Top story:వైజాగ్, బెజవాడలో టీడీపీకి షాక్..? ఆ మూడు మేయర్ స్థానాలపై జనసేన కన్ను..!

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలన విజయంతో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వంలో ఇప్పుడు సరికొత్త సమీకరణాలు తెరపైకి వస్తున్నాయి. రాబోయే మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలోని ప్రధాన నగరాల మేయర్ పీఠాలపై కూటమి పార్టీల మధ్య అంతర్గత చర్చలు జోరందుకున్నాయి.

Post Published By: dialnews
Updated : 9 September 2026, 10:01 AM IST

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలన విజయంతో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వంలో ఇప్పుడు సరికొత్త సమీకరణాలు తెరపైకి వస్తున్నాయి. రాబోయే మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలోని ప్రధాన నగరాల మేయర్ పీఠాలపై కూటమి పార్టీల మధ్య అంతర్గత చర్చలు జోరందుకున్నాయి. ముఖ్యంగా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఈసారి స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ పార్టీకి తగిన ప్రాధాన్యత దక్కాలని గట్టి పట్టుబడుతున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలోనే అత్యంత కీలకమైన విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి కార్పొరేషన్ల మేయర్ స్థానాలను జనసేన పార్టీ డిమాండ్ చేస్తోందనే వార్త ఇప్పుడు ఏపీ రాజకీయ వర్గాల్లో దావానలంలా వ్యాపించింది. ఈ ప్రతిపాదన కూటమిలో ఎలాంటి చర్చకు దారితీస్తోంది? చంద్రబాబు దీనిపై ఎలా స్పందించబోతున్నారు?

సార్వత్రిక ఎన్నికల్లో వంద శాతం విజయాల రేషియోతో దూసుకుపోయిన జనసేన, ఈసారి స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ అదే జోరును కొనసాగించాలని భావిస్తోంది. పార్టీ కేడర్ బలంగా ఉన్న నగరాల్లో మేయర్ పీఠాలను కైవసం చేసుకోవడం ద్వారా క్షేత్రస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేయవచ్చని పవన్ కళ్యాణ్ వ్యూహంగా కనిపిస్తోంది. ఇందులో భాగంగానే విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి లాంటి గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్లలో తమకు మేయర్ అభ్యర్థిత్వాన్ని కేటాయించాలని జనసేన అగ్రనాయకత్వం కూటమి చర్చల్లో ప్రస్తావించినట్లు సమాచారం. ఈ మూడు నగరాల్లోనూ జనసేన పార్టీకి బలమైన ఓటు బ్యాంక్ ఉంది. ముఖ్యంగా కాపు సామాజిక వర్గం, యువత ఎక్కువగా ఉన్న ఈ నగరాల్లో మేయర్ పీఠం దక్కితే పార్టీ భవిష్యత్తుకు తిరుగుండదని జనసేన భావిస్తోంది.

అయితే ఈ డిమాండ్ తెలుగుదేశం పార్టీకి ఒక పెద్ద చిక్కుముడిగా మారే అవకాశం ఉంది. ఉదాహరణకు విశాఖపట్నం నగరాన్ని తీసుకుంటే.. ఇక్కడ కూటమి తరఫున తెలుగుదేశం పార్టీకి చెందిన ఎంపీ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. విశాఖపట్నం పార్లమెంట్ పరిధిలోని మెజారిటీ అసెంబ్లీ స్థానాల్లో కూడా తెలుగుదేశం పార్టీయే విజయం సాధించింది. ఈ నేపథ్యంలో టీడీపీ నాయకత్వం ఏమనుకుంటోందంటే.. ఎంపీ స్థానం తమ వద్ద ఉన్నప్పుడు, నగరంలో కీలకమైన మేయర్ పీఠాన్ని కూడా తమ పార్టీకే ఉంచుకుంటే అభివృద్ధి పనుల సమన్వయం సులువవుతుందని భావిస్తోంది. కానీ జనసేన మాత్రం, కూటమి ధర్మాన్ని అనుసరించి కీలక నగరాల్లో తమకు కూడా వాటా ఇవ్వాలని కోరుతోంది. వైజాగ్ నగరంలో గత మున్సిపల్ ఎన్నికల్లో వైస్సార్సీపీ హవా ఉన్నప్పటికీ జనసేన మంచి ఓట్లు సాధించింది, అందుకే ఇక్కడ మేయర్ సీటుపై పట్టు సడలించడం లేదు.

ఇక విజయవాడ కార్పొరేషన్ విషయానికి వస్తే ఇక్కడ కూడా సరిగ్గా విశాఖ లాంటి పరిస్థితే ఉంది. విజయవాడ లోక్‌సభ స్థానంలో తెలుగుదేశం పార్టీకి చెందిన బలమైన ఎంపీ ఉన్నారు. విజయవాడ అర్బన్ పరిధిలోని అసెంబ్లీ సీట్లలో కూడా టీడీపీదే పైచేయిగా ఉంది. అయినప్పటికీ, విజయవాడ నగరంలో జనసేన పార్టీకి ఉన్న బలమైన కేడర్ బలాన్ని చూపిస్తూ.. ఇక్కడ మేయర్ సీటు తమకు కేటాయిస్తే నగర వ్యాప్తంగా కూటమి మరింత బలోపేతం అవుతుందని జనసేన వాదిస్తోంది. మరోవైపు ఆధ్యాత్మిక నగరం తిరుపతిలో కూడా జనసేన మేయర్ స్థానాన్ని ఆశిస్తోంది. తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గంలో జనసేన అభ్యర్థి భారీ మెజారిటీతో గెలిచిన సంగతి తెలిసిందే. ఎమ్మెల్యే సీటు తమదే అయినందున, తిరుపతి మేయర్ స్థానంపై జనసేనకు పూర్తి హక్కు ఉంటుందని ఆ పార్టీ స్థానిక నేతలు బలంగా నమ్ముతున్నారు.

ఈ మూడు ప్రధాన నగరాల్లో మేయర్ స్థానాల కేటాయింపు ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల ముందే కూటమిలో పెద్ద హాట్ టాపిక్‌గా మారింది. రెండు చోట్ల టీడీపీ ఎంపీలు ఉన్నందున ఆ స్థానాలను వదులుకోవడానికి స్థానిక టీడీపీ తమ్ముళ్లు సిద్ధంగా లేరు. కానీ పవన్ కళ్యాణ్‌తో ఉన్న సత్సంబంధాలు, కూటమి ఐక్యత దృష్ట్యా చంద్రబాబు నాయుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది. బహుశా విశాఖ, విజయవాడలలో ఒక చోట టీడీపీ, మరోచోట జనసేనకు మేయర్ స్థానం కేటాయించి, తిరుపతిని జనసేనకు ఇచ్చేలా ఒక మధ్యేమార్గం లేదా సర్దుబాటు ఫార్ములాను చంద్రబాబు ప్రతిపాదించే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. సీట్ల సర్దుబాటుపై ఇరు పార్టీల అధినేతలు కూర్చుని మాట్లాడితేనే ఈ వివాదానికి తెరపడనుంది.

Published : 
  • 9 September 2026, 10:01 AM IST