సుదీర్ఘ దౌత్య వివాదం తర్వాత ట్రంప్ చేసిన సంచలన ప్రకటనే ఇది. భారత్‌తో ట్రేడ్ డీల్‌కి అంగీకరిస్తున్నట్టు తన ట్రూత్ సోషల్ మీడియాలో ప్రకటించాడు. ప్రతీకార సుంకాలనూ 18 శాతానికి తగ్గిస్తున్నామని గుడ్ న్యూస్ చెప్పాడు. అమెరికాపై విధిస్తున్న టారిఫ్‌లను జీరోకు చేర్చడానికి, రష్యా నుంచి చమురు దిగుమతులను నిలిపేయడానికి భారత్ అంగీకరించిందని పేర్కొన్నాడు. ట్రంప్ ప్రకటనతో ఇప్పటిదాకా భారత్ ఉత్పత్తులపై పడుతున్న 50 శాతం.. ఇందులో రష్యా నుంచి చమురు కొంటున్నందుకు విధించిన 25 శాతం అదనపు సుంకం ఉంది సుంకాలు 18 శాతానికి తగ్గుతాయి. ఇదే సమయంలో వైట్‌హౌస్ కూడా అదనపు సుంకాల తొలగింపును కన్ఫమ్ చేసింది. ఈ పరిణామానికి కొద్ది క్షణాల ముందే ప్రధాని మోడీకి ఫోన్‌కాల్ చేశాడు ట్రంప్. కథ మొత్తాన్నీ ఆ ఫోన్‌కాలే మార్చేసింది.
ట్రంప్ పోస్టులో ఏముందన్న డీటెయిల్స్‌లోకి వెళితే.. 'ప్రధాని మోడీతో మాట్లాడటాన్ని తాను గౌరవంగా భావిస్తున్నా అనీ, తనకున్న గొప్ప స్నేహితుల్లో మోడీ ఒకరని ట్రంప్ పేర్కొన్నాడు. మోడీని భారత్‌కు శక్తిమంతమైన, గౌరవప్రదమైన నాయకుడిగా అభివర్ణించిన ట్రంప్.. తాము చాలా విషయాలు మాట్లాడుకున్నట్టు చెప్పారు. వాణిజ్యం, ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు, రష్యా చమురు కొనుగోలు నిలిపివేత, అమెరికా, వెనిజులా నుంచి భారత్ మరింత చమురు కొనుగోలు వంటి అంశాలపై కీలక చర్చలు జరిపినట్టు వివరించాడు. మోడీపై ఉన్న గౌరవంతో తాను వెంటనే వాణిజ్య ఒప్పందానికి అంగీకరిస్తున్నా అన్నాడు. తమ ఉత్పత్తులను భారీగా కొనేందుకు భారత ప్రధాని కట్టుబడి ఉన్నారనీ.. 500 బిలియన్ డాలర్లకుపైగా విలువైన ఇంధనం, టెక్నాలజీ, బొగ్గు, వ్యవసాయ ఉత్పత్తులతో పాటు ఇతర ఉత్పత్తుల కొనుగోళ్లకు అదనంగా మరిన్ని దిగుమతులకు భారత్ సిద్ధంగా ఉందన్నాడు. ఆ తర్వాత ప్రధాని మోడీ కూడా ఒక ట్వీట్ చేశారు.
మేడిన్ ఇండియా ఉత్పత్తులపై ఇక నుంచి 18 శాతం అమెరికా సుంకమే అమలు కానుందని ప్రధాని వెల్లడించారు. సుంకాలను తగ్గించి గుడ్‌న్యూస్ చెప్పినందుకు 140 కోట్ల మంది భారతీయుల తరఫున అధ్యక్షుడు ట్రంప్‌నకు ధన్యవాదాలు తెలిపారు. తన ట్వీట్‌లో ప్రపంచ శాంతికి, సుస్థిరతకు, సుసంపన్నతకు ట్రంప్ నాయకత్వం ఎంతో కీలకం అని అభిప్రాయపడ్డారు. శాంతి కోసం ట్రంప్ చేసే ప్రయత్నాలకు భారత్ పూర్తి స్థాయిలో మద్దతు ఇస్తుందని హామీ ఇచ్చారు. రెండు దేశాల భాగస్వామ్యాన్ని అత్యున్నత స్థాయికి చేర్చేందుకు అమెరికా అధ్యక్షుడితో సన్నిహితంగా కలిసి పని చేసేందుకు ఎదురుచూస్తున్నా అని ప్రధాని మోడీ వివరించారు. ఆ తర్వాత ఎన్డీయే సమావేశంలోనూ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్‌పై అమెరికా విధించిన సుంకాలపై ఎన్ని విమర్శలు వచ్చినా.. సహనంతో ఉన్నాననీ, ఆ సహనమే ఇప్పుడు దేశానికి మంచి ఫలితాలను తీసుకువచ్చిందన్నారు. కానీ, ట్రంప్‌లో సడెన్‌గా ఇంత మార్పు ఎలా వచ్చింది? ఈ ప్రశ్నకు సమాధానం భారత్ నెక్స్ట్ లెవెల్ యాక్షనే.
భారత్ ఇతర దేశాలతో చేసుకున్న ఒప్పందాలు అమెరికాను ఆత్మరక్షణలో పడేశాయి. అలాంటి వాటిలో భారత్-యూరోపియన్ యూనియన్ 'మదర్ ఆఫ్‌ఆల్ డీల్స్' ఒకటి. దీనివల్ల యూరోప్ దేశాల కార్లు, వైన్, విలాసవంతమైన వస్తువులకు భారత మార్కెట్లో సుంకాలు భారీగా తగ్గాయి. అమెరికా వస్తువులపై సుంకాలు ఉండి, యూరప్ వస్తువులపై లేకపోతే.. అమెరికా కంపెనీలు భారత మార్కెట్‌ను కోల్పోతాయి. ఈ పోటీని తట్టుకోవడానికే ట్రంప్ వేగంగా 18 శాతానికి తగ్గించాల్సి వచ్చిందంటున్నారు విశ్లేషకులు. ఇక రెండోది గతేడాది బ్రిటన్‌తో జరిగిన ఒప్పందం. ఈ ఫ్రీట్రేడ్ డీల్ ద్వారా భారత ఐటీ నిపుణులకు, వస్త్ర రంగానికి బ్రిటన్ పెద్దపీట వేసింది. అదే ఏడాది డిసెంబర్‌లో న్యూజిలాండ్‌తో కుదిరిన ఒప్పందం ప్రకారం న్యూజిలాండ్ పండ్లు, కలప వంటి కీలక ఉత్పత్తులకు భారత్ వెసులుబాటు ఇచ్చింది. ఈ దేశాలన్నీ భారత్ అడిగినట్లుగా డైరీ, అగ్రికల్చర్ రంగాల్లో సున్నితమైన అంశాలను గౌరవించాయి.. ఇది అమెరికాపై ఒత్తిడి పెంచింది. ఇలా భారత్ ఇతర దేశాలతో ఒప్పందాలు చేసుకుని, అమెరికాను పక్కన పెట్టడంతో.. అతిపెద్ద భారత మార్కెట్ వేరే దేశాల పరమవుతుందని ట్రంప్ గుర్తించాడు.. అందుకే, పూర్తి స్థాయిలో కాకపోయినా, 18శాతం సుంకంతో అయినా తన ఉనికిని కాపాడుకోవాలని ఈ డీల్‌కు ఓకే చెప్పి ఉండొచ్చు. ఇదంతా ఓకే, మరి ట్రేడ్ డీల్ లో చిక్కుల మాటేంటి? భారత్ తెలిపిన అభ్యంతరాల సంగతేంటి?
అమెరికాతో ట్రేడ్ డీల్ ఫైనల్ కాకపోవడానికి చాలా కారణాలున్నాయి. ఇప్పటికీ కొన్ని విషయాల్లో స్పష్టత రావాల్సి ఉంది. వాటిలో నాన్‌వెజ్ మిల్క్, జెనెటికల్లీ మోడిఫైడ్ సోయా, మక్క దిగుమతులు కీలక అంశాలు. వీటిలో దేనికి ఓకే చెప్పినా మన రైతులు తీవ్రంగా నష్టపోతారు. మన సాంస్కృతిక భావాలకు వ్యతిరేకం కూడా. అమెరికాలో పాడి పశువులకు మాంసాహార మిశ్రమం మేతగా ఇస్తారు. ఇది భారత మతపరమైన, సాంస్కృతిక భావాలకు విరుద్ధం. ఎప్పుడూ భారత్ ఈ విషయంలో తన రెడ్ లైన్ దాటలేదు.. శాకాహార ధృవీకరణ లేనిదే పాల ఉత్పత్తులను అనుమతించమని మోడీ సర్కార్ స్పష్టం చేసింది. అయితే, ప్రస్తుత డీల్‌లో ద్రవ రూపంలో ఉండే పాలను పక్కన పెట్టి, కేవలం కొన్ని ఎంపిక చేసిన డైరీ ఉత్పత్తులకు మాత్రమే పరిమిత అనుమతులు ఇచ్చారని ఓ అంచనా. అలాగే, అమెరికా సోయాబీన్, మొక్కజొన్నను భారత్‌కు పెద్ద ఎత్తున ఎగుమతి చేయాలని చూస్తోంది. మన ప్రభుత్వం జెనిటికల్లీ మాడిఫైడ్ కాని సోయాబీన్‌ను మాత్రమే అనుమతిస్తామని గత చర్చల్లో పేర్కొంది. అమెరికా నుండి వచ్చే మొక్కజొన్నను ఆహారం కోసం కాకుండా, కేవలం ఇథనాల్ తయారీ కోసం వాడేలా షరతులు విధిస్తున్నారు. తద్వారా మన ఫుడ్ చైన్‌లోకి జెనిటికల్లీ మాడిఫైడ్ పంటలు రాకుండా జాగ్రత్త పడుతున్నారు.. దీనిపైనా క్లారిటీ రావల్సి ఉంది.