Top story:మిత్ర దేశాల్ని నమ్మించి గొంతుకోసిన పాక్, భారత్‌ను శరణుకోరుతున్న ముస్లిం దేశాలు…!

ప్రగల్భాలు పలకడం, నవ్వులపాలవడం పాకిస్తాన్‌కు కొత్తేంకాదు. సరిగ్గా నెల రోజుల క్రితం పాకిస్తాన్ డిఫెన్స్ మినిస్టర్ ఖవాజా ఆసిఫ్ అదే చేశాడు.

Post Published By: dialnews
Updated : 12 February 2026, 9:37 AM IST

ప్రగల్భాలు పలకడం, నవ్వులపాలవడం పాకిస్తాన్‌కు కొత్తేంకాదు. సరిగ్గా నెల రోజుల క్రితం పాకిస్తాన్ డిఫెన్స్ మినిస్టర్ ఖవాజా ఆసిఫ్ అదే చేశాడు. భారత్‌తో యుద్ధం తర్వాత తమ యుద్ధ విమానాలు, ఆయుధాలకు ఎక్కడలేని గిరాకీ వచ్చిందని, హాట్‌కేకుల్లా సేల్ అవుతున్నాయన్నడు. ఇకపై తమ ఆర్థిక కష్టాలు తీర్చేందుకు ఐఎంఎఫ్ రుణం కూడా అవసరం ఉండకపోవచ్చని పగటి కలలు కన్నాడు. పాకిస్తానీ మిలిటరీ సామర్థ్యాలు ప్రపంచం దృష్టిలో పడ్డాయంటూ జబ్బలు చరుచుకున్నాడు. రియాలిటీలో మాత్రం పాక్ వెపన్స్ కొన్న దేశాలు గుండెలు బాదుకుంటున్నాయి? భారత్‌‌వైపు చూస్తున్నాయి.

ఖవాజా చెప్పినట్టుగా పాకిస్తాన్‌ యుద్ధ విమానాలు జేఎఫ్-17, జే-10కు దొరికిన బయ్యర్లు అజర్‌బైజాన్, లిబియా మాత్రమే. బంగ్లాదేశ్‌ ఇంకా చర్చలు జరుపుతోంది. అయితే, జేఎఫ్‌-17కు రష్యా, చైనా, ఇటలీ, టర్కీ, యూకేకు చెందిన పరికరాలను దాయాది అమర్చుతోంది. ఇటీవల ఇందులోకి సూడాన్ కూడా ఎంటరైంది. పాకిస్తాన్-సుడాన్ సుమారు 1.5 బిలియన్ డాలర్ల విలువైన ఆయుధాల ఒప్పందంపై చర్చలు జరుపుతున్నట్లు రాయిటర్స్ నివేదించింది. ఈ ఒప్పందం త్వరలో ఖరారయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఒప్పందంలో ప్రధానంగా చర్చకు వస్తున్నది JF-17 థండర్ యుద్ధ విమానమే. ఇక అరబ్, ఆఫ్రికా దేశాల్లో ఆయుధాల విక్రయాలు, సైనిక ప్రభావాన్ని విస్తరించడం పాకిస్తాన్ దీర్ఘకాలిక వ్యూహంగా విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. గతంలో పాకిస్తాన్ ప్రధానంగా అరబ్ దేశాల సాయుధ దళాలకు శిక్షణ అందించే పాత్రకే పరిమితమై ఉండగా, ఇప్పుడు నేరుగా ఆయుధ ఎగుమతులు, యుద్ధ విమానాల ఎగుమతుల వైపు అడుగులు వేస్తోంది. అలా పాకిస్తాన్ నుంచి వెపన్స్ కొన్న దేశాలే ఇప్పుడు హతవిధీ అనుకుంటున్నాయి.

పాకిస్తాన్ తయారు చేస్తున్న ఆయుధాల నాణ్యతపై అంతర్జాతీయ స్థాయిలో తీవ్ర ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా అజర్‌బైజాన్‌కు సరఫరా చేసిన మందుగుండు సామగ్రి విషయంలో వస్తున్న వార్తలు పాకిస్తాన్ రక్షణ రంగాన్ని ఆత్మరక్షణలో పడేశాయి. అజర్‌బైజాన్‌కు పాక్ సరఫరా చేసిన మందుగుండు, ఫిరంగి గుండ్లు దశాబ్దాల క్రితం నాటివని, అవి చాలా పాతవని పలు నివేదికలు తేల్చేశాయి. యుద్ధరంగంలో ఈ ఫిరంగి గుండ్లు పాకిస్తాన్ చెప్పిన పరిధిలో కేవలం 40-60 శాతం దూరాన్ని మాత్రమే చేరుకోగలుగుతున్నాయని నిర్ధారించాయి. పాక్ పంపిన ఆయుధాల్లో తుప్పు పట్టడం, ప్రొపెల్లెంట్ లోడ్ తక్కువగా ఉండటం, కొలతల్లో పొరపాట్లు వంటి తీవ్రమైన లోపాలను డిఫెన్స్ ఎక్స్‌పర్ట్స్ గుర్తించారు. కేవలం అజర్‌బైజాన్ మాత్రమే కాదు, గతంలో ఉక్రెయిన్ కూడా పాక్ ఆయుధాల పట్ల పెదవి విరిచింది. పాక్ తయారు చేసిన 155mm షెల్స్ సమయం కంటే ముందే పేలిపోవడం వల్ల తమ ఫిరంగులు దెబ్బతిన్నాయని ఉక్రెయిన్ ఫిర్యాదు చేసింది. ఇప్పుడు అజర్ బైజాన్ సైతం అదే చెబుతోంది.

మరోవైపు.. ఈ పరిణామాలతో పాకిస్తాన్ నుండి కొత్తగా ఆయుధాలు కొనాలని భావిస్తున్న దేశాలు ఇప్పుడు తమ నిర్ణయాలను మార్చుకోవాలనుకుంటున్నాయి. ఒకప్పుడు పాక్ ఆయుధాలపై ఎక్కువగా ఆధారపడిన సౌదీ అరేబియా, ఇప్పుడు నాణ్యత కారణాల వల్ల భారత్, ఇతర దేశాల వైపు మొగ్గు చూపుతోంది. నేడో రేపో సూడాన్‌తో జేఎఫ్-17 డీల్ ఖరారవుతుందని ఆశలు పెట్టుకున్న పాక్‌కు ఆ దేశం కూడా షాక్ ఇవ్వబోతున్నట్టు నివేదికలు చెబుతున్నాయి. నాసిరకం ఆయుధాల సరఫరా వల్ల పాకిస్థాన్ రక్షణ పరిశ్రమ ప్రతిష్ట దెబ్బతినడమే కాకుండా, ఆ దేశంతో దౌత్య సంబంధాలు కలిగి ఉన్న మిత్రదేశాల్లోనూ అసంతృప్తి పెరుగుతోంది. ఒక్క ముక్కలో అంతర్జాతీయ ఆయుధ మార్కెట్‌లో నమ్మకమైన భాగస్వామిగా ఎదగాలని చూస్తున్న పాకిస్తాన్‌కు తన తీరే పెద్ద ఎదురు దెబ్బగా మారింది.
ట్విస్ట్ ఏంటంటే.. ఈ పరిణామాలు భారత్‌కు అనుకూలంగా మారబోతున్నాయి.

ప్రస్తుతం ఆయుధాల మార్కెట్‌లో క్వాలిటీ అనేది అత్యంత కీలక అంశం. పాకిస్తాన్ సరఫరా చేసిన ఫిరంగి గుండ్లు, క్షిపణులు యుద్ధరంగంలో ఆశించిన ఫలితాలను ఇవ్వకపోవడం వల్ల, ఆ దేశంతో ఒప్పందాలు చేసుకున్న దేశాలు ఇప్పుడు భారత్ వైపు చూస్తున్నాయి. భారత్ తయారు చేస్తున్న బ్రహ్మోస్, ఆకాశ్ క్షిపణి వ్యవస్థలు ఇప్పటికే అంతర్జాతీయంగా తమ సత్తా చాటుకున్నాయి.గతంలో పాకిస్తాన్ ఆయుధాలను కొనుగోలుచేసిన కొన్ని ఆఫ్రికా, మిడిల్ ఈస్ట్ దేశాలు ఇప్పుడు భారత్ తయారు చేస్తున్న మందుగుండు సామాగ్రి, డ్రోన్లు, తేలికపాటి ఫైటర్ల పట్ల ఆసక్తి చూపుతున్నాయి. పాక్ ఆయుధాలు కొనే దేశాలు ఎక్కువగా బడ్జెట్ తక్కువగా ఉండే అభివృద్ధి చెందుతున్న దేశాలు. భారత్ ఇప్పుడు తక్కువ ధరలో అత్యుత్తమ నాణ్యత గల ఆయుధాలను అందిస్తుండటంతో, ఆ దేశాలకు ఇండియా మొదటి ప్రాధాన్యతగా మారుతోంది. ఉదాహరణకు, ఆర్మేనియా ఇప్పటికే భారత్ నుండి పినాక రాకెట్ లాంచర్లు కొనుగోలు చేస్తోంది. ఆఫ్ఘాన్ వంటి దేశాలు పాక్‌పై ఆధారపడటాన్ని తగ్గించుకుని భారత్ వైపు చూడటం వల్ల, దక్షిణాసియాలో భారత్ పట్టుబిగిస్తోంది. పాక్ ఆయుధాల వైఫల్యం, చైనా వెపన్స్ నాణ్యతపై వస్తున్న అనుమానాలు, భారత రక్షణ ఉత్పత్తులకు గ్లోబల్ మార్కెట్‌లో తిరుగులేని స్థాయిలో నిలబెడుతున్నాయి.

 

Published : 
  • 12 February 2026, 9:37 AM IST