ఐపీఎల్ 2026లో బ్యాటర్ల హవా కొనసాగుతోంది. భారీ భారీ స్కోర్లను సైతం జట్లు ఊదేస్తున్నాయి. అసలు ఒక్క రోజులోనే నలుగురు ఆరెంజ్ క్యాప్ అందుకోవడం ఐపీఎల్ చరిత్రలోనే ఓ రికార్డుగా మిగిలిపోయింది. ఆర్సీబీ - గుజరాత్ మ్యాచ్ మొదలుకొని రాజస్థాన్ - సన్‌రైజర్స్ మ్యాచ్ వరకూ మ్యాచ్ మ్యాచ్‌కి ఆరెంజ్ క్యాప్ మారుతూనే వస్తోంది. రాజస్థాన్ రాయల్స్ - సన్‌రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్స్‌లలో చెరొక ప్లేయర్ ఆరెంజ్ క్యాప్ అందుకున్నారు.రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు - గుజరాత్ టైటాన్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో విరాట్ కోహ్లి 44 బంతుల్లో 81 పరుగులు చేసి 328 రన్స్‌తో ఏప్రిల్ 24 రాత్రి నుంచి ఏప్రిల్ 25 మధ్యాహ్నం వరకూ ఆరెంజ్ క్యాప్ హోల్డర్‌గా ఉన్నాడు. ఏప్రిల్ 25 మధ్యాహ్నం ఢిల్లీ క్యాపిటల్స్ - పంజాబ్ కింగ్స్ మధ్య జరిగిన హై ఓల్టేజ్ మ్యాచ్‌లో కేఎల్ రాహుల్ రికార్డు స్థాయిలో 67 బంతుల్లో 152 పరుగులతో నాటౌట్‌గా నిలిచి 357 రన్స్‌తో ఆరెంజ్ క్యాప్ సొంతం చేసుకున్నాడు.
కేఎల్ రాహుల్ ఆరెంజ్ క్యాప్ సొంతం చేసుకున్న హ్యాపీనెస్ కాసేపు కూడా లేకుండా పోయింది. ఆ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ 20 ఓవర్లలో 264/2 భారీ స్కోర్ నమోదు చేస్తే.. పంజాబ్ కింగ్స్ ఇంత భారీ లక్ష్యాన్ని కూడా సునాయాసంగా ఛేదించింది. ప్రభ్‌సిమ్రాన్ సింగ్, ప్రియాన్షు ఆర్య, కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ రెచ్చిపోవడంతో 18.5 ఓవర్లలోనే ఛేదించి రికార్డు సృష్టించింది.సాయంత్రం వరకూ కేఎల్ రాహుల్ వద్ద ఉన్న ఆరెంజ్ క్యాప్ ఆ మ్యాచ్ ముగిసిన వెంటనే వైభవ్ సూర్యవంశీ చేతికి వచ్చింది.
జైపూర్ వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో వైభవ్ సూర్యవంశీ రివేంజ్ ఇన్నింగ్స్‌తో సెంచరీ మోత మోగించాడు. ఉప్పల్‌లో జరిగిన మ్యాచ్‌లో ఫస్ట్ బాలే డకౌట్ కావడంతో జైపూర్‌లో 36 బంతుల్లోనే సెంచరీ చేసి రికార్డు సృష్టించాడు. దాంతో 357 పరుగులతో కేఎల్ రాహుల్‌తో సరిసమానంగా నిలిచి ఆరెంజ్ క్యాప్ అందుకున్నాడు.అదే మ్యాచ్ ఛేజింగ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్, నెంబర్ 1 టీ20 బ్యాటర్ అభిషేక్ శర్మ రెచ్చిపోయి ఆడి ఆరెంజ్ క్యాప్ మళ్లీ తన చేతికే వచ్చేటట్టు చేసుకున్నాడు. ఈ మ్యాచ్‌లో అభిషేక్ 29 బంతుల్లో 11 ఫోర్లు, 1 సిక్సర్‌తో 57 పరుగులు చేశాడు. మొత్తం 380 పరుగులతో అభిషేక్ శర్మ అత్యధిక పరుగులు చేసిన జాబితాలో టాప్ ప్లేస్‌లో నిలిచాడు. దాంతో ఆరెంజ్ క్యాప్ కేవలం ఒక్క రోజులోనే నలుగురు చేతులు మారింది.