పార్లమెంట్ ఎన్నికల్లో ఓడిపోయింది...సెంబ్లీ ఎన్నికల్లోనూ వరుసగా పరాజయాలే...అసమర్థుడు అన్నారు. సినిమా డైలాగ్‌లు పేల్చారు. నాడు పప్పు అంటూ గేలి చేశారు. ఒకటేమిటి...ఎన్ని మాటలు అనాలో అన్ని అన్నారు. సంవత్సరాలు గడిచే కొద్దీ...రాటుదేలుతున్నాడు. అధికార పక్షాన్ని ముప్పు తిప్పలు పెడుతున్నాడు. విశ్వగురుగా చలామణి అవుతున్న మోడీకి చుక్కలు చూపించాడు. ఇంతకీ ఎవరని అనుకుంటున్నారు...ఈ స్టోరీ చూసేయండి.రాహుల్ గాంధీ...కాంగ్రెస్ పార్టీ ఎంపీ. ఇంకా చెప్పాలంటే లోక్‌సభలో విపక్ష కూటమిని నడిపించే నాయకుడు. లీడర్ అంటే ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్‌ను చదవడం కాదు...తానే సొంతంగా స్పీచ్‌ను తయారు చేసుకొని...ఏ యే అంశాలను మాట్లాడాలో ముందుగానే ప్రిపేర్ అవుతాడు. ప్రతిపక్ష నాయకుడిగా తానేంటో ఎన్నోసార్లు నిరూపించుకున్నాడు.
రాహుల్ నాయకత్వంలో అనేక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమి పాలయింది. బీజేపీతో పాటు ఆ కూటమిలోని నేతలు అనరాని మాటలు అన్నారు. విమర్శలనే సద్విమర్శలుగా తీసుకొని రాటుదేలాడు. పొలిటిషియన్ అంటే ఎలా ఉండాలో...పది మందికి ఆదర్శంగా నిలుస్తున్నాడు. తాజాగా జరుగుతున్న పార్లమెంట్ సమావేశాల్లో...ప్రధాన మంత్రి నరేంద్ర మోడీపై పైచేయి సాధించాడు. రాహుల్ గాంధీ ప్రశ్నలకు అధికార పక్షం ఆత్మరక్షణలో పడిపోయింది. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, హోం మంత్రి అమిత్ షాతో పాటు అధికార పక్షం నుంచి ఎంతో మంది నేతలు ఉన్నప్పటికీ...రాహుల్ ప్రశ్నలకు మాత్రం సమాధానం చెప్పలేక నీళ్లు నమిలారు. విపక్షాన్ని నడిపించడంలో రాహుల్ గాంధీ సక్సెస్ అయ్యాడు.
రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ సందర్భంగా...కాంగ్రెస్ జాతీయవాదంపై బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య ఆరోపణలు చేశారు. దీనికి సమాధానం ఇస్తానంటూ ప్రసంగాన్ని ప్రారంభించిన రాహుల్ గాంధీ...అధికార పక్షానికి విశ్వరూపం చూపించారు. 12 ఏళ్లుగా అధికారంలో ఉన్న బీజేపీకి విపక్షం దెబ్బ ఎలా ఉంటుందో...ఒకే ఒక్క ప్రశ్నతో చమటలు పట్టించారు. ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేశారు. మాజీ ఆర్మీ చీఫ్ జనరల్ ఎం.ఎం. నరవాణే రాసిన పుస్తకం గురించి ప్రస్తావించారు. జనరల్ నరవణె తన పదవీకాలంలోని అనుభవాలతో... ఫోర్ స్టార్స్ ఆఫ్ డెస్టినీ అనే పేరుతో ఓ పుస్తకాన్ని రాశారు.
2020లో లడఖ్‌లోని గల్వాన్ లోయలో భారత్-చైనా సైనికుల మధ్య జరిగిన ఘర్షణల గురించి ఇందులో కీలక విషయాలు ఉన్నాయి. దీనిపై ఒక ప్రముఖ మ్యాగజైన్ ప్రచురించిన కథనాన్ని ఆధారంగా చేసుకొని రాహుల్ గాంధీ ప్రశ్నల వర్షం కురిపించారు. సదరు మ్యాగజైన్ ఆర్టికల్‌ను చూపిస్తూ.. లడఖ్ సరిహద్దులో చైనా ట్యాంకులు భారత భూభాగంలోకి వచ్చాయని అన్నారు. ఈ పుస్తకంలో ఉన్న విషయాలు 100 శాతం వాస్తవమని, ప్రభుత్వం దీనికి ఎందుకు భయపడుతోందని నిలదీశారు. రాహుల్ గాంగాంధీ తన ప్రసంగంలో పదే పదే చైనీస్ ట్యాంకులు అనే పదం రిపీట్ చేయడాన్ని సభలోని బీజేపీ సభ్యులంతా వ్యతిరేకించారు. అయితే రాహుల్ గాంధీకి పలువురు ప్రతిపక్ష నాయకులు మద్దతుగా నిలిచారు. చైనాకు సంబంధించిన విషయం చాలా సున్నితమైనదని...లోక్‌సభలో మాట్లాడటానికి ప్రతిపక్ష నేతకు అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేశారు.
రాహల్ గాంధీ స్పీచ్ తర్వాత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సమాధానం ఇవ్వాలి. కానీ మోడీ లోక్‌సభకు రాకుండా తప్పించుకున్నారు. తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతీ అన్నట్లు ప్రధాని వ్యవహరించారు. రాహుల్ గాంధీ సంధించిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేదు. లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా కూడా...మోడీ లోక్‌సభకు రాకుంటే మంచిదంటూ సూచనలు చేశారు. రాహుల్ దెబ్బకు లోక్‌సభకు డుమ్మా కొట్టిన మోడీ...రాజ్యసభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలుపుతూనే...రాహుల్ గాంధీకి కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశారు. అయితే రాహుల్ గాంధీ లేవనెత్తిన నరవణే పుస్తకం, చైనా...భారత్ భూభాగంలోకి చొచ్చు వస్తోందన్న దానిపై మోడీ సమాధానం చెప్పలేకపోయారు. అసలు విషయాన్ని మాట్లాడని ప్రధాని...టాపిక్‌ను డైవర్ట్ చేసేందుకు ప్రయత్నించారు.
మొత్తానికి రాహుల్ గాంధీ తొలిసారి మోడీపై పూర్తి ఆధిపత్యం ప్రదర్శించారన్న టాక్స్ మొదలయ్యాయి. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి తీసుకురాలేకపోయినా...పార్లమెంట్లో మాత్రం ప్రధాని మోడీని సమర్థంగా అడ్డుకోగలుగుతున్నారు. ఏదో ఒక అంశంపై అయితే బిజెపిని నిలదీగలుగుతున్నారు. పార్లమెంట్లో ప్రతిపక్షాన్ని నడిపించడంలో సక్సెస్ అయ్యాడు. ఎన్నికల్లో ఓడిపోవచ్చు... రాష్ట్రాల్లో గెలవలేకపోవచ్చు. పార్లమెంట్లో మాత్రం రాహుల్ బిజెపికి కంట్లో నలుసులా తయారయ్యాడు. రాహుల్ ప్రశ్నలకు బీజేపీ, ప్రధాని మోడీ సమాధానం చెప్పలేక...పారిపోయారంటూ కాంగ్రెస్ నేతలు చర్చించుకుంటున్నారు. ఇక ముందు కూడా రాహుల్ గాంధీ...ఇదే దూకుడు కొనసాగించాలని కోరుకుంటున్నారు.