఈ నిధుల పుణ్యమా అని పాక్ విదేశీ మారక నిల్వలు 2007 నాటికి రికార్డు స్థాయిలో 15.65 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. ఇప్పుడు కూడా మధ్యవర్తిత్వం కారణంగా అలాంటి ఫలితాలే వస్తాయని పాకిస్తాన్ లెక్కలు కట్టింది. కానీ, ఆ లెక్కలు రివర్స్ అయ్యాయి. తొలి రెండు యుద్ధాలు పాకిస్తాన్‌కు బిలియన్ల కొద్దీ నిధులను తెస్తే, ప్రస్తుత అమెరికా-ఇరాన్ వివాదం దేశాన్ని ఆర్థికంగా దెబ్బతీస్తోంది.

గతంలో యుద్ధాలు సంపదను తెస్తే, ప్రస్తుత అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు పాక్ ఆర్థిక మూలాలను కదిలిస్తున్నాయి. ప్రస్తుతం పాకిస్తాన్‌ ఎదుర్కొంటున్న ప్రధాన సవాళ్లలో మొదటిది.. పెట్టుబడుల ఉపసంహరణ. గల్ఫ్ ప్రాంతంలో యుద్ధ భయంతో పెట్టుబడిదారులు పాకిస్తాన్ నుంచి తమ నిధులను వెనక్కి తీసుకుంటున్నారు. రెండోది చమురు సెగ. పాకిస్తాన్‌ దిగుమతి చేసుకునే చమురులో 85శాతం హార్ముజ్ జలసంధి ద్వారానే రావాలి. అక్కడ ఉద్రిక్తతలు పెరిగితే సరఫరా నిలిచిపోయి, ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇది పాక్ దిగుమతి బిల్లును భారంగా మారుస్తోంది. మూడోది మిత్రదేశాల నుంచి ఒత్తిడి. ఊహించని విధంగా యూఏఈ తాము అప్పుగా ఇచ్చిన 3.5 బిలియన్ డాలర్లను ఏప్రిల్ నెలాఖరుకల్లా తిరిగి ఇచ్చేయాలని డిమాండ్ చేయడంతో పాకిస్తాన్‌ను ఊపిరాడకుండా చేస్తోంది. ఇలా ప్రస్తుత యుద్ధం పాకిస్తాన్ మెడపై కత్తిగా మారింది. ఆ కత్తి నుంచి తప్పించుకోడానికే ఇస్లామాబాద్ పీస్ మేకర్ అవతారం ఎత్తింది. కానీ, ఇరాన్ మొండిపట్టుదలతో అది సాధ్యం కావడం లేదు.

నిజానికి.. పాకిస్తాన్‌ దివాలా తీయకుండా ఉండేందుకు ఖతార్, సౌదీ అరేబియా కలిసి ఐదు బిలియన్ డాలర్ల ఆర్థిక ప్యాకేజీని ప్రకటించాయి. అయితే, ఇది కేవలం తాత్కాలిక ఉపశమనం మాత్రమే. పాక్ వద్ద ఉన్న 16 బిలియన్ డాలర్ల రిజర్వుల్లో ఇప్పటికే 5.7 బిలియన్ డాలర్లు బయటకు వెళ్లిపోయాయి. దీంతో ఆ దేశాలు మాత్రం ఎంత కాలం ఆర్థిక సాయం చేస్తూ వెళతాయి? ఇప్పుడు పాకిస్తాన్ గట్టెక్కాలంటే ఒక్కటే మార్గం. అమెరికా-ఇరాన్ మధ్య శాంతి చర్చల్లో ఫలితం రాబట్టాలి. లేకపోతే పీస్ మేకర్‌గా వేసిన ఈ అడుగే ఇస్లామాబాద్‌కు ఆఖరి అడుగవుతుంది. ఈ ప్రయత్నం కనుక విఫలమైతే, ప్రపంచ వేదికపై పాకిస్తాన్ ఒక నమ్మదగిన దేశం కాదనే ముద్ర పడే అవకాశం ఉంది. ట్విస్ట్ ఏంటంటే.. పాకిస్తాన్ మధ్యవర్తిత్వంపై అమెరికాలోనూ ఆందోళన మొదలైంది. ముఖ్యంగా మునీర్‌కు ఐఆర్‌జీసీ నేతలతో ఉన్న సంబంధాలను అమెరికా నిఘా వర్గాలు రెడ్ అలర్ట్‌గా భావిస్తున్నాయి. సో.. ఈ విషయంలో తేడా వస్తే అమెరికా కూడా ఉగ్రదేశాన్ని ఎడంకాలితో తన్నడం ఖాయం. ఓవరాల్‌గా ఒకప్పుడు భౌగోళిక స్థానాన్ని అడ్డం పెట్టుకుని ప్రపంచ దేశాలను తనవైపు తిప్పుకున్న పాకిస్తాన్, ఇప్పుడు అదే భౌగోళిక స్థానం వల్ల అగ్నిగుండంలో చిక్కుకుంది. యుద్ధం ఎవరికి లాభమో గానీ, పాకిస్తాన్‌కు మాత్రం అది ఇప్పుడు పెను శాపంగా మారింది.

 

Published : 
  • 21 April 2026, 11:13 AM IST