Top Story: ఇరాన్ – ఇజ్రాయిల్ యుద్ధం… భారత్‌కు పంపే డబ్బుపై ఓ రేంజ్ ఎఫెక్ట్…!

పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ మేఘాలు భారత ఆర్థిక వ్యవస్థపై, ముఖ్యంగా ప్రవాస భారతీయులు పంపే నిధులపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Post Published By: dialnews
Updated : 7 March 2026, 12:05 PM IST

పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ మేఘాలు భారత ఆర్థిక వ్యవస్థపై, ముఖ్యంగా ప్రవాస భారతీయులు పంపే నిధులపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. వారం క్రితం మొదలైన ఈ యుద్ధం ఎప్పటికి కొలిక్కి వస్తుందో చెప్పలేని పరిస్థితి నెలకొంది. రష్యా – ఉక్రెయిన్ యుద్ధం మాదిరిగా ఎన్నాళ్ళు సాగుతుందో అర్ధం కాని పరిస్థితి నెలకొంది. ఇరాన్.. భయపడుతుందని అంచనా వేస్తున్నా.. ఎక్కడా వెనక్కు తగ్గడం లేదు. బంగారం, చమురు ధరలు పెరగడంతో పాటుగా ఇప్పుడు విదేశాల నుంచి భారత్ కు వచ్చే డబ్బుపై కూడా ఈ యుద్ధం ప్రభావం తీవ్రంగా పడుతోంది.

మన దేశానికి వచ్చే మొత్తం రెమిటెన్స్‌లలో సుమారు 38% వాటా గల్ఫ్ దేశాల నుంచే వస్తోంది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో భారత్ కు రికార్డు స్థాయిలో 135 బిలియన్ డాలర్లు అంటే.. మన కరెన్సీలో 12.53 లక్షల కోట్ల రూపాయలు వచ్చాయి. ఇందులో సుమారు 51 బిలియన్ డాలర్లు కేవలం గల్ఫ్ ప్రాంతం నుంచే వచ్చాయి. అయితే గతంలో గల్ఫ్ దేశాల వాటా 47% ఉండగా, ప్రస్తుతం అది 38%కి తగ్గింది. ఇరాన్ - ఇజ్రాయిల్ మధ్య యుద్ధం గల్ఫ్ దేశాలకు వ్యాపిస్తే, ఈ నిధుల ప్రవాహం దెబ్బతినే ప్రమాదం ఉంది.

దీని కారణంగా తక్షణ, దీర్ఘకాలిక ప్రభావాలు ఉండే అవకాశం ఉంది. తక్షణ ప్రభావం చూస్తే.. యుద్ధ భయంతో విదేశాల్లో ఉన్న భారతీయులు తమ వద్ద ఉన్న పొదుపు మొత్తాన్ని త్వరగా స్వదేశానికి పంపించే అవకాశం ఉంది. దీనివల్ల స్వల్పకాలంలో రెమిటెన్స్‌లు పెరిగే అవకాశం ఉంది. దీర్ఘకాలిక ముప్పు చూస్తే.. యుద్ధం సుదీర్ఘ కాలం కొనసాగితే గల్ఫ్ దేశాల్లోని నిర్మాణ, సేవా, చమురు రంగాల్లో ఆర్థిక మందగమనం ఏర్పడవచ్చు. దీనివల్ల భారతీయుల ఉపాధి దెబ్బతిని, వారు పంపించే సొమ్ము తగ్గుతుంది.

అలాగే గల్ఫ్ ప్రాంతంలో సుమారు 90 లక్షల నుంచి ఒక కోటి మంది భారతీయులు నివసిస్తున్నారు. ఒకవేళ యుద్ధం తీవ్రమైతే.. అనేక కంపెనీలు తమ కార్యకలాపాలను నిలిపివేయవచ్చు, దీనివల్ల వేతనాల్లో కోతలు లేదా ఉద్యోగాల తొలగింపులు ఉండే అవకాశం ఉంది. ఇప్పటికే ఐటీ కంపెనీలు తమ ఉద్యోగులను తొలగిస్తున్నాయి. ఇప్పుడు యుద్ధం కారణంగా మరింత మంది ఉద్యోగాలు కోల్పోయే అవకాశం ఉంది. గల్ఫ్ నుంచి భారతీయులు పెద్ద ఎత్తున స్వదేశానికి తిరిగి రావలసి వస్తే, మన దేశానికి వచ్చే నిధుల ప్రవాహం ఒక్కసారిగా ఆగిపోవచ్చు.

యుద్ధం కారణంగా చమురు ధరలు పెరిగితే భారత రూపాయి విలువ పడిపోయే అవకాశం ఉంది. రూపాయి విలువ తగ్గితే, విదేశాల్లో సంపాదించే వారికి భారత్‌కు డబ్బు పంపినప్పుడు ఎక్కువ రూపాయిలు వస్తాయి. కానీ, అదే సమయంలో దేశీయంగా నిత్యావసర వస్తువుల ధరలు పెరగడం వల్ల ఆ నిధుల కొనుగోలు శక్తి తగ్గుతుంది. గతంతో పోలిస్తే భారత్ ఇప్పుడు అమెరికా, బ్రిటన్, సింగపూర్ వంటి అభివృద్ధి చెందిన దేశాల నుంచి కూడా అధికంగా నిధులను అందుకుంటోంది.

అమెరికా నుంచి వచ్చే నిధుల వాటా 27.7%గా ఉంది. గల్ఫ్ దేశాల కంటే ఎక్కువగా ఉండటం వల్ల, గల్ఫ్ సంక్షోభం.. భారత ఆర్థిక వ్యవస్థను పూర్తిగా కుప్పకూల్చలేదని విశ్లేషకుల అభిప్రాయం. యుద్ధం కేవలం ఇరాన్ - ఇజ్రాయిల్ మధ్య పరిమితమైతే ప్రభావం తక్కువగా ఉంటుంది. కానీ, ఇది యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లేదా సౌదీ అరేబియా వంటి దేశాలకు పాకితే మాత్రం భారత రెమిటెన్స్‌లు, దేశ ఆర్థిక స్థిరత్వంపై తీవ్రమైన ప్రతికూల ప్రభావం తప్పదనే మాట వినపడుతోంది.

రాష్ట్రాలపై ప్రభావం ఒకసారి చూస్తే.. కేరళ వంటి రాష్ట్రాలు దేశం మొత్తం రెమిటెన్స్‌లలో సుమారు ఐదవ వంతు అంటే 20% అందుకుంటున్నాయి, కాబట్టి అక్కడ ఆర్థిక వ్యవస్థపై కొంత ప్రభావం పడుతుంది. యుద్ధం తీవ్రమైతే బ్యాంకింగ్ వ్యవస్థలు దెబ్బతినవచ్చనే ఆందోళనతో, గల్ఫ్‌లోని భారతీయులు తమ సేవింగ్ అకౌంట్స్ లో ఉన్న మొత్తాన్ని త్వరగా స్వదేశానికి పంపే అవకాశం ఉంది. ఈ ప్రభావం కూడా దీర్ఘ కాలిక సమస్యలు సృష్టించే అవకాశం ఉంది. యుద్ధం వల్ల పాఠశాలలు, రవాణా వ్యవస్థలు స్తంభిస్తే చాలా మంది భారతీయులు శాశ్వతంగా స్వదేశానికి తిరిగి వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి.

ఈ ప్రభావం కూడా తీవ్రంగా ఉంటుంది. ఎన్‌ఆర్‌ఐ డిపాజిట్లపై కూడా దీని ప్రభావం ఉంటుందని అంచనా. ఫెడరల్ బ్యాంక్, సౌత్ ఇండియన్ బ్యాంక్ వంటి గల్ఫ్ నిధులపై ఎక్కువగా ఆధారపడే బ్యాంకుల డిపాజిట్ ల వృద్ధి మందగించే అవకాశం ఉంది. కరెంట్ అకౌంట్ లోటు కూడా ఉండే అవకాశాలు కనపడుతున్నాయి. భారత్ తన చమురు అవసరాల్లో 80-90% దిగుమతి చేసుకుంటుంది. యుద్ధం వల్ల చమురు ధరలు ప్రతి పది డాలర్లు పెరిగితే, అది భారత జీడీపీ వృద్ధిని 0.3% తగ్గించి, ద్రవ్యోల్బణాన్ని 0.4% పెంచుతుంది. అలాగే హార్ముజ్ జలసంధి మూసివేత సుదీర్ఘ కాలం కొనసాగితే, మాత్రం గల్ఫ్ ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలి, భారతీయ కుటుంబాలకు అందే ఆర్థిక చేయూత తీవ్రంగా దెబ్బతింటుంది.

Published : 
  • 7 March 2026, 12:05 PM IST