Thummala Nageswara Rao: కాంగ్రెస్‌లో తుమ్మల చేరికకు ముహూర్తం ఖరారు..

తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జి మాణిక్‌రావు ఠాక్రే, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నేతలు భట్టి విక్రమార్కతో తుమ్మల సమావేశమయ్యారు. హైదరాబాద్‌లోని తుమ్మల నివాసంలో కాంగ్రెస్ పార్టీలో చేరికపై చర్చించారు.

Post Published By: narender Thiru
Updated : 15 September 2023, 3:22 PM IST

Thummala Nageswara Rao: ఖమ్మం జిల్లా సీనియర్ నేత తుమ్మల నాగేశ్వర రావు కాంగ్రెస్‌లో చేరేందుకు ముహూర్తం ఖరారైంది. ఈ నెల 17న తుమ్మల కాంగ్రెస్‌లో చేరబోతున్నారు. ఈ మేరకు తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జి మాణిక్‌రావు ఠాక్రే, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నేతలు భట్టి విక్రమార్కతో తుమ్మల సమావేశమయ్యారు. హైదరాబాద్‌లోని తుమ్మల నివాసంలో కాంగ్రెస్ పార్టీలో చేరికపై చర్చించారు. ఈ సమావేశంలో పొంగులేటి శ్రీనివాస రెడ్డి కూడా పాల్గొన్నారు.

ఈ నెల 17న తెలంగాణ విమోచన దినం సందర్భంగా హైదరాబాద్ శివారులోని తుక్కుగూడలో కాంగ్రెస్ పార్టీ విజయభేరి బహిరంగసభ నిర్వహిస్తోంది. ఈ సభను భారీ ఎత్తున, లక్షలాది జనం మధ్య నిర్వహించబోతుంది. ఈ సభలోనే తుమ్మల కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు. ఈ సభకు కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, సీనియర్ నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ఇతర కీలక నేతలు హాజరవుతున్నారు. ఈ సభలోనే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల డిక్లరేషన్ ప్రకటించే అవకాశం ఉంది. లేదా ప్రధానంగా ఐదు హామీలు ఇవ్వబోతోంది. ఈ సభను కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నేపథ్యంలో తుమ్మల చేరిక ప్రాధాన్యం సంతరించుకుంది.

బీఆర్ఎస్ నేతగా కొనసాగిన తుమ్మలకు ఆ పార్టీ తాజాగా ఎమ్మెల్యే టిక్కెట్ ఇవ్వలేదు. దీంతో ఆయన పార్టీ మారాలని నిర్ణయించుకున్నారు. ఇటు తుమ్మల.. అటు పొంగులేటి చేరికతో ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం కానుంది. తుమ్మల పాలేరు నియోజకవర్గం నుంచి పోటీ చేసే అవకాశం ఉంది.

Published : 
  • 15 September 2023, 3:22 PM IST