తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల వేళ రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. దళపతి విజయ్ స్థాపించిన 'తమిళగ వెట్రి కళగం' (TVK) అనూహ్య విజయాల దిశగా దూసుకుపోతుండటంతో, ఇప్పుడు అందరి దృష్టి నటి త్రిష కృష్ణన్‌పై పడింది. విజయ్ గెలిచిన ఒక స్థానంలో ఉప ఎన్నిక జరిగితే, అక్కడ త్రిష బరిలోకి దిగుతారనే వార్త ఇప్పుడు కోలీవుడ్ నుంచి పొలిటికల్ సర్కిల్స్ వరకు హాట్ టాపిక్‌గా మారింది.
ఈ ఎన్నికల్లో విజయ్ అత్యంత వ్యూహాత్మకంగా రెండు నియోజకవర్గాల నుంచి పోటీ చేశారు. చెన్నైలోని పెరంబూర్ మరియు తిరుచిరాపల్లి (ఈస్ట్) స్థానాల నుంచి ఆయన బరిలోకి దిగారు. ప్రస్తుత ట్రెండ్స్ ప్రకారం, విజయ్ ఈ రెండు స్థానాల్లోనూ భారీ మెజారిటీతో విజయం సాధించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అయితే, నిబంధనల ప్రకారం ఒక వ్యక్తి రెండు చోట్ల గెలిస్తే, ఖచ్చితంగా ఒక స్థానానికి రాజీనామా చేయాల్సి ఉంటుంది. విజయ్ రాజీనామా చేసే ఆ ఒక్క స్థానమే ఇప్పుడు త్రిష రాజకీయ ప్రవేశానికి వేదిక కాబోతోందని ప్రచారం జరుగుతోంది.
మే 4 (నేడు) ఉదయం నుంచి ఫలితాలు వెలువడుతున్న తరుణంలో, విజయ్ నివాసం ఉన్న నీలాంకరై వద్ద కోలాహలం నెలకొంది. పార్టీ విజయం దాదాపు ఖాయం కావడంతో, నటి త్రిష నేరుగా విజయ్ ఇంటికి చేరుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. కేవలం అభినందనలు తెలపడానికే ఆమె వచ్చారా? లేక భవిష్యత్తు రాజకీయ ప్రణాళికలపై చర్చించడానికా? అన్న ఉత్కంఠ నెలకొంది. విజయ్ తన తండ్రి ఎస్.ఏ. చంద్రశేఖర్‌ను కాకుండా, తనతో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించిన త్రిషను రాజకీయ వారసురాలిగా (ఒక నియోజకవర్గానికి) ఎంపిక చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.