ఇంగ్లాండ్ ను ఓడిస్తే కప్ మనదే… సెంటిమెంట్ గుర్తు చేస్తున్న ఫాన్స్…!

టీ20 ప్ర‌పంచ‌క‌ప్ 2026 ఆఖ‌రి అంకానికి చేరుకుంది. 20 జ‌ట్లు ఈ మెగాటోర్నీలో పాల్గొన‌గా నాలుగు జ‌ట్లు.. భార‌త్‌, ఇంగ్లాండ్, ద‌క్షిణాఫ్రికా, న్యూజిలాండ్ జ‌ట్లు సెమీస్‌కు చేరుకున్నాయి.

Post Published By: dialnews
Updated : 4 March 2026, 7:00 PM IST

టీ20 ప్ర‌పంచ‌క‌ప్ 2026 ఆఖ‌రి అంకానికి చేరుకుంది. 20 జ‌ట్లు ఈ మెగాటోర్నీలో పాల్గొన‌గా నాలుగు జ‌ట్లు.. భార‌త్‌, ఇంగ్లాండ్, ద‌క్షిణాఫ్రికా, న్యూజిలాండ్ జ‌ట్లు సెమీస్‌కు చేరుకున్నాయి. బుధ‌వారం కోల్‌క‌తాలోని ఈడెన్ గార్డెన్స్ వేదిక‌గా జ‌ర‌గ‌నున్న మొద‌టి సెమీఫైన‌ల్ మ్యాచ్‌లో సౌతాఫ్రికా, కివీస్ జ‌ట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి.గురువారం ముంబైలోని వాంఖ‌డే వేదిక‌గా జ‌ర‌గ‌నున్న రెండో సెమీఫైన‌ల్ మ్యాచ్‌లో భార‌త్, ఇంగ్లాండ్ జ‌ట్లు త‌ల‌ప‌డ‌నున్నాయి. సెమీఫైన‌ల్ మ్యాచ్‌ల్లో విజేత‌లుగా నిలిచిన జ‌ట్లు టీ20 ప్ర‌పంచ‌క‌ప్ కోసం మార్చి 8 ఆదివారం జ‌రిగే ఫైన‌ల్ మ్యాచ్‌లో పోటీప‌డ‌నున్నాయి.

చ‌రిత్ర‌ను ప‌రిశీలించిన‌ట్ల‌యితే గ‌తంలో సెమీఫైన‌ల్ మ్యాచ్‌ల్లో ఇంగ్లాండ్ జ‌ట్టును ఓడించిన ప్ర‌తి సారి టీమ్ఇండియా ఐసీసీ ట్రోఫీ విజేత‌గా నిలిచింది. ఇలా ఒక‌సారి కాదు రెండు సార్లు జ‌రిగింది.ఐసీసీ టోర్నీల చ‌రిత్ర‌ను ప‌రిశీలిస్తే ఇప్ప‌టి వ‌ర‌కు భార‌త్‌, ఇంగ్లాండ్ జ‌ట్లు సెమీస్‌లో నాలుగు సార్లు త‌ల‌ప‌డ్డాయి. ఇందులో రెండు మ్యాచ్‌ల్లో భార‌త్‌, మ‌రో రెండు మ్యాచ్‌ల్లో ఇంగ్లాండ్ విజేత‌గా నిలిచింది. గురువారం జ‌రిగే మ్యాచ్ ఇరు జ‌ట్ల మ‌ధ్య ఐదో సెమీస్ మ్యాచ్ కానుంది.

1983 వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌లో భార‌త్, ఇంగ్లాండ్ జ‌ట్లు తొలిసారి సెమీఫైన‌ల్ మ్యాచ్‌లో త‌ల‌ప‌డ్డాయి. ఈ మ్యాచ్‌లో భార‌త్ 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ నిర్ణీత 60 ఓవ‌ర్ల‌లో 213 ప‌రుగుల‌కు ఆలౌటైంది. ఆ త‌రువాత క‌పిల్ దేవ్ నేతృత్వంలోని భార‌త్ 54.4 ఓవ‌ర్ల‌లో 4 వికెట్లు కోల్పోయి 214 ప‌రుగుల ల‌క్ష్యాన్ని ఛేదించింది. సెమీస్‌లో ఇంగ్లాండ్ పై గెలిచిన భార‌త్.. ఫైన‌ల్ మ్యాచ్‌లో వెస్టిండీస్‌ను ఓడించి తొలిసారి ప్ర‌పంచ‌క‌ప్‌ను ముద్దాడింది.,త‌రువాత భార‌త్, ఇంగ్లాండ్ జ‌ట్లు 1987 వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌, టీ20 ప్ర‌పంచ‌క‌ప్ 2022లోనూ సెమీఫైన‌ల్ మ్యాచ్‌ల్లో త‌ల‌ప‌డ్డాయి. ఈ రెండు ప్ర‌పంచ‌క‌ప్ సెమీస్ మ్యాచ్‌ల్లో ఇంగ్లాండ్ విజ‌యం సాధించింది.

ఇక నాలుగో సారి భార‌త్, ఇంగ్లాండ్ జ‌ట్లు టీ20 ప్ర‌పంచ‌క‌ప్ 2024లో పోటీప‌డ్డాయి. ఈ మ్యాచ్‌లో భార‌త్ 68 ప‌రుగుల తేడాతో గెలుపొందింది.మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భార‌త్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 7 వికెట్ల న‌ష్టానికి 171 ప‌రుగులు చేసింది. 172 ప‌రుగుల ల‌క్ష్య ఛేద‌న‌లో ఇంగ్లాండ్ 16.4 ఓవ‌ర్ల‌లో 103 ప‌రుగులకే కుప్ప‌కూలింది. సెమీస్‌లో ఇంగ్లాండ్‌ను ఓడించిన భార‌త్ ఫైన‌ల్ మ్యాచ్‌లో ద‌క్షిణాఫ్రికాను చిత్తు చేసి టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌ను ముద్దాడింది.చ‌రిత్ర పున‌రావృత‌మై సెమీస్ లో ఇంగ్లాండ్ పై భార‌త్ విజ‌యం సాధిస్తే టీ20 ప్ర‌పంచ‌క‌ప్ 2026 మ‌న‌దే అని నెటిజ‌న్లు అంటున్నారు.

.

Published : 
  • 4 March 2026, 7:00 PM IST