Top Story: ఖమేనికి భారత్ పై ప్రేమ… ఇరాన్ లో భారత్ భారీ పెట్టుబడులు..!

అయతుల్లా అలీ ఖమేనీ” దశాబ్దాలుగా ఇరాన్ ను కంటి చూపుతో శాసించిన సుప్రీమ్ లీడర్. ఇస్లామిక్ దేశాల చరిత్రలో ఇంత బలమైన నాయకుడిని ప్రపంచం చూడలేదు.

Post Published By: dialnews
Updated : 2 March 2026, 12:15 PM IST

అయతుల్లా అలీ ఖమేనీ” దశాబ్దాలుగా ఇరాన్ ను కంటి చూపుతో శాసించిన సుప్రీమ్ లీడర్. ఇస్లామిక్ దేశాల చరిత్రలో ఇంత బలమైన నాయకుడిని ప్రపంచం చూడలేదు. ఇరాన్ ను ఇస్లామిక్ రిపబ్లిక్ గా తీర్చిదిద్దే క్రమంలో ఆయన అగ్ర రాజ్యం అమెరికా, ఆ దేశ మిత్రుడు ఇజ్రాయిల్ తో కయ్యానికి కూడా వెనకడుగు వేయలేదు. అణు ఒప్పందాలు, క్షిపణి సామర్ధ్యం.. సైన్యం బలోపేతం.. ఇలా ఇరాన్ ను తిరుగులేని శక్తిగా మార్చేందుకు ఖమేని కష్టపడ్డాడు. ఇక అతనిపై ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో ప్రచారాలు ఉన్నాయి. మన భారత్ లో కూడా అతనిపై సోషల్ మీడియాలో పలు ఆసక్తికర కథనాలు వైరల్ అవుతున్నాయి.

కానీ.. అతనికి భారత్ అంటే ప్రత్యేక అభిమానంగా చెప్పవచ్చు. ఇరాన్ సుప్రీం లీడర్‌గా భారత్‌తో మంచి సంబంధాలు పెంపొందించాలని కోరుకున్నాడు. ఇరాన్-భారత్ బంధాలు 3000 ఏళ్ల చరిత్ర కలిగి ఉన్నాయి. ఆయన ప్రతినిధి ఈ బంధాలను బలోపేతం చేయాలని ఖమేని కోరుకుంటున్నట్లు ఎన్నో సందర్భాల్లో చెప్పేవారు. ఇరాన్, భారత్ మధ్య సంబంధాలు ఇస్లాం ఆవిర్భావం ముందే అంటే 3000 ఏళ్లకు ముందే మొదలయ్యాయి. ఖమేనీ భారత్ సంస్కృతి, ప్రజలను ఇష్టపడతాడని, ఆయన ప్రతినిధి అబ్దుల్ మాజిద్ హకీమ్ ఇలాహీ పలు వేదికలపై చెప్పడం గమనార్హం.

భారత్‌లో ఖమేనీకి ఓ ప్రతినిధి కూడా ఉండటం గమనార్హం. భారత్ తో వాణిజ్య, వ్యూహాత్మక సహకారం కోరుకున్నారట ఖమేని. చాబహార్ పోర్టు అభివృద్ధిలో భారత్ పెట్టుబడి పెట్టింది. ఇది మధ్య ఆసియా వాణిజ్యానికి కీలకం. భారత్ ఇరాన్‌ కు బాస్మతి బియ్యం, ఔషధాలు, చక్కెర వంటివి ఎగుమతి చేస్తోంది. అమెరికా ఆంక్షలు ఉన్నా, ఈ సహకారం కొనసాగుతోంది. ఇటీవలి అంశాలు ఒకసారి చూస్తే.. ఖమేనీ ప్రతినిధి మాట్లాడుతూ.. ఈ ఏడాది జనవరిలో భారత్-ఇరాన్ సహకారాన్ని పెంచాలని పిలుపునిచ్చారు.

అయితే, కాశ్మీర్‌పై ఖమేనీ వ్యాఖ్యలు మాత్రం భారత్ ను కాస్త ఇబ్బంది పెట్టాయి. దీనిపై భారత్.. ఇరాన్ రాయబారులకు సమన్లు జారీ చేసింది. అలాగే ఐఖ్యరాజ్య సమితిలో ఇరాన్ మానవ హక్కుల తీర్మానానికి.. భారత్ వ్యతిరేకంగా ఓటు వేసింది. ఖమేనీ భారత్‌ ను పలు సందర్భాల్లో కీర్తించాడు. ప్రపంచంలో బలపడుతోన్న ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా భారత్ ను ప్రశంసించాడు ఖమేని. ఇరాన్-భారత్ సహకారాన్ని తాము స్వాగతిస్తామని.. చాబహార్ పోర్టు, వాణిజ్యం వంటి రంగాల్లో లాంగ్-టర్మ్ ఒప్పందాలు అమలు చేయాలని కూడా కోరడం గమనార్హం.

2024లో భారత్ చాబహార్ ఓడరేవుతో 10 సంవత్సరాల ఒప్పందం చేసుకుంది. మధ్య ఆసియాకు వాణిజ్య గేట్‌వే గా మార్చడానికి భారత్ ప్రయత్నాలు చేస్తూ వచ్చింది. ఈ విషయంలో, అమెరికా ఆంక్షలు ఉన్నా, భారత్ పెట్టుబడిని పెంచింది. 2023-24లో ఈ పోర్ట్ ద్వారా జరిగిన వాణిజ్యం 2.33 బిలియన్ డాలర్లకు చేరింది. ఇరాన్ అణు కార్యక్రమం, ఇజ్రాయెల్‌తో ఘర్షణలు భారత్ విదేశాంగ విధానాన్ని సవాలు చేశాయి. అయినా, ఇరాన్ కు బాస్మతి బియ్యం, ఔషధాలు ఎగుమతులు కొనసాగుతున్నాయి. అటు పాకిస్తాన్ కు కూడా ఇరాన్ అత్యంత మిత్రదేశంగా ఉండటం గమనార్హం. భారత్ – పాక్ ఉద్రిక్తల సమయంలో ఇరాన్ సైలెంట్ గానే ఉండిపోయింది. ఇప్పుడు ఖమేని మరణంతో భవిష్యత్తులో సంబంధాలు ఎలా ఉంటాయనేది చూడాలి.

అయితే ఇప్పుడు సంక్షోభం ప్రభావం భారత్ పై తీవ్రంగా పడే అవకాశం ఉంటుంది. ఇరాన్ సంక్షోభం.. ఇజ్రాయెల్-అమెరికా దాడులు, ఖమేనీ మరణం వంటివి భారత ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. చమురు ధరలు, ఎగుమతి-దిగుమతులు, రూపాయి విలువపై ప్రధాన దెబ్బ పడే అవకాశం ఉంది. హార్ముజ్ జలసంధి మూసివేతతో ప్రపంచ చమురు సరఫరా 20% ఆటంకం ఏర్పడుతుంది. భారత్ రోజువారీగా సగటున.. 5 మిలియన్ బ్యారెళ్ల చమురు దిగుమతి చేస్తుంది.

ముడి చమురు ధర బ్యారెల్‌కు 100 డాలర్లకు చేరుకుంటే పెట్రోల్ రూ.110-120కు చేరడం ఖాయం. భారత్ ఇరాన్‌కు బాస్మతి బియ్యం, ఔషధాలు, చక్కెర వంటి చేయడంతో.. దీని కారణంగా భారీ వ్యాపారం జరుగుతోంది. 2024-25లో 1.68 బిలియన్ డాలర్ల వాణిజ్యం జరిగింది. యుద్ధం వల్ల షిప్పింగ్ ఖర్చులు 30-50% పెరిగి ఎగుమతిదారులకు దెబ్బ తగిలే అవకాశం ఉంటుంది. ఇరాన్ నుంచి డ్రై ఫ్రూట్స్, రసాయనాల దిగుమతులు ఆగిపోతాయి. యుద్ధం తీవ్రమైతే మాత్రం భారత్ మరింత ప్రభావితం అయ్యే అవకాశం ఉంటుంది.

Published : 
  • 2 March 2026, 12:15 PM IST