Top Story: బీఆర్‌ఎస్‌కు ‘డ్రగ్స్’ సెగ… ఫామ్‌హౌస్ సంస్కృతితో… కూలుతున్న గులాబీ కోట..!

తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు ఎక్కడ చూసినా ఒకటే చర్చ.. "డ్రగ్స్ పార్టీలు - బీఆర్‌ఎస్ నేతల కనెక్షన్". ఒకప్పుడు అధికారాన్ని చెలాయించిన గులాబీ దళం, ఇప్పుడు వరుసగా డ్రగ్స్ ఆరోపణల్లో కూరుకుపోవడం ఆ పార్టీ మనుగడకే సవాలుగా

Post Published By: dialnews
Updated : 17 March 2026, 8:19 AM IST

తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు ఎక్కడ చూసినా ఒకటే చర్చ.. "డ్రగ్స్ పార్టీలు - బీఆర్‌ఎస్ నేతల కనెక్షన్". ఒకప్పుడు అధికారాన్ని చెలాయించిన గులాబీ దళం, ఇప్పుడు వరుసగా డ్రగ్స్ ఆరోపణల్లో కూరుకుపోవడం ఆ పార్టీ మనుగడకే సవాలుగా మారింది. కేవలం రాజకీయ విమర్శలు మాత్రమే కాదు, ప్రత్యక్షంగా పోలీసులు జరిపిన దాడుల్లో దొరికిన ఆధారాలు బీఆర్‌ఎస్ అగ్రనేతలను ఆత్మరక్షణలో పడేశాయి. కేవలం రాజకీయ విమర్శలే కాదు, పోలీసుల దాడుల్లో దొరికిన ఆధారాలు, పాజిటివ్ వచ్చిన డ్రగ్ టెస్ట్ రిపోర్టులు పార్టీ ప్రతిష్ఠను మసకబారుస్తున్నాయి.గత పదేళ్ల పాలనలో హైదరాబాద్‌లో 'ఫామ్‌హౌస్ కల్చర్' విపరీతంగా పెరిగిపోయింది. నగర శివార్లలోని విలాసవంతమైన ఫామ్‌హౌస్‌లు కేవలం రిలాక్స్ సెంటర్ లుగా కాకుండా, అర్ధరాత్రి జరిగే రికార్డింగ్ డ్యాన్సులు, విదేశీ మద్యం, ప్రాణాంతకమైన కొకైన్, ఎల్‌ఎస్‌డీ వంటి డ్రగ్స్‌కు కేరాఫ్ అడ్రస్‌లుగా మారాయనే ఆరోపణలు ఇప్పుడు నిజమవుతున్నాయి. జన్వాడలోని కేటిఆర్ బావ మరిది అయిన, రాజ్ పాకాల ఫామ్‌హౌస్‌లో జరిగిన పార్టీలో విదేశీ మద్యం ఏరులై పారింది. డ్రగ్స్ టెస్టుల్లో ఒకరు పాజిటివ్‌గా తేలడం, రాజ్ పాకాలపై కేసులు నమోదు కావడం కేటీఆర్ కుటుంబానికే పెద్ద తలవంపులుగా మారింది.

తాజా మోయిన్‌బాద్ దాడిలో రోహిత్ రెడ్డికి చెందిన ఫామ్‌హౌస్‌లో కొకైన్ దొరకడం, ఆయనతో పాటు మరో నలుగురు డ్రగ్స్ వాడినట్లు ప్రాథమిక రిపోర్టుల్లో తేలడం సంచలనం సృష్టించింది. అసలు పోలీసులను చూసి గాలిలోకి కాల్పులు జరపడం అంటే.. అక్కడ ఎంతటి అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయో అర్థం చేసుకోవచ్చనే మాట సమాజంలో వినపడుతోంది. గత ప్రభుత్వ హయాంలోనూ డ్రగ్స్ కేసులు.. టాలీవుడ్ డ్రగ్స్ కేసు వంటివి వచ్చినా, అవన్నీ నీరుగారిపోయాయనే విమర్శ ఉంది.అప్పట్లో కీలక నేతల ఒత్తిడి వల్లే సిట్ దర్యాప్తు ఆగిపోయిందని, ఇప్పుడు ప్రభుత్వం మారడంతో పాత పాపాలన్నీ ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయని కాంగ్రెస్ ప్రభుత్వం ఘాటుగా విమర్శిస్తోంది. "అప్పుడు కాపాడారు.

ఇప్పుడు దొరికిపోయారు" అన్న చందంగా బీఆర్‌ఎస్ పరిస్థితి తయారైంది. ఈ డ్రగ్స్ పార్టీల వెనుక కేవలం ఎంజాయ్‌మెంట్ మాత్రమే లేదు. కేదార్ అనే వ్యక్తి అనుమానాస్పద మృతి, దుబాయ్‌లో ఉన్న వందల కోట్ల ఆస్తుల పంచాయతీలు కూడా ఈ పార్టీల్లోనే జరుగుతున్నాయని ప్రచారం జరుగుతోంది.డ్రగ్స్ మత్తులో ఉంచి డీల్స్ సెటిల్ చేయడం, హవాలా ద్వారా డబ్బును విదేశాలకు తరలించడం వంటి గంభీరమైన అంశాలు ఇప్పుడు తెరపైకి వస్తున్నాయి. తమ పార్టీ నేతలపై వస్తున్న ఆరోపణలను కేటీఆర్ రాజకీయ కక్షగా అభివర్ణిస్తున్నారు. "ప్రభుత్వం వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే మాపై బురద జల్లుతున్నారు" అని ఆయన వాదిస్తున్నారు. కానీ, పోలీసులు శాస్త్రీయంగా ఆధారాలు చూపుతుండటంతో, కేవలం 'రాజకీయ కక్ష' అనే మాట ప్రజల్లోకి వెళ్లడం లేదు. క్షేత్రస్థాయిలో దొరికిన ఆధారాలు ఆయన వాదనను బలహీనపరుస్తున్నాయి.

సొంత పార్టీ క్యాడర్ కూడా ఈ వరుస డ్రగ్స్ వివాదాలతో నైతికంగా దెబ్బతింటోంది. ఒకప్పుడు తెలంగాణ సెంటిమెంట్‌తో, అభివృద్ధి మంత్రంతో ప్రజల మనసు గెలుచుకున్న బీఆర్‌ఎస్, ఇప్పుడు "డ్రగ్స్ పార్టీల పార్టీ"గా ముద్ర పడటం ఆందోళనకరం. ముఖ్యంగా యువత ఈ వార్తలను గమనిస్తోంది. పార్టీ క్లీన్ ఇమేజ్‌ను కాపాడుకోవాల్సిన సమయంలో, నేతలు ఇలాంటి 'రేవ్ పార్టీ'ల్లో దొరికిపోవడం పార్టీ పతనానికి సంకేతమని విశ్లేషకులు భావిస్తున్నారు. గత పదేళ్ల పాలనలో ఇలాంటి ఎన్ని పార్టీలు జరిగాయో, ఎన్ని కేసులు నీరుగారిపోయాయో అన్న అనుమానాలు ఇప్పుడు ప్రజల్లో వ్యక్తమవుతున్నాయి.తెలంగాణను డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మారుస్తామని గతంలో ప్రగల్భాలు పలికిన నేతలే, ఇప్పుడు డ్రగ్స్ కేసుల్లో ఏ-1, ఏ-2 నిందితులుగా ఉండటం యువతలో తప్పుడు సంకేతాలను పంపుతోంది. ఈ 'మత్తు' మరకను వదిలించుకోకపోతే రాబోయే ఎన్నికల్లో బీఆర్‌ఎస్ భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు. డ్రగ్స్ మహమ్మారి తెలంగాణను పీడిస్తున్న వేళ, బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్నవారు, ఉన్నత వర్గాలకు చెందిన వారు ఇలాంటి కేసుల్లో ఇరుక్కోవడం దురదృష్టకరం. చట్టం తన పని తాను చేసుకుపోతే, ఈ 'డ్రగ్స్ నెట్‌వర్క్'లో ఇంకా ఎన్ని పెద్ద తలకాయలు బయటపడతాయో వేచి చూడాలి.

Published : 
  • 17 March 2026, 8:19 AM IST