కొందరు సంపాదించుకోవడానికి వస్తారు. ఇంకొందరు పేరు కోసం తపిస్తారు. మరికొందరు వారసత్వంగా రాజకీయాల్లోకి వస్తారు. నాలుగో రకం కూడా ఉంటారు. వాళ్లకు ప్రజా సమస్యలు తప్పా మరేమీ పట్టవు. సామాన్యుల సమస్యలపై చట్ట సభల్లో ప్రశ్నిస్తారు...నిలదీస్తారు. దేశంలో అలాంటి నేతలు కొందరు మాత్రమే ఉంటారు. రాజకీయాలకు సరికొత్త నిర్వచనం చెబుతారు. ఆయనెవరో చూసేయండి.రాఘవ్ చద్దా....ఆప్ రాజ్యసభ సభ్యుడు. ఉన్నత విద్య అభ్యసించిన రాఘవ్ చద్దా...రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక ముద్ర వేసుకున్నారు. ప్రజల తరపున పోరాటం చేయడంలో ముందుంటారు. ప్రస్తుతమున్న రాజకీయ నేతలకు భిన్నంగా వ్యవహరిస్తారు.
ఏం మాట్లాడినా...ఏం చేసినా...అది ప్రజలకు ఉపయోగపడాలన్నదే ఆయన తపన. చట్ట సభలకు ఎన్నిక కాకముందు ఆయన రూటే సపరేటు. నలుగురి వెళ్లే దారిలో ఆయన నడవరు. నలుగురికి ఆదర్శంగా నిలవాలని ప్రయత్నిస్తారు. రాఘవ్ చేసినా పార్లమెంట్ హైలెట్ అవుతుంది. అలా అని తనను ఎంపీగా ఎంపిక చేసిన ఆప్ జాతీయ అధ్యక్షుడు కేజ్రీవాల్‌కు ఏనాడు భజన చేయలేదు. కేంద్ర ప్రభుత్వంపైనా ప్రశంసలు కురిపించరు. చట్ట సభల్లో అయినా...బయట అయినా...ప్రజా సమస్యలే జెండా, అజెండా. అందుకే ప్రస్తుత రాజకీయ నేతల్లో రాఘవ్ చద్దా ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. సోషల్ మీడియా అయినా...డిజిటల్ మీడియా అయినా రాఘవ్ చద్దా గురించే చర్చ జరుగుతోంది. ఎందుకంటే ఆయన ప్రజల వాయిస్‌ను పార్లమెంట్లో బలంగా వినిపిస్తున్నారు. నిత్యావసర ధరల పెరుగుదల, ఆహార కల్తీ వంటి అంశాలపై ఆయన చేసిన ప్రసంగాలు దేశవ్యాప్తంగా చర్చకు దారితీశాయి.
ప్రజా సంక్షేమమే పరమావధిగా సాగుతున్న ఆయన ప్రసంగాలు మధ్యతరగతి ప్రజల్లో గట్టి భరోసాను నింపుతున్నాయి.అమ్మాయిల ప్యాడ్స్ గురించి మాట్లాడినా...మొబైల్ రీచార్జ్ అంశాన్ని లేవనెత్తినా...భార్యాభర్తల ఆదాయపు పన్నుపై ప్రశ్నించినా...ఎన్నికల సమయంలో ఓటు వేసేటపుడు ఫింగర్ ప్రింట్ తీసుకోవాలన్న ప్రశ్నలతో ప్రభుత్వాన్నే కాదు...దేశ ప్రజలను ఆలోచింపజేసేలా ప్రశ్నలు సంధిస్తున్నారు. ఇటీవల పార్లమెంట్లో చేసిన ప్రసంగం ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. నెలసరి అనేది ఒక సహజ సిద్ధమైన ప్రక్రియ అని, ఇది ఏ మహిళకైనా గర్వకారణమే తప్ప సిగ్గుపడాల్సిన విషయం కాదంటూ ప్రభుత్వంతో పాటు అధికారులను ఆలోచనలో పడేశారు.
మన సమాజంలో మద్యం, సిగరెట్లు వంటి హానికరమైన వస్తువులను ఎటువంటి సంకోచం లేకుండా బహిరంగంగా విక్రయిస్తుంటే, మహిళల ఆరోగ్యానికి అవసరమైన శానిటరీ ప్యాడ్లను మాత్రం పేపర్లలో లేదా నల్లటి కవర్లలో దాచుకుని తీసుకెళ్లాల్సి రావడం సిగ్గుచేటంటూ సమాజాన్ని, అధికార పక్షాన్ని నిలదీశారు. దేశంలో ప్రతి ఏటా 2.3 కోట్ల మంది బాలికలు చదువులు మానేస్తున్నారని చద్దా వివరించారు. రికార్డు స్థాయిలో పన్ను వసూళ్లు జరుగుతున్నా, మధ్యతరగతి ప్రజలకు ఉపశమనం ఎందుకు లేదు ? జీతాలు పెరగకపోయినా ద్రవ్యోల్బణం కారణంగా కొనుగోలు శక్తి పడిపోతోంది. కనీసం లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ పన్నును ఎత్తివేయాలంటూ ప్రభుత్వాన్ని నిలదీశారు.విమానాశ్రయాల్లో కనీస ఆహార ధరలు ఆకాశాన్నంటుతున్నాయని సభలో కేంద్రాన్ని ప్రశ్నించారు. సాధారణంగా లీటర్ వాటర్ బాటిల్ 20 ఉంటే.. ఎయిర్‌పోర్ట్‌ల్లో మాత్రం ఇది సుమారు 100గా ఉంటుంది. ఇదే కాకుండా వివిధ ఆహార పదార్థాల ధరలు ఎయిర్‌పోర్ట్‌ల్లో అధిక ధరలు ఉన్నాయంటూ దోపిడీని ఎండగట్టారు.
ఎంపీలు, ఎమ్మెల్యేలు పనితీరు బాగలేకపోతే...వారిని తొలగించే హక్కు కల్పించాలంటూ బాంబు పేల్చారు రాఘవ్ చద్దా. ప్రస్తుతం భారత రాజ్యాంగం ప్రజలకు ఎన్నిక చేసే హక్కు ఇస్తుంది కానీ, ఎన్నికైన ప్రతినిధులను పనితీరు లేకపోవడం లేదా అవినీతి వంటి కారణాలతో పదవీ కాలం పూర్తికాకముందే తొలగించే ప్రత్యక్ష విధానం లేదంటూ సరికొత్త అంశాన్ని లేవెనెత్తారు. రైట్ టు రీకాల్ అనే వ్యవస్థను ప్రవేశపెట్టడం ద్వారా ప్రజలు...తమ ప్రతినిధులను పనితీరు లేకపోతే లేదా అవినీతిలో చిక్కుకుంటే తొలగించే అవకాశం కలుగుతుంది. రాఘవ్ చద్దా చేసిన ఈ రైట్ టు రీకాల్ ప్రతిపాదన భారత రాజకీయ వ్యవస్థలో ఒక కొత్త చర్చకు దారితీసింది. కఠినమైన రీచార్జ్ నిబంధనల వల్ల అత్యవసర సమయాల్లో లక్షల మంది ప్రీపెయిడ్ మొబైల్ వినియోగదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని లేవనెత్తారు.
దేశంలోని 125 కోట్ల మొబైల్ వినియోగదారుల్లో దాదాపు 90 శాతం మంది ప్రీపెయిడ్ కస్టమర్లేనని రాఘవ్ చద్దా గుర్తుచేశారు. నెలవారీ ప్లాన్ అంటే క్యాలెండర్ ప్రకారం 30 లేదా 31 రోజులు ఉండాలి. కానీ టెలికాం కంపెనీలు 28 రోజుల సైకిల్‌ను నడపడాన్ని నిలదీశారు. నెల ప్లాన్ అని చెప్పి వినియోగదారుల చేత ఏడాదికి 13 సార్లు రీచార్జులు దోపిడీని ప్రశ్నించారు. దేశ పన్నుల వ్యవస్థలో ఉన్న అసమానతలపై కూడా రాఘవ్ చద్దా గళమెత్తారు. బడా కార్పొరేట్ సంస్థలు చెల్లించే పన్నుల కంటే, కష్టపడి పని చేసే వేతన జీవులు చెల్లించే ఆదాయపు పన్ను ఎక్కువగా ఉండటంపై ఆయన విస్మయం వ్యక్తం చేశారు. దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా ఉన్న మధ్యతరగతి ప్రజలపై పన్నుల భారాన్ని తగ్గించాల్సిన అవసరం ఉందంటూ రాఘవ్ చద్దా డిమాండ్ చేశారు. పార్లమెంటులో రాఘవ్ చద్దా లేవనెత్తుతున్న అంశాలు కేవలం రాజకీయ నినాదాలు కావు, అవి కోట్లాది మంది సామాన్యుల ఆవేదనలు. ఆహార భద్రత నుండి పన్నుల వరకు ఆయన స్పృశించని అంశం లేదని చెప్పవచ్చు.