రాజకీయాలు చాలా సెన్సిటివ్.. ఒక పార్టీలో అయినా కూటమిలో అయినా.. ఏ యాంగిల్ లో చూసినా పాలిటిక్స్.. బెలూన్ లాంటివి. పగలకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. ఏ చిన్న తేడా జరిగినా, అది వచ్చే సౌండ్ కు గూబ గుయ్యిమంటుంది. ఇప్పుడు ఏపీలో అలాంటి సిగ్నల్స్ ఏ కనపడుతున్నాయనే మాట రీ సౌండ్ లో వినపడుతోంది. ఓ వైపు కూటమి 15 ఏళ్ళు వర్ధిల్లాలి అనేది జనసేనాని, డిప్యూటి సిఎం పవన్ కళ్యాణ్ ఆకాంక్ష. మరో వైపు డిప్యూటి సిఎం శాఖల్లో సిఎం చంద్రబాబు వేలు పెట్టడం.. అసలు ఏం జరుగుతుందో ఎవరికీ అర్ధం కాని సిచ్యువేషన్. ఏకంగా కలెక్టర్ల కాన్ఫరెన్స్ లోనే డిప్యూటి సీఎం శాఖలపై సిఎం చంద్రబాబు అసంతృప్తి అసలు ఏపీ కూటమిలో ఏం జరుగుతుంది..?
ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వంలో ‘మిత్రధర్మం’ ముసుగులో ఒక భయంకరమైన రాజకీయ చదరంగం నడుస్తోందా? అనే అనుమానాలు బలపడుతున్నాయి. ప్రజా తీర్పుతో ‘కింగ్ మేకర్’గా నిలిచిన పవన్ కళ్యాణ్ ఇమేజ్‌ను అటవీ శాఖ అనుమతుల సాకుతో, డ్యామేజ్ చేసేందుకు బ్యాక్ గ్రౌండ్ వర్క్ నడుస్తోందా..? అటవీ శాఖ అధికారులను ముఖ్యమంత్రి బహిరంగంగా హెచ్చరించడం వెనుక ఉన్న అసలు మాస్టర్ ప్లాన్ ఏంటి? ఇప్పుడు ఇదే అంశం ఏపీ రాజకీయాల్లో అగ్నిపర్వతంలా అంతర్గతంగా ఉడుకుతున్న అంశం. దీనిపై పొలిటికల్ సర్కిల్స్ లో ఊహించని డిస్కషన్ మొదలైంది.
పవన్ కళ్యాణ్ అటవీ శాఖ బాధ్యతలు చేపట్టిన నాటి నుండి ఆ శాఖలో ఒక అద్భుతమైన మార్పు వచ్చింది. దశాబ్దాలుగా పొలిటికల్ బాసుల కాళ్ల కింద నలిగిపోయిన అధికారులకు పవన్ ‘నిజమైన స్వేచ్ఛ’ ఇచ్చారు. గతంలో ఏ ఫైలు కదలాలన్నా ముఖ్యమంత్రి కార్యాలయం కనుసన్నల్లోనే జరగాలి. కానీ పవన్ వచ్చాక, అధికారులు కేవలం పవన్ కళ్యాణ్‌నే తమ సుప్రీం బాస్‌గా భావిస్తున్నారు. రాజకీయ ఒత్తిళ్లకు లొంగకుండా, కేవలం చట్టం ప్రకారం పనిచేయాలని పవన్ ఇచ్చిన భరోసా.. సీఎంఓ ఆధిపత్యాన్ని తగ్గించింది. తమ కనుసన్నల్లో మెలిగే ఒక శాఖ ఇప్పుడు పవన్ చేతుల్లో ‘స్వతంత్రంగా’ మారడాన్ని పాత తరం పాలకులు జీర్ణించుకోలేకపోతున్నారా? అంటూ రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది.
అటవీ భూముల అనుమతులు అనేవి రాష్ట్ర చేతుల్లో ఉండవు. అవి కేంద్ర అటవీ శాఖ పరిధిలోనివి. దీనికి చాలా సమయం పడుతుందనే ప్రాథమిక అవగాహన ఉండీ కూడా.. చంద్రబాబు నాయుడు అధికారులను టార్గెట్ చేయడం వెనుక లోతైన వ్యూహం కనపడుతోందనే మాట వినపడుతోంది. అటవీ శాఖ పనితీరు బాలేదని పదేపదే ప్రచారం చేయడం ద్వారా.. ఆ శాఖా మంత్రిగా పవన్ కళ్యాణ్ విఫలమయ్యారని ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు పంపడమే దీని అసలు లక్ష్యం అంటూ కొందరు రాజకీయ పరిశీలకులు కామెంట్ చేస్తున్నారు.
పవన్ మాట వింటున్న అధికారులను సభాముఖంగా అవమానించడం ద్వారా.. “మీకు పవన్ కాదు, నేనే సుప్రీం” అని హెచ్చరించి, వారిని మళ్లీ సీఎంఓ చెప్పుచేతుల్లోకి తెచ్చుకోవాలనే ప్లాన్ నడుస్తోంది అంటూ మరికొందరు కామెంట్ చేస్తున్నారు. క్యాబినెట్ సమావేశాలకు, కలెక్టర్ల మీటింగ్‌లకు పవన్ కళ్యాణ్ వరుసగా గైర్హాజరు కావడం చూస్తుంటే.. ఆయన తన నిరసన జ్వాలను మౌనంగానే వినిపిస్తున్నారని అర్థమవుతోంది. ఇది కేవలం గైర్హాజరు కాదు, తన సెల్ఫ్ రెస్పెక్ట్ ను దెబ్బతీసే ప్రయత్నాలపై పవన్ సంధించిన రాజకీయ బ్రహ్మాస్త్రంగా ఓ వర్గం రాజకీయ విశ్లేషకులు కామెంట్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఒక అడుగు వెనక్కి వేశారంటే అది భయంతో కాదు.. ప్రళయం సృష్టించడానికే అన్నది గతం నిరూపించింది కాబట్టి ఇక్కడ చంద్రబాబు గాని, టీడీపీ గాని తక్కువ అంచనా వేయవద్దు అంటున్నాయి పొలిటికల్ సర్కిల్స్.
ముఖ్యమంత్రి అటవీ శాఖా అధికారులను హెచ్చరించడం అంటే.. పరోక్షంగా పవన్ కళ్యాణ్ ప్రాధాన్యతను తగ్గించడమే అనేది ఇక్కడ వినపడుతోన్న విమర్శ. పవన్ కళ్యాణ్ లేకపోతే ఈ ప్రభుత్వం లేదన్న నిజాన్ని మర్చిపోయి, ఆయన శాఖపై పెత్తనం చెలాయించాలని చూస్తే పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయని జనసైనికులు కొందరు కామెంట్ చేయడం గమనార్హం. అటవీ శాఖ అనుమతుల వివాదం కేవలం సాంకేతిక అంశం కాదు.. ఇది పవన్ కళ్యాణ్ స్వయంప్రతిపత్తిపై జరుగుతున్న దాడి అంటూ ఎవరికి నచ్చిన అభిప్రాయాలు వారు చెప్తున్నారు. పవన్ కళ్యాణ్ అధికారులకు కల్పించిన స్వేచ్ఛను హరించి, మళ్లీ పాత ‘చక్రం’ తిప్పాలని చూస్తే కూటమి పునాదులకు ప్రమాదం అంటూ మరికొందరు హెచ్చరిస్తున్నారు. మరి ఈ విషయాన్ని పవన్ నిజంగా సీరియస్ గా తీసుకుంటే.. ఆ సెగలు రాష్ట్ర రాజకీయాలను ఎటు వైపు తీసుకెళ్తాయో వేచి చూడాలి.