బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావుకు...ఊరట లభించింది. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా పిటిషనర్లపై ఎలాంటి చర్యలు చేపట్టవద్దని ఆదేశించింది. కమిషన్ ఎలాంటి నిబంధనలు పాటించలేదని హైకోర్టు ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది. పీసీ ఘోష్ కమిషన్ నివేదికపై హైకోర్టు తీర్పును బీఆర్ఎస్ స్వాగతించింది. హైకోర్టు తీర్పుపై ప్రభుత్వం సుప్రీంను ఆశ్రయిస్తుందా అన్న అంశం ఉత్కంఠ రేపుతోంది.కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకలపై ఏర్పాటయిన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్‌కు...తెలంగాణ హైకోర్టు షాక్ ఇచ్చింది. మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావుపై చర్యలు తీసుకోవద్దని ఆదేశాలు జారీ చేసింది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణం, నిర్వహణల్లో అవకతవకలపై జస్టిస్ ఘోష్ కమిషన్ విచారణ జరిపింది. ఈ అంశంలో జస్టిస్ ఘోష్ కమిషన్ నివేదికను సవాల్ చేస్తూ కేసీఆర్, హరీశ్‌రావుల పిటిషన్ దాఖలు చేశారు. విచారణ జరిపిన న్యాయస్థానం ఊరట కల్పించింది. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా పిటిషనర్లపై ఎలాంటి చర్యలు చేపట్టవద్దని ఆదేశించింది. కమిషన్ ఎలాంటి నిబంధనలు పాటించలేదని హైకోర్టు ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టిన అనంతరం మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణాల అవకతవకలపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్‌ను ఏర్పాటు చేసింది. ఆ కమిషన్ పలువురిని విచారణ చేసిన తర్వాత నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. లక్ష కోట్ల ప్రాజెక్టులో అవకతవకలు జరిగాయన్నది ప్రభుత్వ వాదన. విచారణలో లోపాలు ఉండటంతో అసలు లక్ష్యం పక్కదారి పట్టే అవకాశం ఉందని ప్రజలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే జస్టిస్ ఘోష్ కమిషన్ నివేదికపై హైకోర్టు తీర్పును బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్వాగతించారు.
కాళేశ్వరం అవకతవకలపై విచారణ కోసం జస్టిస్ పీసీఘోష్ కమిషన్‌ను కాంగ్రెస్ సర్కార్ నియమించింది. 2024 మార్చి 14న జారీ చేసిన జీవో 6ను సవాలు చేస్తూ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు, ఐఏఎస్ అధికారులు ఎస్.కె.జోషి, స్మితా సభర్వాల్‌లు వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్, జస్టిస్ జీఎం మొహియుద్దీన్లతో కూడిన ధర్మాసనం సుదీర్ఘంగా విచారించింది. గత నెల 12న తీర్పును రిజర్వు చేసింది. జస్టిస్ ఘోష్కమిషన్పై తీర్పును ఈ నెల 8న వెలువరిస్తామని ప్రకటించినా కొంత ప్రక్రియ సిద్ధం కాకపోవడంతో ఏప్రిల్ 22కి కోర్టు వాయిదా వేసింది. జస్టిస్ ఘోష్ కమిషన్ చేపట్టిన విచారణ ప్రక్రియలో ఉల్లంఘనలు జరిగాయని, అభియోగాలు మోపే ముందు తమ వాదనను ఏమాత్రం పరిగణనలోకి తీసుకోలేదని పిటిషనర్లు న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చారు. విస్తృత ప్రజాప్రయోజనాల దృష్ట్యా కమిషన్ వేశామంటూ, మరొకరి పరువు ప్రతిష్ఠలు దెబ్బతీయడం సరైన పద్దతి కాదని చెప్పారు.
మరోవైపు ప్రభుత్వం తరఫు న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ ప్రజాప్రయోజనాలను పరిగణనలోకి తీసుకుని కాళేశ్వరం ప్రాజెక్టు ఆనకట్టలపై కమిషన్ వేసినట్లు తెలిపారు.సుదీర్ఘమైన విచారణ, వాంగ్మూలాల సేకరణ అనంతరం గత ఏడాది ఆగస్టులో పీసీ ఘోష్ కమిషన్ రిపోర్టును ప్రభుత్వానికి సమర్పించింది. నివేదికపై అసెంబ్లీలో సుదీర్ఘ చర్చ అనంతరం కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించింది ప్రభుత్వం. ఆ తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టులో బ్యారేజీల నిర్మాణంలోని అవకతవకలు, నిధుల దుర్వినియోగంపై సీబీఐనే ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని తెలంగాణ ప్రభుత్వం కోరింది. సీబీఐ డైరెక్టర్‌కు రాసిన లేఖలో ఎఫ్ఐఆర్అంశాన్ని ప్రస్తావించింది. నిజానికి కాళేశ్వరం అక్రమాలపై దర్యాప్తు చేపట్టాలని రాష్ట్రప్రభుత్వం గత ఏడాది సెప్టెంబరు మొదటి వారంలోనే సీబీఐకి లేఖ రాయగా దాదాపు ఆరు నెలల తర్వాత కేంద్ర ప్రభుత్వం సంస్థ స్పందించింది. హైకోర్టు తీర్పుపై ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయిస్తుందా ? లేదంటే హైకోర్టు సూచనల మేరకు విచారణను మళ్లీ మొదట్నుంచి ప్రారంభిస్తుందా అన్నది చర్చనీయాంశంగా మారింది.