నేటి రాజకీయాల్లో బూతులు మాట్లాడినా, దాడులు చేసినా, దొమ్మీలు, కూనీలు చేసినా, జైలుకు వెళ్ళినా వచ్చే ఇమేజ్ వేరు. ఆ ఇమేజ్ కు క్రేజ్ వేరు.. ఆ లీడర్ డామినేషన్ లెవెల్స్ వేరు. బహుసా వైసీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇదే కోవకు వస్తారేమో. సిఎం చంద్రబాబును దూషించిన తర్వాత వరుస కేసులు ఎదుర్కొన్న అంబటి రాంబాబు దాదాపు 18 రోజుల నుంచి రాజమండ్రి జైల్లో గడిపారు. ఆయన ఇప్పట్లో బయటకు రావడమే కష్టమే అంటూ పొలిటికల్ సర్కిల్స్ లో గుస గుసలు నడిచాయి.
గంభీరంగా, ధైర్యంగా కనపడే అంబటి.. జైలుకు వెళ్ళే ముందు కాస్త భయపడ్డట్టు కనపడ్డారు. జైలు నుంచి బయటకు వచ్చే సమయానికి ఆయనలో ఆ గంభీరం, ధైర్యం కనపడటం కష్టమే అని అంచనా వేసారు.. కానీ.. కానీ.. కానీ అంచనాలు తలకిందులు చేస్తూ.. రెగ్యులర్ గా.. యాస్ ఇట్ ఈజ్ గా తన తలను అదే ధైర్యంగా ఎగరవేశారు అంబటి. తాను జైల్లో నుంచి బయటకు వచ్చే వరకు అండగా నిలబడ్డ గోదావరి జిల్లాల నాయకత్వాన్ని చూసి, వారి కోసం జైలు వద్ద కూడా అంబటి.. విశ్వ రూపమే ప్రదర్శించారు.
రాజమహేంద్రవరం సెంట్రల్ జైలు నుంచి ఈ రోజు విడుదల చేసారు. సత్తెనపల్లిలో సంక్రాంతి లక్కీ డ్రా పేరుతో వసూళ్ల కేసులో బెయిల్ రావడంతో అంబటి రాంబాబు రిలీజ్ అయ్యారు. అక్కడి నుంచి గుంటూరుకు అంబటి ర్యాలీగా రావాలని భావించారు. రాజమండ్రి నుంచి గుంటూరు బయలుదేరిన అంబటి రాంబాబుకు పోలీసులు అడుగడుగునా అడ్డుగా నిలిచారు. మూడుకు నుంచి వాహనాలు ఉండకూడదని అభ్యంతరాలు వ్యక్తం చేసిన పోలీసులు.. అంబటి వాహనం కదిలిన వెంటనే మిగిలిన వాహనాలను అడ్డుకున్నారు.
ఇక ఆ తర్వాత వాహనం దిగి అంబటి వెనక్కు వచ్చారు. ఈ సందర్భంగా పోలీసులపై అంబటి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు. ఇక అక్కడ వైసీపీ నేతలు.. జక్కంపూడి రాజా సహా ఇతరులు ఆందోళన వ్యక్తం చేసారు. ఇక అక్కడి నుంచి మూడు వాహనాలలో అంబటి గుంటూరు చేరుకోవాలి అనుకోగా.. గుంటూరు వచ్చే ముందే అంబటి కాన్వాయ్ లో మరిన్ని వాహనాలు చేరాయి. ఆయన ర్యాలీగా రావడంతో కాజ టోల్ గేట్ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. అక్కడ అంబటి పోలీసులతో గొడవకు దిగారు.
ర్యాలీని ఎలా అడ్డుకుంటారంటూ పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేసారు. పోలీసులకు, అంబటి రాంబాబుకు మధ్య వాగ్వాదం కూడా చోటు చేసుకుంది. ఇక కాజా టోల్ గేటు వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అంబటి వర్సెస్ పోలీసులుగా వాతావరణం మారిపోయింది. ర్యాలీలకు ఎలాంటి ముందస్తు అనుమతి లేదని గుంటూరు పోలీసులు స్పష్టం చేసారు. గుంటూరు ఇన్నర్ రింగ్ రోడ్డులోని రిలయన్స్ పెట్రోల్ బంక్ వద్ద అంబటి కాన్వాయ్‌ను పోలీసులు అడ్డుకున్నారు. దీనితో పోలీసులకు, వైసీపీ నేతలకు మధ్య తోపులాట కూడా జరిగింది.
అనుమతి లేదన్నా, పోలీసుల మాటను లెక్కచేయకుండా బారిగేట్లను పక్కకు తోసి ముందుకు వెళ్లే ప్రయత్నం చేసారు అంబటి సోదరుడు మురళీకృష్ణ. ఈ గొడవతో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయిన పరిస్థితి. ఇలా అంబటి రాంబాబు.. సైలెంట్ గా ఉంటారని అందరూ ఊహిస్తే.. ఆయనలో అదే పొగరు చూసి షాక్ అయ్యారు. ఆయన గుంటూరు చేరుకునే వరకు కూడా ఉద్రిక్త వాతావరణమే నడిచింది. ఈ టైం లో ఆయన చేసిన కామెంట్స్ కూడా తీవ్ర సంచలనం అయ్యాయి.
కాజా టోల్ గేటు వద్ద భారీ కాన్వాయ్ లో అంబటి వచ్చే ప్రయత్నం చేయగా.. ఎలా పడితే అలా వస్తే ప్రజలకు తీవ్ర ఇబ్బంది కలుగుతుందని అంబటి రాంబాబుకు మంగళగిరి ఎస్సై వెంకట్ హెచ్చరించే ప్రయత్నం చేసారు. ఎస్సై వెంకట్ పై అంబటి ఫైర్ అయ్యారు. నీ అంతు చూస్తా అంటూ రెచ్చిపోయారు అంబటి. అక్కడే పోలీసులు కూడా అంబటికి ఎదురు తిరిగారు. అంతకు ముందు కూడా అంబటి ఇలాగే ఘాటు వ్యాఖ్యలు చేసారు. ప్రభుత్వంపై అంబటి తీవ్ర వ్యాఖ్యలు చేసారు.
తన ఇంటిపై సుమారు 7 గంటల పాటు దాడి జరిగిందని.. ఆ దాడిలో తన భార్యాబిడ్డలను తీవ్రంగా వేధించారని అంబటి ఆవేదనగా మాట్లాడారు. స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్.. తన ఇంటిపై జరిగిన దాడిని పర్యవేక్షించారని మండిపడ్డారు. తనను చంపేందుకు ప్రయత్నించినప్పటికీ తాను మాత్రం భయపడేది లేదని అంబటి ఘాటు కామెంట్స్ చేసారు. ప్రజాస్వామ్యబద్ధంగా పోరాటం చేసి.. చంద్రబాబు సర్కార్‌ను కూల్చేందుకు కృషి చేస్తాను అంటూ అంబటి రెచ్చిపోయారు.
ఇలా తన పర్యటన మొత్తం అంబటి రాంబాబు ఎక్కడా కూడా వెనక్కు తగ్గలేదు. పోలీసులకు గానీ, ప్రభుత్వానికి గానీ అంబటి భయపడకపోవడం గమనార్హం. చాలా మంది వైసీపీ నేతలతో పోలిస్తే అంబటి చాలా వేగంగానే జైలు నుంచి బయటకు వచ్చారు. 14 రోజుల రిమాండ్ తో జైలుకు వెళ్ళిన నందిగం సురేష్, పిన్నెల్లి సోదరులు, బోరుగడ్డ అనీల్ కుమార్, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, మిథున్ రెడ్డి వంటి వాళ్ళ కంటే అంబటి చాలా వేగంగా జైలు నుంచి బయటకు వచ్చేశారు.