Top story:దేవరకు వైసీపీ సోషల్ మీడియా ఎలివేషన్ లు…లోకేష్ కంటే టాలెంటేడ్ అంటూ ట్వీట్ లు… లోకేష్ వర్సెస్ జూ.ఎన్టీఆర్, అసలేం జరుగుతోంది…?

ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు ఒకటే చర్చ.. అది వారసత్వమా..? లేక రాజకీయ వ్యూహమా..? సోషల్ మీడియా వేదికగా సాగుతున్న 'లోకేష్ వర్సెస్ జూనియర్ ఎన్టీఆర్' వివాదం వెనుక ఉన్న అసలు రాజకీయ కోణం ఏంటి..?

Post Published By: dialnews
Updated : 4 May 2026, 10:30 PM IST

ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు ఒకటే చర్చ.. అది వారసత్వమా..? లేక రాజకీయ వ్యూహమా..? సోషల్ మీడియా వేదికగా సాగుతున్న 'లోకేష్ వర్సెస్ జూనియర్ ఎన్టీఆర్' వివాదం వెనుక ఉన్న అసలు రాజకీయ కోణం ఏంటి..? ఈ గొడవను వైసీపీ ఎందుకు తెరపైకి తెస్తోంది..? దీని వెనుక ఉన్న వ్యూహకర్తల మాస్టర్ ప్లాన్ ఏంటి..?అవును.. ఇప్పుడు నెట్టింట ఒకటే యుద్ధం నడుస్తోంది. లోకేష్‌ను నీడలా వెంటాడుతున్న ఎన్టీఆర్ ఇమేజ్ గురించి.. నాయకత్వ లక్షణాల గురించి వైసీపీ సోషల్ మీడియాలో వస్తున్న పోస్టులు సరికొత్త చర్చకు దారితీశాయి.ఒకవైపు లోకేష్ మంత్రిగా దూసుకుపోతున్న తరుణంలో.. ఈ 'వారసత్వ పోరు'ను చర్చనీయాంశం చేయడం ద్వారా రాజకీయ లబ్ధి ఎవరికి చేకూరబోతోంది..? అసలు ఈ గొడవను వైసీపీ ఎందుకు రాజేస్తోంది..? దీనివల్ల టీడీపీలో ఎలాంటి పరిణామాలు రాబోతున్నాయి..? ఎన్టీఆర్ ఇమేజ్‌ను వైసీపీ ఒక పొలిటికల్ అస్త్రంగా ఎలా వాడుకుంటోంది..?

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి, లోకేష్ ఎదుగుదలను అడ్డుకోవడమే వైసీపీ ఏకైక లక్ష్యంగా మారిందనే విమర్శలు సహజంగానే వింటూ ఉంటాం. నేరుగా లోకేష్‌ను ఎదుర్కోలేక, నందమూరి అభిమానులను టిడిపికి దూరం చేయడానికి 'ఎన్టీఆర్' అనే అస్త్రాన్ని వైసీపీ బయటకు తీసింది అంటూ టీడీపీ అనుకూల మీడియా, ఆ పార్టీ క్యాడర్ కామెంట్స్ చేస్తూ ఉంటుంది. ఎన్టీఆర్‌కు చంద్రబాబు అన్యాయం చేస్తున్నారనే ఒక అబద్ధాన్ని పదే పదే ప్రచారం చేస్తూ, వైసీపీ ఐటీ వింగ్ సామాన్య ప్రజల్లో కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తోంది. ఈ గొడవను సృష్టించింది మరెవరో కాదు.. సాక్షాత్తూ తాడేపల్లి నుంచి నడుస్తున్న సోషల్ మీడియా సేనలే అనేది ఇప్పుడు వినపడుతోన్న విమర్శ.వైసీపీ కావాలనే లోకేష్ స్పీచ్‌లను, ఎన్టీఆర్ పాత వీడియోలను పక్క పక్కన పెట్టి ట్రోల్స్ చేస్తోంది. 'లోకేష్ కంటే ఎన్టీఆర్ వేల రెట్లు టాలెంటేడ్' అని ట్వీట్లు చేయడం వెనుక ఉన్న ఉద్దేశ్యం ఎన్టీఆర్ మీద ప్రేమా..? అంటే ఖచ్చితంగా కాదు. ఎన్టీఆర్‌ని పొగుడుతున్నట్లు నటిస్తూ.. లోకేష్ ఇమేజ్‌ను డ్యామేజ్ చేయడమే వీరి అసలు గేమ్ అనే మాట బలంగా వినపడుతోంది. నందమూరి-నారా కుటుంబాల మధ్య చిచ్చు పెడితే తప్ప తమకు రాజకీయ మనుగడ లేదని వైసీపీ భావిస్తోంది. అందుకే ప్రతి చిన్న విషయాన్ని 'వారసత్వ పోరు'గా చిత్రీకరిస్తోందనే ఆరోపణ సైతం ఉంది.

ఇక గతంలో అంశాలను ప్రస్తావిస్తూ ఆసక్తికర చర్చకు సైతం తెర లేపుతోంది. దివంగత ఎన్టీఆర్ వారసుల మధ్య సమర్థత విషయంలో ఉన్న వ్యత్యాసాలే చంద్రబాబు నాయుడు పార్టీపై పట్టు సాధించడానికి కారణమయ్యాయని, అయితే జూనియర్ ఎన్టీఆర్ విషయంలో పరిస్థితి భిన్నంగా ఉందని వైసీపీ అనుకూల మీడియా ట్వీట్ లు చేస్తోంది. ఎన్టీఆర్‌లో ఉన్న సహజ సిద్ధమైన నాయకత్వ లక్షణాలు మరియు వాగ్ధాటి, లోకేష్‌తో పోల్చినప్పుడు ఆయనను మరింత మెరుగైన నాయకుడిగా చూపిస్తున్నాయనే చర్చ రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేపుతోంది.2009 ఎన్నికల్లో జూనియర్ ఎన్టీఆర్ చేసిన ప్రచారం అప్పట్లో ఒక ఊపు ఊపింది. అప్పటి ఎన్టీఆర్ ప్రసంగాలకు, ఇప్పటి లోకేష్ ప్రసంగాలకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని వైసీపీ సోషల్ మీడియా వింగ్ కావాలనే హైలైట్ చేస్తోంది. "అప్పుడున్న ఆ గర్జన ఇప్పుడు ఎక్కడ..?" అనే ప్రశ్నను ప్రజల్లోకి వదులుతున్నారు. టిడిపి కేడర్‌లో ఒక వర్గం ఇప్పటికీ నందమూరి కుటుంబానికి వీరవిధేయులుగా ఉన్నారు. ఈ వర్గాన్ని లోకేష్ నాయకత్వం వైపు పూర్తిగా మళ్లకుండా చూడటమే వైసీపీ అసలు ప్లాన్. ఎన్టీఆర్‌ను పొగడటం ద్వారా, ఆ సానుభూతిపరుల మనసుల్లో లోకేష్ పట్ల అసంతృప్తిని రాజేయడం వీరి ఎత్తుగడగా కనపడుతోంది.

లోకేష్‌ను భవిష్యత్తు ముఖ్యమంత్రిగా టిడిపి ప్రొజెక్ట్ చేస్తుంటే, వైసీపీ మాత్రం "ఎన్టీఆర్ లాంటి సమర్థుడు ఉండగా లోకేష్ ఎందుకు?" అనే చర్చను లేవనెత్తుతోంది. ఇది కేవలం ఒక పోలిక మాత్రమే కాదు, టిడిపి భవిష్యత్తు నాయకత్వంపై ప్రజల్లో ఒక రకమైన సందిగ్ధతను సృష్టించే ప్రయత్నంగా అభిప్రాయాలు వినపడుతున్నాయి. వైసీపీ ఐటీ వింగ్ ఎన్టీఆర్ ఫ్యాన్ పేజీలు, గ్రూపుల్లో ఈ తరహా పోస్టులను విరివిగా షేర్ చేస్తోంది. తద్వారా అటు ఎన్టీఆర్ అభిమానుల మద్దతు పొందుతూనే, ఇటు టిడిపిని డిఫెన్స్‌లో పడేస్తోంది. లోకేష్ మరియు ఎన్టీఆర్ మధ్య ఉన్న ఈ తారతమ్యాలను సోషల్ మీడియా వేదికగా పదే పదే ప్రస్తావించడం ద్వారా టీడీపీ శ్రేణుల్లో మరియు నందమూరి అభిమానుల్లో ఒక రకమైన గందరగోళం సృష్టించేందుకు వైసీపీ ప్రయత్నిస్తోంది. ముఖ్యంగా లోకేష్‌ను టార్గెట్ చేస్తూ, ఎన్టీఆర్ సమర్థతను ప్రశంసించడం వెనుక టిడిపిలో అంతర్గత విభేదాలను రాజేయాలనే ఎత్తుగడ కనిపిస్తోంది. ఇది కేవలం ఒక పార్టీ అంతర్గత విషయం మాత్రమే కాకుండా, రాష్ట్ర రాజకీయాల్లో ప్రధాన పక్షాల మధ్య జరుగుతున్న ఒక వ్యూహాత్మక చదరంగంలా మారుతోంది.

Published : 
  • 4 May 2026, 10:30 PM IST