తీహార్ జైలుకు స్టార్ కమెడియన్.. వేడుకున్నా వదలని కోర్టు.. రాజ్‌పాల్ యాదవ్ జీవితంలో ఊహించని మలుపు..!

వెండితెరపై తనదైన హాస్యం, అమాయకపు చూపులతో కోట్ల మందిని కడుపుబ్బ నవ్వించిన బాలీవుడ్ స్టార్ కమెడియన్ రాజ్‌పాల్ యాదవ్ జీవితంలో ఊహించని విషాదం చోటు చేసుకుంది.

Post Published By: dialnews
Updated : 10 February 2026, 7:00 PM IST

వెండితెరపై తనదైన హాస్యం, అమాయకపు చూపులతో కోట్ల మందిని కడుపుబ్బ నవ్వించిన బాలీవుడ్ స్టార్ కమెడియన్ రాజ్‌పాల్ యాదవ్ జీవితంలో ఊహించని విషాదం చోటు చేసుకుంది. ఎప్పుడూ నవ్వుతూ, నవ్విస్తూ కనిపించే ఆయన.. కన్నీళ్లతో తిహార్ జైలు గోడల మధ్యకు వెళ్లాల్సి వచ్చింది. రీల్ లైఫ్‌లో ఎన్నో సమస్యలను తన కామెడీతో సింపుల్‌గా పరిష్కరించే ఈ నటుడు.. రియల్ లైఫ్‌లో మాత్రం ఆర్థిక చిక్కుల్లో చిక్కుకొని జైలు పాలవ్వడం ఇండస్ట్రీని, ఆయన ఫ్యాన్స్ ను దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ సమస్యలన్నింటికీ మూలం 2010లో ఆయన తీసుకున్న ఒక నిర్ణయం. నటుడిగానే కాకుండా దర్శకుడిగా కూడా తన ప్రతిభను నిరూపించుకోవాలనే తపనతో అతా పతా లాపతా అనే సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమా నిర్మాణం కోసం ఢిల్లీకి చెందిన ఒక సంస్థ నుంచి రాజ్‌పాల్ యాదవ్ దాదాపు రూ. 5 కోట్లు అప్పుగా తీసుకున్నారు.

అయితే సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో ఆడకపోవడం.. ఇతర ఆర్థిక ఇబ్బందుల వల్ల ఆ అప్పును సరైన సమయంలో తీర్చలేకపోయారు. తీసుకున్న అప్పు తీర్చకపోవడంతో, వడ్డీతో కలిపి ఆ మొత్తం తడిసి మోపెడైంది. అసలు రూ. 5 కోట్లు కాస్తా.. దాదాపు రూ. 9 కోట్లకు పైగా చేరింది. అప్పు ఇచ్చిన సంస్థ న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో ఈ వ్యవహారం చెక్ బౌన్స్ కేసుగా మారింది. రాజ్‌పాల్ యాదవ్, ఆయన భార్య రాధా యాదవ్‌లపై కేసులు నమోదయ్యాయి. ఈ కేసు విచారణ చాలా కాలంగా ఢిల్లీ హైకోర్టులో నడుస్తోంది. అప్పు తీర్చడానికి రాజ్‌పాల్ పలుమార్లు గడువు కోరినప్పటికీ, ఆ విషయాన్ని కోర్టు సీరియస్‌గా పరిగణించింది. తాజాగా ఈ కేసు విచారణ సందర్భంగా ఢిల్లీ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇంకెంత కాలం గడువు కావాలంటూ ప్రశ్నిస్తూనే.. ఇక గడువు ఇచ్చేది లేదని, వెంటనే లొంగిపోవాలని ఆదేశించింది.

న్యాయస్థానం ఆదేశాలతో రాజ్‌పాల్ యాదవ్ కన్నీటి పర్యంతమయ్యారు. మూడు నెలల జైలు శిక్ష అనుభవించడానికి ఆయనను ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకొని తిహార్ జైలుకు తరలించారు. ఒక స్టార్ కమెడియన్ ఇలా పోలీసుల అదుపులో వెళ్తున్న దృశ్యాలు చూసి అభిమానులు షాక్‌కు గురయ్యారు. ఒక్క సినిమా.. రాజ్‌పాల్ యాదవ్ తలరాతను పూర్తిగా మార్చేసింది. కోట్లాది మంది అభిమానులు ఉన్న స్టార్ హీరో అయినా.. సెలబ్రిటీ అయినా చట్టం ముందు అందరూ సమానమేనని ఈ ఘటన మరోసారి రుజువు చేసింది. వెండితెరపై ఎంతో మందిని నవ్వించిన రాజ్‌పాల్.. ఇప్పుడు జైలు ఊచలు లెక్కపెడుతూ ఉండటం నిజంగా విచారకరం. ఆయన త్వరగా ఈ సమస్యల నుంచి బయటపడి మళ్ళీ సినిమాల్లోకి రావాలని.. తన నటనతో అలరించాలని అభిమానులు కోరుకుంటున్నారు.

Published : 
  • 10 February 2026, 7:00 PM IST