ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల్లో కూటమి ఎమ్మెల్యేల తీరు తలనొప్పిగా మారింది. సిఎం చంద్రబాబు, డిప్యూటి సిఎం పవన్ కళ్యాణ్ ఎంత చెప్పినా.. ఎమ్మెల్యేలకు లెక్క లేదా..? అనే సంకేతాలు వస్తున్నాయి. అసెంబ్లీ సమావేశాల విషయంలో ప్రభుత్వ పెద్దలు సీరియస్ గా ఉంటున్నారు. సభకు హాజరు కావాలని 20 నెలల నుంచి ఎమ్మెల్యేలకు పదే పదే చెప్తూనే ఉన్నారు. సభలో లేకపోతే కలిగే ఇబ్బందులు, రాజకీయ భవిష్యత్తుపై పడే దెబ్బ అన్నీ కూడా వివరించే ప్రయత్నం చేస్తున్నారు.
కానీ.. కానీ సభకు మాత్రం ఎమ్మెల్యేలు రావడం లేదు. తూతూ మంత్రంగా సభకు వచ్చి వెళ్ళిపోతున్నారు ఎమ్మెల్యేలు. ఇటీవల ఎమ్మెల్యేలకు సిఎం చంద్రబాబు, డిప్యూటి సిఎం పవన్ కళ్యాణ్ హెచ్చరికలు కూడా చేసారు. గత నెలలో పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేలతో సమావేశం కూడా అయ్యారు. సభకు వచ్చే వారికి సీనియర్ నేతలతో సలహాలు కూడా ఇప్పించారు. ఇక సభలో హాజరు విషయంలో చాలా జాగ్రత్తగా, టెక్నాలజీ వాడుకుంటూ, ముందుకు వెళ్తుంది రాష్ట్ర ప్రభుత్వం.
అయినా సరే ఎమ్మెల్యేలు మాత్రం లెక్క చేయడం లేదు. 175 కోణాల్లో ఒక్కో ఎమ్మెల్యేని సభలో కెమెరాలు ఫోటోలు తీస్తాయి. ఆ ఫోటోలు సరిగా ఉంటేనే హాజరు. సభలో కేటాయించిన కుర్చీలో కూర్చుంటేనే హాజరు పడుతుంది. ఈ విషయాన్ని స్పీకర్ అయ్యన్న పాత్రుడు స్పష్టంగా చెప్పారు. అయినప్పటికీ.. హాజరు వేయించుకుని సైలెంట్ గా సభ నుంచి జారుకుంటున్నారు ఎమ్మెల్యేలు. అలా కనపడి ఇలా మాయం అవుతున్నారు. జీరో అవర్, క్వశ్చన్ అవర్ లో కనీసం ఏ అంశాలను ప్రస్తావించడం లేదు.
వెనుకబడిన ప్రాంత ఎమ్మెల్యేలు.. సభలో కూడా వెనుకబడుతున్నారు. రోడ్లు, పెన్షన్ లు, ఇతర అభివృద్ధి కార్యక్రమాలు ఎన్ని ఉన్నా సరే.. లెక్క చేయడం లేదు ఎమ్మెల్యేలు. తమ తమ నియోజకవర్గాల్లో సమస్యలను పరిష్కరించాలని సభలో కోరడం లేదు. క్వశ్చన్ అవర్ లో ఒకరో ఇద్దరో ఎమ్మెల్యేలు మినహా రోజు ప్రశ్నలు అడిగే వారే కనపడటం లేదు. బడ్జెట్ లో తమ నియోజకవర్గానికి నిధులు కేటాయించారు అనో.. తమ జిల్లాకు కేటాయించలేదు అనో.. ఏదోక విషయం మాట్లాడవచ్చు.
రావడం, కూర్చోవడం, భోజనం చేయడం లేదంటే సచివాలయంలో తిరగడమే ఎమ్మెల్యేలు చేస్తున్నారు. చాలా మంది విజయవాడ వెళ్లి.. హోటల్స్ లో ఉంటున్నారు గాని.. సభలో మాత్రం ఉండటానికి ఇష్టపడటం లేదు. అందుకే.. జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్.. ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్నారు. సభకు డుమ్మా కొడుతున్న ముగ్గురు ఎమ్మెల్యేలకు పవన్ స్వయంగా వార్నింగ్ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. సభకు రాకపోవడానికి గల కారణాలను కూడా పవన్ అడిగి తెలుసుకున్నట్లు సమాచారం.
కనీసం సభ నుంచి బయటకు వెళ్తుంటే.. పార్టీ మంత్రులకు అయినా చెప్పి వెళ్ళాలి కదా..? విజయవాడలో, సచివాలయంలో ఏం పని అంటూ పవన్ ప్రశ్నించినట్లు సమాచారం. తన శాఖతో దాదాపుగా ప్రతీ ఎమ్మెల్యేకి అవసరం ఉంటుంది. అయినా సరే ఏ ఒక్క ఎమ్మెల్యే కూడా తన వద్దకు వెళ్లి రోడ్లు గాని, గ్రామాల్లో లైట్ లు గానీ ఏది అడగడం లేదని కూడా పవన్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. విజయవాడలో ఏం చేస్తున్నారని పవన్ నిలదీసినట్లు కూడా వార్తలు వస్తున్నాయి.
మంత్రులు అందరూ సభలో ఉంటే.. సచివాలయంలో ఎందుకు తిరుగుతున్నారని కూడా పవన్ ప్రశ్నించినట్లు సమాచారం. అలాగే కల్తీ లడ్డు విషయంలో వైసీపీ విమర్శలు చేస్తుంటే మీరు ఎందుకు మాట్లాడటం లేదని కూడా పవన్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు జనసేన వర్గాలు అంటున్నాయి. ఇక మీడియా ముందు గాని, సోషల్ మీడియాలో గాని ప్రభుత్వ అనుకూల ప్రచారం చేయడం లేదని కూడా కొందరు ఎమ్మెల్యేలపై పవన్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఇలాగే ఉంటే తనకు గాని, పార్టీకి గానీ మీ అవసరం లేదని పవన్ హెచ్చరించినట్లు ఆ పార్టీ వర్గాలు అంటున్నాయి.