ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా భారత్-పాకిస్థాన్ జట్ల మధ్య జరగాల్సిన హై-వోల్టేజ్ మ్యాచ్‌పై నెలకొన్న సందిగ్ధతకు టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తెరదించాడు. భారత్‌తో మ్యాచ్‌ను బహిష్కరిస్తున్నామని పాకిస్థాన్ ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో టీమిండియా వైఖరి ఏంటో సూర్య స్పష్టం చేశాడు.మెగా టోర్నీ నేపథ్యంలో జరిగిన కెప్టెన్ల సమావేశంలో పాల్గొన్న సూర్యను పాక్ బాయ్‌కాట్ గురించి ప్రశ్నించగా.. తనదైన శైలిలో బదులిచ్చాడు. పాకిస్తాన్‌తో మ్యాచ్ ఆడమని తాము ఎన్నడూ చెప్పలేదన్నాడు. ఆ జట్టుతో మ్యాచ్ ఆడేందుకు తాము కొలంబో వెళతామన్నాడు. ఇప్పటికే ఇందుకు సంబంధించిన విమాన టికెట్లు కూడా బుక్ అయ్యాయని తెలిపాడు. తాము మ్యాచ్ ఆడటానికి సిద్ధంగా ఉన్నామనీ, తమ ప్రణాళికల్లో ఎలాంటి మార్పు లేదన్నాడు. . తాము షెడ్యూల్ ప్రకారం కొలంబోకు వెళ్తున్నామనీ, ముందుగా యూఎస్ఏ, తర్వాత నమీబియాతో మ్యాచ్ లు ఆడి ఆ తర్వాత కొలంబోకు బయలుదేరుతామని సూర్య చెప్పుకొచ్చాడు.
పాకిస్థాన్ జట్టు మైదానంలోకి రాకపోయినా.. భారత్ మాత్రం ఐసీసీ నిబంధనలను పాటించనుంది. షెడ్యూల్ ప్రకారం టీమిండియా కొలంబో చేరుకుని, ప్రాక్టీస్ సెషన్లలో పాల్గొంటుంది. అలాగే ప్రీ-మ్యాచ్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లకు కూడా హాజరవుతుంది.మ్యాచ్ రోజున భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మైదానంలోకి వచ్చి టాస్ కోసం ప్రత్యర్థి కెప్టెన్ కోసం వేచి చూస్తారు. ఒకవేళ పాక్ జట్టు రాకపోతే, మ్యాచ్ రెఫరీ సూచనల మేరకు భారత్‌కు వాకోవర్ ద్వారా విజయం లభించనుంది. ఇదిలా ఉంటే మ్యాచ్ సమయానికల్లా పాకిస్థాన్ యూటర్న్ తీసుకుంటుందని అంతా భావిస్తుండగా.. ఆ దేశ ప్రధాని షెహాబాజ్ షెరీఫ్ తగ్గేదేలేదని ప్రకటించారు.
భారత్‌తో మ్యాచ్‌ను ఎట్టిపరిస్థితుల్లో ఆడేది లేదని స్పష్టం చేశారు.దీనిపై బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా స్పందించారు. పాకిస్తాన్ ప్రభుత్వ నిర్ణయంతో బీసీసీఐకి ఎలాంటి సంబంధం లేదన్నాడు. ఐసీసీనే దీనిపై తుది నిర్ణయం తీసుకుంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఐసీసీ ఏ నిర్ణయం తీసుకున్నా కూడా దానికి తాము కట్టుబడి ఉంటామన్నాడు.ఒకవేళ పాకిస్థాన్ మ్యాచ్‌ను బహిష్కరిస్తే.. భారత్‌కు ఉచితంగా 2 పాయింట్లు లభిస్తాయి. అంతేకాకుండా, పాకిస్థాన్ నెట్ రన్ రేట్ కూడా భారీగా దెబ్బతింటుంది. వారి సూపర్ -8 అవకాశాలపై తీవ్ర ప్రభావం పడనుంది. అంతేకాకుండా ఐసీసీ నుంచి భారీ జరిమానాతో పాటు ఆంక్షలను ఎదుర్కోవాల్సి ఉంటుంది.