Top story:నైనీ టెండర్ టూ మెస్సీ మ్యాచ్, విచారణకు ఆదేశించిన కేంద్రం…!
తెలంగాణ పాలిటిక్స్‌ను కుదిపేస్తున్న నైనీ కోల్ బ్లాక్ విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ ప్రభుత్వం టెండర్‌ను రద్దు చేసినా..
తెలంగాణ పాలిటిక్స్‌ను కుదిపేస్తున్న నైనీ కోల్ బ్లాక్ విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ ప్రభుత్వం టెండర్‌ను రద్దు చేసినా.. కేంద్ర ప్రభుత్వం మాత్రం దీని వెనక ఉన్న నిజనిజాలు బయటికి లాగేందుకు ఇద్దరు సభ్యులతో కమిటీ వేసింది. నైనీ కోల్ బ్లాక్ విషయమే కాకుండా సింగరేణి నిధులతో మెస్సీ మ్యాచ్ ఏర్పాటు విషయంలో కూడా కేంద్రం కూపీ లాగనుంది. మరో మూడు రోజుల్లో ఈ మొత్తం వ్యవహారం డొంక కదలబోతోంది.
సింగరేణి ఆధ్వర్యంలో చేపట్టిన నైనీ కోల్ బ్లాక్ టెండర్ల వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి ఆదేశాలతో నైనీ బొగ్గు గనుల టెండర్ల రద్దుపై విచారణకు ఇద్దరు అధికారులతో టెక్నికల్ కమిటీని వేసింది. ఇందులో బొగ్గు గనుల శాఖ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ చేతన శుక్లా, డైరెక్టర్ మారపల్లి వెంకటేశ్వర్లు ఉన్నారు. మూడు రోజుల్లో నివేదిక అందించాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు బొగ్గు గనుల శాఖ నుంచి సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్‌కు లేఖ వచ్చింది. ఈ అధికారుల టెక్నికల్ బృందం సింగరేణి కార్యాలయాన్ని సందర్శించి, విచారణ జరిపి మూడు రోజుల్లో తన సమగ్ర నివేదికను కేంద్ర ప్రభుత్వాని పంపించనున్నారు. ఈ నివేదిక ఆధారంగా కేంద్ర ప్రభుత్వం ఈ విషయంలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
నైనీ కోల్ బ్లాక్ విషయం తెలంగాణలో పెద్ద రాజకీయ దుమారాన్ని లేపింది. ఈ బ్లాక్ వివాదం కావడానికి ముఖ్య కారణం సైట్ విజిట్ సర్టిఫికేట్ ఖచ్చితంగా ఉండాలి అనే కొత్త నిబంధన తీసుకురావడం. ప్రాజెక్ట్ కోసం టెండర్ వేయాలంటే సైట్ విజిట్ చేయాలనే నిబంధనను ప్రతిపక్షాలు తప్పుబట్టాయి. నైనీ బొగ్గు గని నుండి బొగ్గు వెలికితీత బాధ్యతలను ఒక ప్రైవేట్ సంస్థకు అప్పగించే ప్రక్రియలో నిబంధనలను ఉల్లంఘించారని ఆరోపణలు ఉన్నాయి. తమకు నచ్చిన వారికి టెండర్ వచ్చేలా చేసేందుకు కొందరు వ్యక్తులు ప్రభుత్వాన్ని మేనేజ్ చేసి ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని.. ఇందులో భారీ స్థాయి అవినీతికి తెరలేపారని ఆరోపణ చేశారు మాజీ మంత్రి హరీష్ రావు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి హరీష్ రావు లేఖ కూడా రాశారు. ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త నిబంధనల కారణంగా సింగరేణికి వేల కోట్ల నష్టం జరుగుతోందని చెప్పారు. దీంతో ఈ వ్యవహారాన్ని కేంద్ర ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది.
ఒకవైపు కోల్ మైన్ టెండర్ల దందాలపై విచారణ జరపమని చెప్తూనే కేంద్రం మరో షాక్ ఇచ్చింది. సీఎస్ఆర్ నిధుల ఖర్చుల సరళిపైనా విచారణ జరిపి నివేదిక ఇవ్వాలంది. దీంతో ఇటీవల రేవంత్ రెడ్డి మెస్సీ ఫుట్బాల్ ఈవెంట్ కోసం ఖర్చు చేసిన సింగరేణి సీఎస్ఆర్ నిధుల దుర్వినియోగంపై సైతం విచారణ జరగనుందని సింగరేణి వర్గాలు చెబుతున్నాయి. ఇటీవల మెస్సీ ఫుట్బాల్ ఈవెంట్ కోసం 10 కోట్ల సింగరేణి నిధులను ఖర్చు పెట్టిన నేపథ్యంలో కేంద్రం ఈ విధంగా స్పందించింది. మరికొన్ని కార్యక్రమాల కోసం సైతం సింగరేణి సీఎస్ఆర్ ఫండ్స్ దుర్వినియోగం అయ్యాయనే ఆరోపణల నేపథ్యంలోనే కేంద్రం ఈ మేరకు విచారణ చేసి 3 రోజుల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశించినట్లుగా తెలుస్తోంది.










