Top story: ట్రంప్‌ నెక్స్ట్‌ టార్గెట్‌ ఫిక్స్‌… మలక్కా జలసంధిపై కన్ను…!

మొన్న గ్రీన్‌ల్యాండ్‌ కావాలన్నాడు...నిన్న హర్మూజ్‌ను స్వాధీనం చేసుకుంటానన్నాడు...ఇప్పుడేమో మలక్కా జలసంధిపై కన్నేశాడు. ప్రపంచ వాణిజ్యానికి కీలకమైన మలక్కా జలసంధిపై పట్టు సాధిస్తే...అమెరికాకు తిరుగుడుందనే లక్ష్యంతో వ్యూహాలు అమలు చేస్తున్నాడు. అమెరికా-

Post Published By: dialnews
Updated : 16 April 2026, 9:29 AM IST

మొన్న గ్రీన్‌ల్యాండ్‌ కావాలన్నాడు...నిన్న హర్మూజ్‌ను స్వాధీనం చేసుకుంటానన్నాడు...ఇప్పుడేమో మలక్కా జలసంధిపై కన్నేశాడు. ప్రపంచ వాణిజ్యానికి కీలకమైన మలక్కా జలసంధిపై పట్టు సాధిస్తే...అమెరికాకు తిరుగుడుందనే లక్ష్యంతో వ్యూహాలు అమలు చేస్తున్నాడు. అమెరికా-ఇండోనేషియా రక్షణ మంత్రులు రహస్యంగా భేటీ కావడం వెనుక...మలక్కా జలసంధిపై ఒప్పందానికేనన్న చర్చ జరుగుతోంది.అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌...రోజుకో ప్లాన్‌తో ముందుకొస్తున్నాడు. గ్రీన్‌లాండ్‌ కోసం పట్టుబట్టాడు. అది కుదరకపోవడంతో వెనెజువెలా అధ్యక్షుడ్ని బంధించాడు. ఆ తర్వాత అణ్వాయుధాల పేరుతో ఇరాన్‌తో యుద్ధం చేశాడు. ఇరాన్‌ లొంగకపోవడం...యుద్ధంలో ఏం సాధించలేక శాంతి చర్చలు జరుపుతున్నాడు. ఇప్పుడేమో ప్రపంచ రవాణా రంగానికి కీలకమైన మలక్కా జలసంధి కావాలంటున్నాడు.

చైనా, ఇండియాకు కీలకమైన మలక్కా జలసంధిని ఫోకస్ చేశాడు. ప్రపంచ నౌకా రవాణాను కంట్రోల్ చేయాలనే లక్ష్యంతో పని చేస్తున్నాడు. ఈ జల సంధి విషయంలో ఇండోనేసియాతో ఒప్పందం కుదుర్చుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అమెరికా, ఇండోనేసియా దేశాల రక్షణ మంత్రులు రహస్యంగా భేటీ కావడం వెనుక ఆంతర్యం ఇదేనని తెలిసింది. ఈ డీల్ ప్రకారం అమెరికా మిలిటరీ ఎయిర్ క్రాఫ్ట్స్ ఇండోనేషియా గగన తలాన్ని వినియోగించుకునే అవకాశం ఉంటుందని రిపోర్ట్ ద్వారా తెలుస్తోంది. హార్మూజ్ జలసంధిని దిగ్బంధించిన రోజే.. అమెరికా-ఇండోనేషియా డీల్ కుదుర్చుకోవడం సంచలనంగా మారింది. మలక్కా జలసంధిపై ఆధిపత్యం చెలాయించేందుకే అమెరికా ఇండోనేషియాతో ఒప్పందం కుదుర్చుకుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

మలాక్కా జల సంధి ఇండోనేసియా, మలేసియా, సింగపూర్‌ల మీదుగా సాగుతుంది. ఇది భారత్‌కూ చేరువలో ఉంది. మరోవైపు భారత వాణిజ్యంలో సుమారు 55 శాతం మలక్కా జల సంధి మీదుగానే జరుగుతోంది. ఈ జల సంధి ప్రారంభ బిందువు అండమాన్‌ నికోబార్‌ దీవుల దక్షిణ కొనకు చాలా దగ్గరగా ఉంది. పోర్ట్‌ బ్లెయిర్‌ నుంచి మలక్కా జల సంధికి 24 గంటల్లోపు చేరుకోవచ్చు. ప్రపంచ వాణిజ్యంలో 40 శాతం మలక్కా జల సంధి మీదుగా సాగుతోంది. హర్మూజ్‌ నుంచి ప్రధానంగా చమురు, ఎరువుల రవాణా జరుగుతుంటే... మలాక్కా జలసంధి మార్గంలో చమురు దిగుమతులతోపాటు కార్లు, సెమీకండక్టర్లు, యంత్ర సామగ్రి తదితర వస్తువులన్నీ రవాణా జరుగుతాయి.

చైనా, జపాన్‌ల ఎగుమతి, దిగుమతులకు మలాక్కా జలసంధి మార్గమే కీలకం. హర్మూజ్, మలాక్కా జల సంధులపై పట్టు సాధిస్తే ఆసియా ఎగుమతి, దిగుమతి మార్గాలపై వాషింగ్టన్‌ ఆధిపత్యం సాధించినట్లే అవుతుంది. అమెరికా, ఇండోనేషియాల మధ్య ఒక ప్రధాన రక్షణ సహకార ఒప్పందం కుదిరింది. అమెరికా లక్ష్యం నెరవేరడం అంత సులభం కాదు. మలాక్కా జల సంధిలో సముద్ర సరిహద్దులు, చిన్న దీవుల నియంత్రణ విషయంలో ఇండోనేసియా, సింగపూర్‌ల మధ్య వివాదాలున్నాయి. అమెరికాకు మిత్రదేశమైన సింగపూర్‌.. ఈ జల సంధివల్ల కలిగే వ్యాపార ప్రయోజనాల్లో సింహభాగాన్ని పొందుతోంది. ఇరాన్‌ హర్మూజ్‌లో నౌకల రాకపోకలపై సుంకాలు విధించడం చూసి ఇండోనేసియా, మలేసియా మలాక్కా జల సంధిలో పన్నులు విధిస్తాయేమోనని సింగపూర్‌ భయపడుతోంది.

హర్మూజ్‌ కంటే మలాక్కా జల సంధి చైనాకు ప్రధానం. అందుకే ఇక్కడ అమెరికా ఉనికిని బీజింగ్‌ చూస్తూ ఊరుకునే అవకాశం లేదు. చైనా ఇటీవల పసిఫిక్, హిందూ మహా సముద్రాల్లో, మలాక్కా జల సంధికి సమీపంలో భారీ ఎత్తున సముద్ర మ్యాపింగ్, పర్యవేక్షణ కసరత్తులు చేపట్టింది. హిందూ మహా సముద్ర ప్రాంతంలో చైనాకు వ్యతిరేకంగా భారత్‌ను బలోపేతం చేయడానికి గత అమెరికా అధ్యక్షులు మొగ్గు చూపడం వెనుక ఇదే ఒక ప్రధాన కారణం. కాబట్టి ఈ జల సంధిలో అమెరికా చేసే ఏ ప్రయత్నానికైనా భారత్‌ సహకారం అవసరం.

అండమాన్, నికోబార్‌ దీవుల్లో భారత్‌ సైనిక, నౌకా స్థావరాలను నిర్వహిస్తోంది. గత ఏడాది మలక్కా జల సంధి గస్తీ కార్యక్రమంలో భారత్‌ను చేర్చుకోవడానికి సింగపూర్‌ సుముఖత ప్రదర్శించింది. ట్రంప్‌ భవిష్యత్తులో ఏవైనా చర్యలు తీసుకోవాలని భావిస్తే, ఆయన ప్రయత్నాలకు భారత్‌ కేంద్ర బిందువు కావచ్చు. హర్మూజ్‌ను దిగ్బంధిస్తే కేవలం చమురు రవాణాకు ఆటంకం ఏర్పడుతుంది. అదే మన దగ్గర ఉన్న రెండు మార్గాలను అడ్డుకుంటే ప్రపంచ వాణిజ్యమే కటకటలాడుతుంది. ఈ వ్యూహాత్మక మార్గాలను గుర్తించిన అమెరికా.. భారత్‌తో ఇండో-పసిఫిక్‌ పేరిట నూతన విధానానికి గతంలోనే శ్రీకారం చుట్టింది.

Published : 
  • 16 April 2026, 9:29 AM IST