హార్ముజ్ జలసంధిలో హైవోల్టేజ్ సైనిక విన్యాసాలకు సంబంధించిన దృశ్యాలు ఇవి. USతో చర్చలు కొనసాగుతున్న సమయంలోనే టెహ్రాన్ యుద్ధ సన్నాహాలకు దిగింది. ఇవి కేవలం సైనిక విన్యాసాలే కాదు.. తాత్కాలికంగా హార్ముజ్ జలసంధిని మూసివేశామని వెల్లడించింది. తమ దేశ సైనిక విన్యాసాల కోసం హార్ముజ్ జలసంధిని మూసివేయాల్సి వచ్చిందని తెలిపింది. తద్వారా చమురు రవాణాకు అత్యంత కీలకమైన అంతర్జాతీయ జలమార్గం హార్ముజ్‌పై తమకు పట్టు ఉందనే పరోక్ష సందేశాన్ని అమెరికాకు ఇరాన్ పంపింది. హార్ముజ్ జలసంధిని మూసివేస్తున్నట్లు టెహ్రాన్ ప్రకటన చేయడం ఇదే తొలిసారి. స్విట్జర్లాండ్‌లోని జెనీవా వేదికగా అమెరికాతో ఇరాన్ చర్చలు జరిపినప్పుడే
దేశ భద్రత కోసం హార్ముజ్ జలసంధిని ఇరాన్ తాత్కాలికంగా మూసివేసినట్టు ఆ దేశ మీడియాలో కథనాలు వచ్చాయి. అయితే, ఈ మూసివేత కేవలం కొన్నిగంటల పాటు మాత్రమే జరిగింది. ప్రస్తుతం ఈ జలసంధి గుండా నౌకల రాకపోకలు మళ్లీ సాధారణ స్థితికి చేరుకున్నాయి. కానీ, పూర్తిస్థాయిలో ఎప్పుడైనా మూసివేయొచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
మరోవైపు అమెరికా కూడా వెనక్కి తగ్గడం లేదు. చర్చలు ఫెయిల్ అయితే సైనిక చర్యకు దిగుతామని ట్రంప్ మొదటి నుంచి ఇరాన్‌ను హెచ్చరిస్తున్నారు. జెనీవా వేదికగా ఇరుదేశాల మధ్య జరిగిన రెండో రౌండ్ చర్చలు కూడా కొలిక్కిరాలేదు. ఈ నేపథ్యంలోనే 24 గంటల్లో దాదాపు 50 అత్యాధునిక ఫైటర్ జెట్లను అమెరికా మిడిల్‌ఈస్ట్‌లో మోహరించింది. యూఎస్‌కు చెందిన ఎఫ్-22, ఎఫ్-16, ఎఫ్-35 వంటి ఫైటర్ జెట్లతో పాటు గగనతలంలోనే ఫ్యూయల్ నింపుకునే యుద్ధ విమానాలు మిడిల్ ఈస్ట్‌కు చేరుకున్నాయి. ఇప్పటికే ఆ ప్రాంతంలో ఓ ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్ ఉండగా.. మరొకటి పశ్చిమాసియా దిశగా పయనిస్తోంది. జెనీవాలో చర్చలపై మార్కో రూబియో స్పందించారు. చర్చలు సానుకూలంగానే జరిగాయంటూనే.. తదుపరి దశలో జరిగే చర్చల్లో సహేతుక వైఖరి అవలభించాలని ఇరాన్‌కు సూచించారు ట్రంప్. 2025 జూన్‌లో జరిగిన బీ-2 బాంబు దాడిని గుర్తు చేశారు. దీనికి ప్రతీగా ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ కూడా ఘాటుగా స్పందించారు. ప్రపంచంలో బలమైన సైన్యానికైనా ఒక రోజు దెబ్బ తగిలితే తిరిగి లేచే అవకాశం ఉండకపోవచ్చని హెచ్చరించారు. అమెరికా నేవీ ఉనికిపై వ్యాఖ్యానిస్తూ, సముద్రంలో యుద్ధనౌకలు ఉన్నా వాటిని ముంచగల ఆయుధాలు ఉన్నాయని చెబుతూ వరుస ట్వీట్లు చేశారు.
ఇదంతా ఓకే.. కానీ, ఇరాన్ నిజంగా హార్ముజ్ జలసంధిని మూసేస్తుందా? అన్నదే ఇప్పుడు అసలు ప్రశ్న. అదే జరిగితే ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు మరో బిగ్ షాక్ తప్పదు. అరేబియా సముద్రంలో ఒమన్‌కు చెందిన ముసాండం ద్వీపకల్పం-ఇరాన్ మధ్య ఉంది ఈ అత్యంత ఇరుకైన జలసంధి. ఈ మార్గంలో ఒక చోట ఇరుకుగా 33 కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది. దీనిలో రెండు షిప్పింగ్ లేన్లు ఉన్నాయి. ఇందులో హెవీ క్రూడ్ క్యారియర్లు సులువుగా ప్రయాణిస్తాయి. దీనిలో ఒమన్ తీరం నుంచి నౌకలు పర్షియన్ గల్ఫ్‌లోకి ప్రవేశిస్తాయి. చమురును నింపుకొని ఇరాన్ సమీపం నుంచి హర్మూజ్‌ను దాటి బయటకు వస్తాయి. ఈ మార్గం నుంచి నిత్యం రెండు కోట్ల పీపాల చమురు వివిధ దేశాలకు వెళుతుంది. ఇది మొత్తం ప్రపంచం వినియోగించే దానిలో ఐదో వంతుకు సమానం. సౌదీ, ఇరాన్, యూఏఈ, కువైట్, ఇరాక్ దేశాల నుంచి ఎగుమతి అవుతోంది. ఇక లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్ రవాణాకు కూడా అత్యంత కీలకం. మూడింట ఒక వంతు ఎల్‌ఎన్‌జీ కూడా ఇక్కడి నుంచే వివిధ దేశాలకు చేరుతుంది. ఈ జలసంధిలో ఏర్పడే ఏ అంతరాయమైనా ప్రపంచ వాణిజ్యాన్ని గజగజలాడిస్తుంది. ఇక ఈ మార్గం నుంచి వచ్చే చమురు, ఎల్‌ఎన్‌జీ అత్యధికంగా భారత్, చైనా, దక్షిణ కొరియా, జపాన్ దేశాలకు ఎగుమతి అవుతోంది.
భారత్ అవసరాలకు వాడే చమురులో 40 శాతం ఈ మార్గం నుంచే రవాణా అయ్యేది. ఇరాక్, సౌదీ, యూఏఈ, కువైట్, ఖతార్ నుంచి మనం దిగుమతి చేసుకొంటున్నాం. భారత్ వినియోగించే ఇంధనంలో 90 శాతం వివిధ మార్కెట్ల నుంచి దిగుమతి చేసుకొంటున్నాం. ఈ క్రమంలో హర్మూజ్ జలసంధి మూసుకుపోతే.. ప్రత్యామ్నాయ మార్గాలు వెతుక్కోవడంతోపాటు.. ట్రాన్స్‌పోర్ట్, ఇన్సూరెన్స్ ఖర్చులు భారీగా పెరుగుతాయి. దీంతో దేశీయంగా పెట్రోల్, డీజిల్, ఎల్‌ఎన్‌జీ ధరలకు రెక్కలు రావడం ఖాయం. అయితే, ఈ సంక్షోభాన్ని ఎదుర్కోడానికి దేశీయ అవసరాలకు సరిపడా చమురు నిల్వలు ఉన్నట్టు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. పైగా భారత్ ఇప్పుడు కేవలం మధ్యప్రాచ్యంపైనే కాకుండా రష్యా, అమెరికా, బ్రెజిల్ నుండి దిగుమతులను పెంచింది. ఈ దేశాల నుండి వచ్చే ముడి చమురుకు హార్ముజ్ జలసంధితో సంబంధం లేదు. కాబట్టి ఈ ప్రభావం అంతగా మన దేశంపై పడకపోవచ్చని విశ్లేషకులు చెబుతున్నారు.
నిజానికి.. ఇరాన్ ఎన్నడూ ఈ జలసంధిని మూయలేదు. ఎందుకంటే, ఈ జలసంధిని మూసివేస్తే నష్టపోయేది కూడా ఆ దేశమే.
టెహ్రాన్ ఉత్పత్తి చేసే చమురులో 80శాతం చైనా కొనుగోలు చేస్తుంది. ఈ నేపథ్యంలో హర్మూజ్‌ను మూస్తే.. దాని ఆర్థిక వ్యవస్థ మరింత దిగజారుతుంది. కాబట్టి ఆ సాహసం అస్సలు చేయదు అనే నివేదికలు తెలుబుతున్నాయి. కానీ, ప్రస్తుత పరిణామాలు ఇరాన్‌ను ఎంత దూరమైనా తీసుకెళతాయనే అనుమానాలూ వ్యక్తమవుతున్నాయి. యురేనియం శుద్ధి నిలిపివేత తో పాటు, బాలిట్సిక్ క్షిపణులను తయారు చేయడానికి వీల్లేదని అమెరికా స్పష్టం చేస్తోంది. అవేకాదు, ప్రాంతీయ జోక్యం అంటే యెమన్, లెబనాన్, పాలస్తీనా వంటి దేశాల్లో ఉన్న సాయుధ గ్రూపులకు ఇరాన్ ఇస్తున్న మద్దతును పూర్తిగా నిలిపివేయాలంటోంది. అందుకు టెహ్రాన్ ససేమిరా అంటోంది. అవసరమైతే అమెరికాతో యుద్ధానికైనా సిద్ధమే కానీ, మీ ఒత్తిళ్లకు తలొగ్గేది లేదంటోంది. అగ్రరాజ్యంతో అమీతుమీకి దిగాలని డిసైడ్ అయితే హార్ముజ్ కేరాఫ్‌గానే భీకర యుద్ధం జరుగుతుంది. అలాంటి పరిస్థితులే వస్తే ఈ సంక్షోభం ఎంత దారుణంగా ఉంటుందో ఊహకు కూడా అందదు.