ఇజ్రాయెల్‌ని క్యాన్సర్‌తో పోల్చిన పాకిస్తాన్… యాక్షన్‌లోకి మొసాద్… ఇక పాక్ గేమ్ ఓవర్…!

మిడిల్ ఈస్ట్ యుద్ధ సంక్షోభం వేళ పాకిస్తాన్ రక్షణ మంత్రి చేసిన అత్యంత వివాదాస్పద ట్వీటే ఇది. లెబనాన్‌ దాడుల విషయంలో ఇజ్రాయెల్‌పై అభ్యంతకర వ్యాఖ్యలు చేశాడు. ఇజ్రాయెల్‌ అనే దేశం క్యాన్సర్‌ లాంటిదని, ప్రపంచానికి పట్టిన శాపం అన్న రీతిలో నోరు పారేసుకున్నాడు

Post Published By: dialnews
Updated : 11 April 2026, 9:03 AM IST

మిడిల్ ఈస్ట్ యుద్ధ సంక్షోభం వేళ పాకిస్తాన్ రక్షణ మంత్రి చేసిన అత్యంత వివాదాస్పద ట్వీటే ఇది. లెబనాన్‌ దాడుల విషయంలో ఇజ్రాయెల్‌పై అభ్యంతకర వ్యాఖ్యలు చేశాడు. ఇజ్రాయెల్‌ అనే దేశం క్యాన్సర్‌ లాంటిదని, ప్రపంచానికి పట్టిన శాపం అన్న రీతిలో నోరు పారేసుకున్నాడు. తమ దేశంలో శాంతి చర్చలు జరుగుతున్నప్పటికీ.. లెబనాన్‌లో ఇజ్రాయెల్ అమాయకులను చంపుతోంది అని ఆరోపించాడు. గాజా, ఇరాన్ తర్వాత.. లెబనాన్‌లో రక్తపాతం కొనసాగిస్తోందనీ, అలాంటి దేశాన్ని పుట్టించినవాళ్లు నరకంలో కాలిపోతూ చిత్రహింసలు అనుభవించాలని కోరుకుంటున్నట్లు రాశాడు. సోషల్‌ మీడియాలో ఆసిఫ్‌ చేసిన ఈ తీవ్ర వ్యాఖ్యలు.. మిడిల్ ఈస్ట్‌ యుద్ధ సంక్షోభాన్ని విధ్వంసక మలుపు తిరిగేలా చేసింది. పాకిస్తాన్ డిఫెన్స్ మినిస్టర్ ఈ రేంజ్‌లో రెచ్చిపోయిన తర్వాత ఇజ్రాయెల్ సీన్‌లోకి వచ్చింది.

ఉగ్రదేశంపై ఓ రేంజ్‌లో విరుచుకుపడింది.పాక్ మంత్రి కన్నింగ్ కామెంట్లకు ఇజ్రాయెల్ మార్క్ కౌంటర్ ఇది. ఎక్కడా బ్యాలెన్స్ కోల్పోలేదు. చాలా పద్ధతిగా ఇదేనా నీ శాంతి సందేశం అనేలా కౌంటర్ ఇచ్చింది ఇజ్రాయెల్. ఆసిఫ్ వ్యాఖ్యలపై ట్వీట్ చేసిన ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు కార్యాలయం.. ఇజ్రాయెల్‌ నాశనం కోరుకుంటున్న పాకిస్తాన్ మంత్రి వ్యాఖ్యలు అసహ్యకరంగా ఉన్నాయని పేర్కొంది. ఏ దేశం ఇలాంటి వ్యాఖ్యలను స్వాగతించబోదని.. పైగా శాంతి చర్చల్లో మధ్యవర్తిగా వ్యవహరిస్తున్న దేశం నుంచి ఇలాంటివి ఊహించలేం అంటూ కౌంటర్ ఇచ్చింది. ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రి గిడియోన్ సర్ కూడా పాక్‌ నాయకత్వాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. ఇజ్రాయెల్‌ను క్యాన్సర్‌ జబ్బుతో పోల్చడం అంటే.. ఒక దేశ నాశనాన్ని కోరుకోవడమేనని, ఇలాంటి వ్యాఖ్యలు ఏమాత్రం మంచివి కావని అన్నారు. ఇరు దేశాల ఈ కౌంటర్లే ఇప్పుడు పశ్చిమాసియాలో ప్రకంపనలు పుట్టిస్తున్నాయి. ఇరాన్‌-అమెరికా యుద్ధంలో చైనాతో పాటు పాకిస్తాన్ మధ్యవర్తిత్వం వహించడం ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. కానీ ఈ వ్యవహారంలో పాక్‌ పాత్ర ఏమీ ఉండకపోవచ్చని.. అసలు ఆ దేశాన్ని నమ్మడానికే వీల్లేదని భారత్‌లోని ఇజ్రాయెల్ రాయబారి వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యల తర్వాతే పాకిస్తాన్ రక్షణ మంత్రి ఇజ్రాయెల్‌ను క్యాన్సర్‌తో పోలుస్తూ రెచ్చిపోయాడు. కానీ, ఇదే తాను చేసిన అతిపెద్ద తప్పవుతుందని అతడికి ఇంకా అర్థం కావడం లేదు.

ఇదిలా ఉంటే ఇజ్రాయెల్‌ను క్యాన్సర్‌తో పోల్చడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పాక్ రక్షణ మంత్రి ఇజ్రాయెల్‌ను విమర్శించే ముందు తమ దేశ చరిత్రను ఒక్కసారి చూసుకోవాలని విశ్లేషకులు హితబోధ చేస్తున్నారు. లష్కరే తోయిబా, జైషే మహమ్మద్ వంటి డజన్ల కొద్దీ ఉగ్రవాద సంస్థలను పెంచి పోషిస్తూ, పొరుగు దేశాలైన భారత్, ఆఫ్ఘనిస్తాన్‌లో అశాంతిని రేపుతున్న పాకిస్తానే ప్రపంచానికి అసలైన క్యాన్సర్ అని ప్రపంచంలో ఎవరిని అడిగినా చెబుతారని గుర్తు చేస్తున్నారు. సొంత దేశ ప్రజలు ఆకలితో అలమటిస్తుంటే, ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతుంటే.. ఆ వైఫల్యాల నుండి ప్రజల దృష్టి మళ్లించడానికి భారత్, ఇజ్రాయెల్‌పై విమర్శలు చేయడం పాకిస్తాన్ పాలకులకు ఒక అలవాటుగా మారిందని ఎద్దేవా చేస్తున్నారు. ఇలాంటి బాధ్యతారహితమైన వ్యాఖ్యల వల్ల పాకిస్తాన్ అంతర్జాతీయ వేదికలపై మరింత ఏకాకి అవుతుందని విదేశాంగ నిపుణులు హెచ్చరిస్తున్నారు. క్యాన్సర్ అని ఇతరులను వేలెత్తి చూపించే ముందు, తన దేశాన్ని పట్టి పీడిస్తున్న ఉగ్రవాదమనే క్యాన్సర్‌కు చికిత్స చేసుకోవడం పాక్‌కు శ్రేయస్కరం అంటున్నారు. ఈసారి ఇజ్రాయెల్ కేవలం మాటలతో సరిపెట్టకపోవచ్చని, పాక్ ఆర్థిక, దౌత్యపరమైన మూల్యం చెల్లించుకోక తప్పదని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.

నిజానికి.. ఇజ్రాయెల్‌-పాకిస్తాన్‌ మధ్య ఏనాడూ అధికారిక సంబంధాలు లేవు. పైగా ఉగ్రవాదం విషయంలో పాక్‌పై ముందు నుంచీ ఇజ్రాయెల్ గురి ఉంది. అలాంటిది తమను క్యాన్సర్‌గా పోల్చి విమర్శిస్తే టెల్ అవీవ్ ఎందుకు ఊరుకుంటుంది. ఇప్పటికైతే మాటలతోనే బదులిచ్చింది.కానీ, ఈసారి చేతలతోనే బదులిస్తుంది. ఆ దిశగా ఆల్రెడీ ఇండియాతో కలిసి అడుగులేస్తోంది ఇజ్రాయెల్. భారత్, ఇజ్రాయెల్ నిఘా సంస్థలు 'రా', మొసాద్ కలిసి పనిచేయాలని ఇటీవలే నిర్ణయించుకున్నాయి. ఈ రెండు పవర్‌ఫుల్ గ్రూపులు పాకిస్తాన్‌పై నిఘాపెడితే రిజల్ట్ ఎలా ఉంటుందో ప్రత్యేకించి చెప్పాల్సినఅవసరం లేదు. ఇరు దేశాల మధ్య ఆల్రెడీ రక్షణ భాగస్వామ్యం బలోపేతమవుతోంది. అత్యాధునిక ఆయుధ టెక్నాలజీ బదిలీ కూడా జరుగుతోంది. ఒక రకంగా పాకిస్తాన్‌కు అసలు భయం కూడా భారత్, ఇజ్రాయెల్ మధ్య స్నేహ బంధమే. అందుకే, పనికట్టుకుని ఆ దేశంపై విమర్శలకు దిగుతోంది. గతంలో ఇలా విమర్శలకు దిగినా.. ఈసారి చేసిన క్యాన్సర్ వ్యాఖ్యల్నిమాత్రం ఇజ్రాయెల్ ఎన్నటికీ మర్చిపోదు. చాలా త్వరలోనే పాకిస్తాన్ ఈ దుస్సాహసానికి ఫలితం అనుభవించక తప్పదు.

 

Published : 
  • 11 April 2026, 9:03 AM IST