ప్రపంచంలోనే అత్యంత సుసంపన్న దేశాల్లో ఒకటిగా, కుబేరుల కేంద్రంగా విరాజిల్లిన ఖతార్ ఇప్పుడు ఊహించని ఆర్థిక కష్టాల్లో కూరుకుపోయింది. పర్షియన్ గల్ఫ్‌లో ఎడారితో నిండిన ఒక చిన్న ద్వీపకల్ప దేశమైన ఖతార్‌ను ఇరాన్ యుద్ధం కోలుకోలేని దెబ్బతీసింది. యుద్ధ ప్రభావంతో ఆదాయానికి భారీగా గండి పడటం, ద్రవ్యోల్బణ సమస్యలు చుట్టుముట్టడంతో ఆ దేశం ప్రస్తుతం తీవ్రంగా సతమతమవుతోంది. ఇటీవల కాలంలో ఎన్నడూ చూడని విధంగా ఖతార్ ఆర్థిక వ్యవస్థ క్షీణించడం ఆ దేశ పాలకులకు పెద్ద సవాల్‌గా మారింది.ఒకప్పుడు వెనకబడిన ప్రాంతంగా ఉన్న ఖతార్ రూపురేఖలను నేచురల్ గ్యాస్ మార్చేసింది. 1990ల కాలంలో ఈ దేశ ఆర్థిక స్థితిగతుల్లో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. ఈశాన్య ఖతార్‌లో ఉన్న 'నార్త్‌ఫీల్డ్' ప్రపంచంలోనే అతిపెద్ద నేచురల్ గ్యాస్ రిజర్వాయర్. ఇక్కడి సూపర్‌కూలింగ్ గ్యాస్ ఇంధనాన్ని ద్రవరూపంలోకి మార్చే సాంకేతికతను వాడుకుంటూ ఖతార్ లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్ ఉత్పత్తిని ప్రారంభించింది. 1996లో తొలిసారిగా 60 వేల టన్నుల ఎల్ఎన్జీని జపాన్‌కు ఎగుమతి చేసింది. 2010 నాటికి ఖతార్ ఉత్పత్తి సామర్థ్యం ఏకంగా 7 కోట్ల టన్నులకు పెరిగింది. ప్రస్తుతం ఖతార్ మొత్తం ఆదాయంలో 60 శాతం వాటా ఈ గ్యాస్, గ్యాస్ సంబంధిత ఎగుమతుల నుంచే సమకూరుతోంది.
కానీ ఫిబ్రవరి చివర్లో పశ్చిమాసియాలో మొదలైన ఉద్రిక్తతలు ఖతార్ పాలిట శాపంగా మారాయి. తమ ఎగుమతులు, దిగుమతుల కోసం అత్యధికంగా ఆధారపడే కీలకమైన 'హర్మూజ్ జలమార్గాన్ని' యుద్ధం కారణంగా ఇరాన్ మూసివేయడంతో, ప్రపంచంతో ఖతార్‌కు సంబంధాలు తెగిపోయాయి. జలసంధి మూతబడిన 24 గంటల్లోనే తమ కాంట్రాక్టులను పూర్తిచేయలేమని ఆ దేశ అతిపెద్ద ఇంధన సంస్థ 'ఖతార్ ఎనర్జీ' చేతులెత్తేసింది. అంతేకాకుండా, ఉద్రిక్తతలు ప్రారంభమైన రెండు వారాల తర్వాత ఖతార్ ప్రధాన గ్యాస్ ప్లాంట్ అయిన 'రాస్ లఫాన్'పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్లతో దాడి చేయడంతో కోలుకోలేని దెబ్బ తగిలింది. ఈ దాడుల్లో రాస్ లఫాన్ ఉత్పత్తి కేంద్రం తీవ్రంగా ధ్వంసమైంది. దీన్ని పునరుద్ధరించేందుకు కొన్నేళ్ల సమయం పడుతుందని అంచనా వేస్తున్నారు. దీనివల్ల దేశానికి వందల కోట్ల డాలర్ల నష్టం వాటిల్లింది.
ఖతార్ వాసుల రోజువారీ ఆహార అవసరాలకు దిగుమతులే ఏకైక ఆధారం. హర్మూజ్ జలసంధి మూసివేతతో నిత్యావసరాల సరఫరా నిలిచిపోవడంతో, ప్రస్తుతం విమానాల ద్వారా ఆహార పదార్థాలను రప్పించాల్సి వస్తోంది. ఫలితంగా రవాణా ఖర్చులు విపరీతంగా పెరిగి ద్రవ్యోల్బణ భయాలు ముంచుకొస్తున్నాయి. మరోవైపు, యుద్ధ వాతావరణం కారణంగా అమెరికా సహా పలు దేశాలు గల్ఫ్ ప్రాంతానికి ప్రయాణ అడ్వైజరీలు జారీ చేశాయి. దీంతో ఖతార్‌కు పర్యాటకుల రాక పూర్తిగా తగ్గిపోయింది. చారిత్రక కట్టడాలు, పర్యాటక ప్రాంతాలు వెలవెలబోతుండటంతో హోటళ్లు, చిరు వ్యాపారాల ఆదాయం ఘోరంగా దెబ్బతింది. ఈ ప్రతికూల పరిణామాల నేపథ్యంలో, ప్రస్తుత ఏడాదిలో ఖతార్ ఆర్థిక వ్యవస్థ 8.6 శాతం క్షీణించే అవకాశం ఉందని అంతర్జాతీయ ద్రవ్యనిధి.. IMF అంచనా వేసింది. పరిస్థితి గనుక ఇలాగే ముదిరితే, ఖతార్ వద్ద ఉన్న అత్యవసర రిజర్వ్ నిధులు కూడా పూర్తిగా కరిగిపోయే ప్రమాదముందని ఆర్థిక నిపుణులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.