పద్మ అవార్డ్స్ ప్రకటించిన కేంద్రం.. సామాన్యులే అసామాన్యులు.. తెలంగాణలో ఎవరికి వచ్చిందంటే..!
కేంద్ర ప్రభుత్వం దేశ అత్యున్నత పౌర పురస్కారాల్లో ఒకటైన పద్మ అవార్డులను ప్రకటించింది. వివిధ రంగాల్లో నిస్వార్థంగా సేవలందిస్తూ, సమాజంలో మార్పుకు నాంది పలికిన 45 మందిని ఈసారి పద్మశ్రీ వరించింది
కేంద్ర ప్రభుత్వం దేశ అత్యున్నత పౌర పురస్కారాల్లో ఒకటైన పద్మ అవార్డులను ప్రకటించింది. వివిధ రంగాల్లో నిస్వార్థంగా సేవలందిస్తూ, సమాజంలో మార్పుకు నాంది పలికిన 45 మందిని ఈసారి పద్మశ్రీ వరించింది. కళలు, సాహిత్యం, విద్య, క్రీడలు, వైద్యం, సామాజిక సేవ వంటి రంగాల్లో విశేష కృషి చేసిన వ్యక్తులను గుర్తించి కేంద్రం ఈ గౌరవాన్ని అందించింది. ఈ జాబితాలో మారుమూల ప్రాంతాల్లో నిశబ్ద విప్లవం సృష్టించిన సామాన్యులకు పెద్దపీట వేయడం విశేషం.
ముఖ్యంగా ఈసారి పద్మశ్రీ జాబితాలో తెలంగాణకు చెందిన మామిడి రమారెడ్డి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. పశుపోషణ, పాడి పరిశ్రమ రంగంలో సహకార వ్యవస్థల ద్వారా ఆయన తెచ్చిన మార్పులకు గుర్తింపుగా ఈ అవార్డు దక్కింది. సహ వికాస సంస్థ వ్యవస్థాపకుడిగా ఆయన వేలాది మంది రైతుల జీవితాల్లో వెలుగులు నింపారు. కేవలం లాభాపేక్ష లేకుండా, సామూహిక వృద్ధి అనే లక్ష్యంతో ఆయన చేసిన కృషి నేడు జాతీయ స్థాయిలో గుర్తింపు పొందింది.
రమారెడ్డి గారు కేవలం సంస్థల ఏర్పాటుకే పరిమితం కాకుండా, రైతుల జీవనోపాధిని మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషించారు. పశుపోషణలో మెలకువలు, పాడి నిర్వహణ విధానాలు, ఆర్థిక పరిపాలన వంటి అంశాల్లో రైతులకు విస్తృత శిక్షణ అందించారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి సహకార సంఘాలే సరైన మార్గమని నమ్మి, ఆ దిశగా రైతులను చైతన్యపరిచిన మార్గదర్శకుడు మామిడి రమారెడ్డి. ఇక దేశవ్యాప్తంగా ఎంపికైన ఇతర ప్రముఖులలో శాస్త్రవేత్త డా. కుమరస్వామి తంగరాజ్, వ్యవసాయ రంగ నిపుణుడు అంకే గౌడ, వైద్య సేవల్లో ఆర్మిడా ఫెర్నాండెజ్ వంటి వారున్నారు. అలాగే భగవాన్‌దాస్ రాక్వార్, భిక్ల్యా లడాక్యా ధిండా, బ్రిజ్ లాల్ భట్, బుధ్రి తాటి వంటి వారు తమ తమ రంగాల్లో చేసిన విశేష కృషికి గాను ఈ పురస్కారానికి ఎంపికయ్యారు.
కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు వివిధ సంస్కృతులు, సేవా రంగాలను ప్రతిబింబించేలా ఈ ఎంపిక జరిగింది.
ఈ జాబితాలో ఇంకా చరణ్ హెంబ్రామ్, చిరంజీ లాల్ యాదవ్, ఇందర్‌జీత్ సింగ్ సిధు, పద్మా గుర్మెట్ వంటి ఎందరో అన్-సంగ్ హీరోస్ ఉన్నారు. ప్రచారం ఆశించకుండా సమాజం కోసం పనిచేసే ఇలాంటి వారిని పద్మశ్రీ వంటి ప్రతిష్టాత్మక అవార్డులతో గౌరవించడం భావి తరాలకు స్ఫూర్తిదాయకం. ఈ 45 మంది పద్మశ్రీ గ్రహీతలకు దేశవ్యాప్తంగా ప్రశంసల జల్లు కురుస్తోంది.











