Top story:పెళ్లి కూడా రాజకీయమేనా? చెన్నైలో వైయస్ అనిల్ కొడుకు పెళ్లిపై రాజకీయ రచ్చ…!

ఏపీలో ఏదైనా రాజకీయమే. పెళ్లి.... చావు... పరామర్శ ఏదైనా సరే ప్రత్యర్థులు రచ్చ రచ్చ చేసి వదిలిపెడతారు.

Post Published By: dialnews
Updated : 11 February 2026, 8:10 PM IST

ఏపీలో ఏదైనా రాజకీయమే. పెళ్లి.... చావు... పరామర్శ ఏదైనా సరే ప్రత్యర్థులు రచ్చ రచ్చ చేసి వదిలిపెడతారు. చెన్నైలో జరిగిన వైసీపీ అధినేత వైయస్ జగన్ సోదరుడు వైయస్ అనిల్ రెడ్డి కొడుకు సాహిల్ వివాహ వేడుక చుట్టూ రాజకీయం అలుముకుంది.జగన్ చిన్నాన్న జార్జి రెడ్డి కుమారుడు వైయస్ అనిల్ రెడ్డి. అనిల్ ఒకరకంగా జగన్ కి గుండెకాయ లాంటి వాడు. జగన్ ఆర్థిక వ్యవహారాలన్నీ చక్కబెట్టేది అనీలే. చెన్నై లీలా ప్యాలెస్ అడ్డాగా అనిల్ ఆర్థిక ,రాజకీయ, వ్యాపార వ్యవహారాలన్నీ సాగుతూ ఉంటాయి. గతంలో సౌత్ ఆఫ్రికా లో లిక్కర్, మైనింగ్ బిజినెస్ చేసిన అనిల్ జగన్ వైసీపీ పెట్టిన తర్వాత ఇండియా కొచ్చి ఆ పార్టీకి జగన్ కి సంబంధించిన తెరవెనక వ్యవహారాలన్నీ నడుపుతున్నాడు.

అనిల్ రెడ్డి కొడుకు సాహిల్ కు తమిళనాడులోని మురుగప్ప గ్రూప్ అధినేత ఎం ఎం మురుగప్పణ్ మనవరాలితో పెళ్లి నిశ్చయమైంది. తమిళనాడులోని అత్యంత ధనిక పారిశ్రామికవేత్తల్లో మురుగప్పనొకరు. ఆ రాష్ట్రంలోనే అన్ని పార్టీల అధినేతలు, సినిమా ఇండస్ట్రీ తో మురుగుప్పనకు ప్రత్యేక సంబంధం ఉంది.అనిల్ రెడ్డి కుమారుడు సాహిల్ పెళ్లికి జగన్ ఒక రోజు ముందే చేరుకున్నారు. సహజంగానే జగన్ ఎక్కడికి వచ్చినా జనం ఎగబడతారు కనుక... చెన్నైలోనూ అదే పరిస్థితి ఎదురయింది. ఇక ఈ పెళ్లికి తమిళనాడులోని అతిరథ మహారధులు అంతా హాజరయ్యారు.

తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్, కుమారుడు ఉదయినిది, మాజీ ముఖ్యమంత్రి పలని స్వామి, టి వి కే పార్టీ అధినేత విజయ్, తో పాటు ప్రముఖ హీరోలు సూర్య ఆయన తమ్ముడు కార్తీ కూడా ఈ పెళ్లికి వచ్చారు. సూర్య, కార్తీ కుటుంబ సభ్యులు భారతీ ,రఘురాం సిమెంట్స్ లో భాగస్వాములు కూడా. జగన్ కుటుంబంతో వాళ్ళకి ఎప్పటినుంచో అనుబంధం ఉంది. ఇక ఈ పెళ్లికి వైసీపీ హేమాహేమీలంతా హాజరవడం పెద్ద ఆశ్చర్యం ఏమీ కాదు.అనిల్ రెడ్డి ఇంట్లో పెళ్లికి తమిళనాడు రాజకీయ నేతలు, పారిశ్రామికవేత్తలు, సినిమా వాళ్ళు తరలి రావడం.... వాళ్లందరినీ జగన్ ఆప్యాయంగా ఆహ్వానించడం.... ఇదంతా టీవీల్లో చూసిన, ఏపీలో రాజకీయ ప్రత్యర్థులు ఉలిక్కిపడ్డారు.

జగన్ తన తమ్ముడి కొడుకు పెళ్లిలో కూడా రాజకీయ బల ప్రదర్శన చేశారని, కావాలనే పెళ్లికి ప్రముఖుల అందరినీ పిలిపించి... తాను ఎక్కడున్నా జనం వచ్చి పడిపోతారనే బ్రమ కలిగించారని... మీడియాలో ఒక వర్గం ప్రచారం మొదలు పెట్టింది. అసలు జగన్ కి అనిల్ కి అంత సీన్ లేదని, అనిల్ వియ్యంకులు మురుగప్ప గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ అధినేతలు. వాళ్లకి తమిళనాడు రాజకీయ ,సినిమా వర్గాలతో బలమైన సంబంధాలు ఉండడం వల్లే.... మురుగప్పన్ కోసంవాళ్లంతా తరలి వచ్చారని మరో యాంగిల్ లో స్టోరీలు అల్లేసారు. టి వి కే అధినేత విజయ్.... వధూవరులకు ఇవ్వడానికి బొకే తెస్తే , అది తనకే అనుకుని లాక్కున్నాడంటూ సెటైర్లు వేశారు.ఏపీలో సోషల్ మీడియా వేదిక గా జరుగుతున్న పొలిటికల్ వార్ గతి తప్పిపోతుంది. టిడిపి జనసేన, వైసిపి పార్టీలు ఒకరినొకరు బ్రష్టు పట్టించడానికి ఏ అవకాశాన్ని వదులుకోవట్లేదు. అది పెళ్లయిన.... ప్రమాదమైన.... చావు అయిన... పరామర్శ అయినా సరే. 2029 ఎన్నికల నాటికి... ఇది ఏ స్థాయికి చేరుతుందో చూడాలి?

 

 

Published : 
  • 11 February 2026, 8:10 PM IST