అమీషా పటేల్.. కేవలం హిందీలో మాత్రమే కాదు తెలుగులోనూ ఈమె పేరు బాగానే పాపులర్ అయింది. ఇక్కడ పవన్ కళ్యాణ్ బద్రితో పాటు ఎన్టీఆర్ నరసింహుడు, బాలయ్యతో పరమవీర చక్ర లాంటి సినిమాలు చేసింది. బాలీవుడ్లో 'కహో నా ప్యార్ హై', 'గదర్' వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలతో బాలీవుడ్లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్న అమీషా పటేల్.. సుదీర్ఘ విరామం తర్వాత మళ్ళీ వెండితెరపై మెరుస్తున్న విషయం తెలిసిందే. అయితే ఆమె కెరీర్ మళ్ళీ ఊపందుకుంటున్న తరుణంలో.. 2017 నాటి ఒక పాత వివాదం ఆమెను చిక్కుల్లోకి నెట్టింది. దాదాపు ఏడేళ్ల క్రితం జరిగిన ఒక ఈవెంట్ ఒప్పందానికి సంబంధించిన గొడవ ఇప్పుడు మళ్ళీ తెరపైకి రావడమే కాకుండా.. మొరాదాబాద్ కోర్టు ఆమెపై నాన్-బెయిలబుల్ వారెంట్ జారీ చేయడం బాలీవుడ్ వర్గాల్లో.. అలాగే ఆమె అభిమానుల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ కేసు మూలాలు 2017 నాటి ఒక ప్రైవేట్ ఈవెంట్ చుట్టూ తిరుగుతున్నాయి.
నివేదికల ప్రకారం మొరాదాబాద్‌లో జరగాల్సిన ఒక కార్యక్రమానికి హాజరయ్యేందుకు అమీషా పటేల్ అంగీకరించి.. దానికి సంబంధించిన పారితోషికాన్ని కూడా తీసుకున్నారని నిర్వాహకులు ఆరోపిస్తున్నారు. డబ్బు తీసుకున్నప్పటికీ ఆమె ఈవెంట్‌కు హాజరు కాలేదని, ఆ తర్వాత సెటిల్మెంట్లో భాగంగా ఆమె ఇచ్చిన చెక్ కూడా బౌన్స్ అయిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ చెక్ బౌన్స్ ఇష్యూ అండ్ ఒప్పంద ఉల్లంఘనే ఇప్పుడు ఆమెకు ప్రధాన సమస్యగా మారింది. సాధారణంగా చెక్ బౌన్స్ కేసులు సివిల్ వివాదాలుగా మొదలైనప్పటికీ.. కోర్టు ధిక్కరణ జరిగితే అవి తీవ్ర రూపం దాలుస్తాయి. అమీషా పటేల్ విషయంలో కూడా అదే జరిగినట్లు కనిపిస్తోంది. కోర్టు విచారణలకు ఆమె పలుమార్లు గైర్హాజరు కావడం వల్లే మొరాదాబాద్ కోర్టు సీరియస్ అయ్యి.. నాన్-బెయిలబుల్ వారెంట్ జారీ చేసినట్లు సమాచారం.
ఈ వివాదంలో ఉన్న మొత్తంపై భిన్నమైన కథనాలు ఉన్నాయి. కొన్ని నివేదికలు లక్షల రూపాయలని చెబుతుంటే, మరికొన్ని సుమారు 14 లక్షల రూపాయల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నాయి. ఏదేమైనా కోర్టు ఆదేశాలను పాటించకపోవడం వల్లే పరిస్థితి ఇక్కడి వరకు వచ్చిందనేది న్యాయ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ పరిణామాలపై అమీషా పటేల్ సోషల్ మీడియా వేదికగా స్పందించింది. ఈ కేసు చాలా పాతదని, దీనికి సంబంధించి ఇప్పటికే ఒక ఒప్పంద పత్రం కుదుర్చుకున్నామని ఆమె పేర్కొంది. ఫిర్యాదుదారునికి ఇవ్వాల్సిన మొత్తం డబ్బును ఎప్పుడో చెల్లించేశామని.. అయినప్పటికీ తనపై ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేయడం దురదృష్టకరమని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.
తన లీగల్ టీం ఈ విషయంపై తగిన చర్యలు తీసుకుంటోందని.. పాత విషయాన్ని మళ్ళీ తిరగదోడటం వెనుక దురుద్దేశం ఉండొచ్చని ఆమె పరోక్షంగా అభిప్రాయపడింది. సెలబ్రిటీల జీవితాల్లో ఇలాంటి న్యాయపరమైన వివాదాలు కొత్తేమీ కానప్పటికీ.. పాత కేసులు మళ్ళీ తెరపైకి రావడం తరచుగా వాళ్ళ ఇమేజ్‌పై ప్రభావం చూపుతుంది. ప్రస్తుతం ఈ కేసు న్యాయస్థానం పరిధిలో ఉంది కాబట్టి.. తదుపరి విచారణలో ఏం జరుగుతుందనేది ఆసక్తికరంగా మారింది. అమీషా చెబుతున్నట్లు నిజంగానే సెటిల్మెంట్ జరిగిందా లేదంటే ఫిర్యాదుదారుల ఆరోపణల్లో నిజముందా అనేది కోర్టు తీర్పు ద్వారానే స్పష్టమవుతుంది. అప్పటి వరకు ఇది కేవలం ఆరోపణల పర్వంగానే మిగిలిపోతుంది.